తెలుగునేలపై మహానటుడు ఎన్టీఆర్ నాటిన రాజకీయ భీజం తెలుగుదేశం పార్టీగా వటవృక్షమైంది. ఎన్టీఆర్ పోలికలను పుణికిపుచ్చుకున్న ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ పై ఈ పార్టీ ప్రభావం పడుతూనే ఉంది.
‘ఆట నాది కోటి మీది’ అంటూ జెమినీ టీవీ గేమ్ షో హోస్ట్ గా రాబోతూ మీడియా ముందుకు వచ్చిన సందర్భంలోనూ ఎన్టీఆర్ పై రాజకీయా అస్త్రాలు సంధించారు. దానికి ఎన్టీఆర్ తెలివిగా సమాధానం ఇచ్చారు. ఇది సమయమూ కాదు సందర్భమూ కాదు అంటూ దాటవేశారు. నిన్ననే ‘తెల్లవారితే గురువారం’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలోనూ ఎన్టీఆర్ ఈ రాజకీయ ఒత్తిడిని ఎదుర్కోక తప్పలేదు. ఆయన అభిమానలు ‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు చేయడంతో ఎన్టీఆర్ ఒకింత అసహనానికి లోనయ్యారు. ఈ సమయంలో ఎన్టీఆర్ పై ఎందుకీ రాజకీయ పరమైన ఒత్తిడి వస్తోంది అన్న ప్రశ్న తలెత్తులోంది. ఓ పక్క సినిమాలు, ఇంకో పక్క గేమ్ షో హోస్ట్ గానూ ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు.
భవిష్యత్ రాజకీయాలకు ఎన్టీఆర్ ఓ ఆశాకిరణం అనడంలో అతిశయోక్తి ఎంతమాత్రమూ లేదు. అయితే ఇది ఎన్నికల సమయం కాకపోయినా ఎన్టీఆర్ పై ఈ రకమైన రాజకీయ ఒత్తిడిని అభిమానులు తేవడానికి ప్రత్యేకమైన కారణం ఏమిటన్నది అంతుబట్టడం లేదు. ఆయన రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారన్నది మాత్రం స్పష్టమవుతోంది. పార్టీకి ఆయన అవసరం ఉందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే మహానాటుడు ఎన్టీఆర్ వటవృక్షంలా చేసిన తెలుగు దేశం పార్టీకి ప్రత్యక్షంగా ఎన్టీఆర్ సేవలు అవసరమని ఆయన అభిమానులు కోరుకుంటున్నారని అనుకోవలసి వస్తోంది.
ఈ ధరిత్రిలో ఎన్టీఆర్ పేరే ఓ చరిత్ర
తెలుగు సినిమా అనే ఓ మహా పుస్తకంలో సువర్ణ అక్షరాలతో లిఖించిన పేరిది. సైకిల్ పై ఓ పాల క్యానుతో ప్రారంభమైన జీవితం.. అదే సైకిలెక్కి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిందంటే అది మామూలు విషయం కాదు. మరి ఇలాంటి చరిత్ర చర్విత చరణమయ్యేది ఎప్పుడు? ఈ నట వారసత్వం సినిమాలకే పరిమితమవుతుందా.. రాజకీయ వారసత్వం ఉండదా?.. లాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది జూనియర్ ఎన్టీఆరే. ఎందుకంటే ఇంతకుముందు పార్టీ ప్రచార బాధ్యతలను కూడా ఆయన తీసుకున్నారు.
Must Read ;- రాజకీయాలపై ప్రశ్నకు ఎన్టీఆర్ రామబాణం లాంటి జవాబు
చరిత్రలోకి వెళితే..
ఎన్టీఆర్ అనే పునాది మీదే తెలుగు దేశం పార్టీ అనే అందమైన రాజకీయ సౌధం నిర్మితమైంది. రాజకీయమనే కురుక్షేత్రంలో ఆ తారక రాముడి రథానికి హరికృష్ణుడి సారథ్యం సాగింది.. విజయ కేతనం ఎగిరింది. ఒక విధంగా నటనతో పాటు అలా రాజకీయ వారసత్వం ఎన్టీఆర్ వారసులకు వచ్చింది. ఎన్టీఆర్ తర్వాత తెలుగుదేశం పార్టీకి అంతటి వెలుగులను ఆయన తర్వాత నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు. ప్రస్తుతం మూడో తరం భుజస్కంధాలపైనే ఈ భారం పడబోతోంది.
నలుగురూ నాలుగు భుజాలు కాస్తేనే పార్టీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుంది. సాధారణంగా ఒక తరం వైభవం మూడో తరంలో కనిపిస్తుందంటారు. అది జూనియర్ ఎన్టీఆర్ రూపంలో నెరవేరుతుందా లేదా అన్నది కాలమే సమాధానం చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ 18 ఏళ్ల వయసులోనే సినీ పరిశ్రమ రికార్డులను తిరగ రాశారు. ఈ విషయంలో తాతను మించిన మనవడు అనే పేరును కూడా సంపాదించుకున్నాడు. తాత పోషించిన పాత్రలను ఆయన పోషించక పోవచ్చుగానీ కొత్త రికార్డులను మాత్రం కొల్లగొట్టాడు.
2009 నాటి దూకుడు ఏది?
2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రదర్శించిన దూకుడు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినా నేటికీ ఎన్టీఆర్ ప్రచార శైలిని ఎవరూ మరచిపోలేదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ వివాహం విషయంలోనూ నారా చంద్రబాబు నాయుడు చాలా తోడ్పాటునందించారు. తన మేనల్లుడి కుమార్తెకే ఇచ్చి వివాహం జరిపించారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ రాజకీయాల జోలికి పోకుండా తన మానాన తాను సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అసలు గత అసెంబ్లీ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రచారం చేసి ఉంటే పార్టీకి ఎంతో కొంత మేలుచేకూరి ఉండేదనేవారు చాలామందే ఉన్నారు.
ఆ మౌనానికి అర్థం ఏమిటి?
రాజకీయాల ప్రస్తావన వస్తున్నప్పుడు జూనియర్ మౌనంగా ఉండటంలో ఆంతర్యం ఏమిటన్నది అంతుబట్టడం లేదు. గత ఏడాది ఎన్నికల సమయంలోనూ ఎన్టీఆర్ ప్రచారానికి దూరంగా ఉన్నారు. రాజకీయం అనే గోలకు దూరంగా ఎన్టీఆర్ ఉంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం అభ్యర్థిగా జూనియర్ ఎన్టీఆర్ సోదరి నందమూరి సుహాసిని పోటీ చేసినప్పుడు కూడా ఎన్టీఆర్ నుంచి స్పందన లేదు. కొన్ని ఇంటర్వ్యూల సమయంలో కూడా ఆయన తెలివిగా వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవిపై చర్చ వచ్చినపుడు జీవితంలో రాని పేజీపై ఇప్పుడే మాట్లాడుకుని ప్రయోజనం లేదంటూ వ్యాఖ్యాలు చేశారు.
సినిమా అనేది తనకు బతుకు తెరువని, రాజకీయం అనేది ఓ బాధ్యత అని తెలివిగా మాట్లాడుతున్నారు. తెలుగు దేశం పార్టీకి ప్రచారం చేసిన అంశాన్ని ప్రస్తావిస్తే ఎన్టీఆర్ మనవడిగా పుట్టినందుకు తన వంతు బాధ్యతగానే ఆనాడు ప్రచారం చేశానని, ఆ బాధ్యతను నెరవేర్చుకున్నానని వ్యాఖ్యలు చేశారు. జూనియర్ భవిష్యత్తులోనైనా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తారని మహానటుడు ఎన్టీఆర్ అభిమానులు ఆశపడుతున్నారు. అందుకే ఎన్టీఆర్ ఏదైనా సినిమా ఫంక్షన్లకు హాజరైతే ఈ విధమైన నినాదాలు చేస్తున్నారు. రాజకీయాలపై జూనియర్ ఎన్టీఆర్ ఓ స్పష్టమైన వైఖరిని ఏదో ఒక సందర్భంలో వ్యక్తం చేస్తే తప్ప ఆయన అభిమానులు మౌనం వహించేలా లేరు.
– హేమసుందర్ పామర్తి
Also Read ;- సినీ, రాజకీయ రంగాల్లో.. ఎన్టీఆర్ ఓ లెజెండ్..!