ప్రముఖ జర్నటిస్టు వినోద్ దువాపై పెట్టిన రాజద్రోహం కేసును సుప్రీంకోర్టు ఇవాళ కొట్టి వేసింది.అంతేకాదు,1962 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి జర్నలిస్టుకు రక్షణ పొందే హక్కు ఉందని ధర్మాసనం తేల్చి చెప్పింది.గత ఏడాది ఢిల్లీలో జరిగిన అల్లర్లపై వినోద్ దువా తన యూట్యూబ్ ఛానల్లో ఓ వార్త ప్రసారం చేశారు.తప్పుడు వార్తలు ప్రచారం చేశారంటూ హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు దువాపై రాజద్రోహం కేసు నమోదైంది.దీనిపై వినోద్ దువా సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.గతంలోనే ఈ కేసుపై విచారించిన సుప్రీంకోర్టు,అతనిపై ఎలాంటి చర్యలకు దిగకుండా రక్షణ కల్పించింది.
కేసు కొట్టివేశారు
తాజాగా వినోద్ దువా కేసును విచారించిన సుప్రీంకోర్టు,1962 కేధార్‌నాథ్ సింగ్ కేసు తీర్పును ఉటంకిస్తూ…. ఇలాంటి కేసుల్లో ప్రతి జర్నలిస్టు రక్షణ పొందే హక్కు ఉందని,కేసును కొట్టివేసింది.ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ బలమైన పదాలు ఉపయోగించినంత మాత్రాన అది రాజద్రోహం కేసు కిందకు రాదని ధర్మాసనం తేల్చి చెప్పింది.వినోద్ దువాపై కేసును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.
ఏబీఎన్, టీవీ5లపై ఇవే కేసులు..
ఇటీవల వైసీపీ ఎంపీ రఘురామరాజుపై రాజద్రోహం కేసు పెట్టిన ఏపీ ప్రభుత్వం,ఏ2,ఏ3లుగా ఏబీఎన్,టీవీ5లను చేర్చారు.దీంతో ఆ సంస్థల యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.ఇప్పటికే ఆ సంస్థలపై ఎలాంటి దుందుడుకు చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.తదుపరి విచారణలో ఈ మీడియా సంస్థలకు కూడా అనుకూల తీర్పు వచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Must Read ;- సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. నెలలో నాలుగు విలక్షణ తీర్పులు