తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం పెను కలకలం రేపిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారం మరింత సంచలనంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీగా కొనసాగుతున్న రఘురాజుపై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసు… ఆ కేసులో పెట్టిన సెక్షన్లు చూస్తుంటే ఈ విషయం ఇట్టే అర్థం కాకమానదు. రఘురామరాజుపై ఏకంగా దేశద్రోహం కేసు నమోదు చేసిన సీఐడీ పోలీసులు… ఆయన పాల్పడ్డ దేశద్రోహంలో మరో ఇద్దరు భాగస్వాములు కూడా ఉన్నట్లుగా తేల్చేశారు.ఆ ఇద్దరూ ఎవరంటే… టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానెళ్లు.ఈ లెక్కన శుక్రవారం రఘురామరాజు అరెస్ట్ అయితే… త్వరలోనే ఈ రెండు ఛానెళ్లకు చెందిన కీలక వ్యక్తుల అరెస్ట్ తప్పదన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
ఎఫ్ఐఆర్‌లో ఏముందంటే..
రఘురామరాజుపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో ఏముందన్న విషయానికి వస్తే… ఒక పథకం ప్రకారం కొన్ని మీడియా చానళ్లతో కలిసి ఆయన కుట్ర పన్నారు.కులం, మతం ప్రాతిపదికన విభజన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తిని రెచ్చగొట్టేలా కుట్రలకు పాల్పడ్డారు.రెడ్డి,క్రిస్టియన్ వర్గాలను రఘురామరాజు టార్గెట్ చేశారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధిక్కార స్వరాన్ని వినిపించేందుకు కొన్ని టీవీ చానళ్లతో కలిసి కుట్రపన్నారు. ఏబీఎన్, టీవీ5 చానళ్లు రఘురమరాజుకు స్లాట్స్ కేటాయించాయి.వీరందరూ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి.మంగళగిరి సీఐడీ పోలీస్ స్టేషన్‌లో రఘురామరాజుపై కేసు నమోదు చేశారు. 124 ఏ (దేశ ద్రోహం), 153 ఏ (వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం),రెడ్ విత్ 120 బీ (నేరపూరిత కుట్ర),505 (రెచ్చగొట్టడం) సెక్షన్లపై కేసు బుక్ చేశారు.ఈ కేసులలో ఏ1గా రఘురాజు, ఏ2గా టీవీ5, ఏ3గా ఏబీఎన్ చానళ్లను చేర్చారు.సీఐడీ డీజీ రిపోర్టు ఆధారంగా కేసును నమోదు చేశారు.
మరి కొందరి అరెస్టులకు అవకాశాలు..?
రఘురామరాజు వ్యవహారంలో సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసు…అందులో పేర్కొన్న అంశాలను బట్టి చూస్తుంటే…త్వరలోనే టీవీ5 ఛానెల్ లో పనిచేస్తున్న సాంబశివరావు, మూర్తి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న వెంకటకృష్ణలను కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.తన పార్టీ టికెట్‌పై ఎంపీగా విజయం సాధించిన రఘురామరాజు…ఆ తర్వాత తెలుగు దేశం అనుకూల స్టాండ్ తీసుకుని తనపైనా,తన ప్రభుత్వంపైనా ఉద్దేశపూర్వకంగానే విష ప్రచారం చేస్తున్నారన్న భావనతో జగన్ ఈ కేసులు పెట్టినట్టుగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. మరి ఈ కేసులో ఇంకెంత మేర సంచలనాలు చోటుచేసుకుంటాయో చూడాలి.
Miust Read ;- రఘురామరాజు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు.. సెషన్స్ కోర్టుకు వెళ్లాలని సూచన