భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తరవాత జస్టిస్ ఎన్వీ రమణ నెల రోజుల్లో సంచలన తీర్పులు ఇచ్చారు.ఈ తీర్పుల్లో చట్టం అమలు,హక్కుల పరిరక్షణ,సాక్ష్యాధారాలు తదితర అంశాలపై మార్గదర్శకాలు చేశారని చెప్పవచ్చు.ప్రతి కేసులో ఉండే పరిస్థితులు,వ్యక్తుల స్వభావాలు,నేర చరిత్ర,ఆధారాలను బట్టి తీర్పులుండే పరిస్థితి ఉంటుందని గతంలోనే చెప్పిన జస్టిస్ ఎన్వీ రమణ గత నెల రోజుల్లో ఇచ్చిన కీలక తీర్పులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అందులో దిశానిర్దేశంగా మారిన నాలుగు కేసులు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి.
సంజయ్‌కుమార్ రాయ్ వర్సెస్ యూపీ కేసు..
సంజయ్‌కుమార్ రాయ్ వర్సెస్ యూపీ కేసులో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.కొన్ని కేసుల్లో దర్యాప్తు,ట్రయల్ తీరు పోస్టాఫీసులా మారకూడదని వ్యాఖ్యానించారు.సరైన ఆధారాల్లేకుండా ఎలా ప్రాసిక్యూట్ చేస్తారని ప్రశ్నించారు.ఈ కేసు వివరాల్లోకి వెళ్తే సంజయ్‌కుమార్ మరో వ్యక్తిని ఫోన్‌లో చంపేస్తామని బెదిరించాడనే ఫిర్యాదు పోలీసులకు అందింది.ఈ కేసు ట్రయల్ కోర్టు,హైకోర్టులో విచారణ జరిగింది.సంజయ్‌కుమార్‌కి శిక్ష పడింది.అయితే సంజయ్‌కుమార్ సుప్రీంను ఆశ్రయించడంతో పాటు హక్కులకు భంగం కల్గించడం,స్వేచ్ఛను హరించడాన్ని కూడా పిటిషన్లో పేర్కొన్నారు.దీనిపై విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ,న్యాయమూర్తి జస్టిస్ అనురుథ్ భోస్‌లతో కూడిన సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.ఈ కేసులో సాక్ష్యాలు లేవని,కనీస విచారణ కూడా దిగువస్థాయిలో జరగలేదని వ్యాఖ్యానించింది.సరైన ఆధారాల్లేకపోగా నిందితుడైన సంజయ్‌కుమార్ బాధితుడిగా చెబుతున్న వ్యక్తిని ఫోన్‌లో చంపేస్తామని బెదిరించాడంటూ తాము స్పీకర్ ఆన్ చేసి ఉండడంతో విన్నామనే ఇద్దరు సాక్షులు చెప్పిన వివరాలే సాక్ష్యాలుగా చూపెట్టడాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించలేదు.నిందితుడి హక్కులు కూడా పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని ఈ కేసులో మార్గనిర్దేశం చేశారు.హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయడంతో పాటు వ్యక్తులకు ఉండే జీవించే హక్కును హరించే అధికారం న్యాయస్థానాలకూ లేదని వ్యాఖ్యానించింది.
Must Read ;- జస్టీస్ ఎన్వీ రమణ సంచలన నిర్ణయం : కోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారానికి సిద్ధంonline court casescourt cases online
ముందస్తు బెయిల్ కేసులో..
కాగా మరో కేసులో ముందస్తు బెయిల్ విషయంలో కొన్ని వ్యాఖ్యలు చేసింది.ముందస్తు బెయిల్ తిరస్కరించాల్సి వస్తే లొంగిపోయేందుకు అవకాశం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.అసాధారణ పరిస్థితుల్లోనే అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ముందస్తు బెయిల్‌ను మంజూరు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.నాథూ సింగ్ వర్సెస్ యూపీ కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది.కేసులో ముందస్తు బెయిల్ నిరాకరించే సమయంలో పిటిషనర్ వాదనలను,పరిస్థితిని గమనించాలన్నారు.చట్టాల్లో పేర్కొన్న భాష,అర్థం విషయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని,చట్టాలు దుర్వినియోగం కాకుండా చూసే బాధ్యత కోర్టులదే అన్నారు.తప్పుడు కేసుల నుంచి నిందితులను తప్పించే బాధ్యత కోర్టులపై ఉందని చెప్పడంతో పాటు,తప్పు చేసిన వారు చట్టంలోని కొన్ని అంశాల ఆధారంగా విచారణలో జాప్యం అయ్యేలా వ్యవహరించేందుకు,శిక్ష నుంచి తప్పించుకునేలా వ్యవహరించేందుకు అవకాశం ఇవ్వకూడదని కూడా వ్యాఖ్యానించింది.భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ,న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్,జస్టిస్ అనిరుద్ధ బోస్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఓ తీర్పునిచ్చింది.ఈ కేసులో సీఆర్‌పీసీ సెక్షన్ 438ని హైకోర్టు లేదా సెషన్స్ కోర్టులు సరళంగా అన్వయించుకోవాలని పేర్కొంది.సరైన కారణాలు లేకుండానే కోర్టులు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించలేదు.సరైన కారణం లేకుండా ముందస్తు బెయిల్ ఇస్తే నిందితులను 90 రోజులపాటు అరెస్టు నుంచి రక్షించినట్టు అవుతుందని,వాస్తవాలు,పరిస్థితుల ఆధారంగా ముందస్తు బెయిల్‌కు నిర్ణీత కాలాన్ని హైకోర్టు లేదా సెషన్స్ కోర్టు నిర్ణయించవచ్చునని సూచించింది.దర్యాప్తు సంస్థల ఆందోళనను పరిగణనలోకి తీసుకొంటూనే,పిటిషనర్ ప్రయోజనాలు,రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను రక్షించేలా ఉత్తర్వులు ఉండాలని సూచించింది.ఈ కేసులో తీవ్రతను పరిగణనలోకి తీసుకొని నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపించి,దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది.
సద్‌బిర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హరియాణ కేసు..
సద్‌బిర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హరియాణ కేసులో ట్రయల్ కోర్టు,హైకోర్టు ఇచ్చిన తీర్పులను కొట్టేసింది సర్వోన్నత న్యాయస్థానం.వరకట్నం డిమాండ్ చేయడం వల్లే మహిళ ఆత్మహత్య చేసుకుందని నమోదైన ఈ కేసులో నిందితుడైన సద్‌బిర్ సింగ్‌కు దిగువ న్యాయస్థానం శిక్ష విధించింది.దీనిపై నిందితుడు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తాను నేరం చేశామని ప్రాసిక్యూషన్ నిరూపించలేక పోయిందని,బాధితురాలు ఏడాదిన్నరలోపే చనిపోయిందనే కారణంతోనే తనపై అభియోగాలు మోపారని పిటిషనర్ వాదించాడు.దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం చట్టాల్లో పేర్కొన్న భాషను,సెక్షన్లను సరైన విధంగా అర్థం చేసుకోవాలని,లేని పక్షంలో చట్టాలు దుర్వినియోగం అవుతాయన్నారు.కేవలం సాక్షులు చెప్పిన వివరాల మేరకు నిర్దారణకు రావడం సరికాదని పేర్కొన్నారు.కొన్ని కేసుల్లో దూరంగా నివసిస్తున్నా,సంబంధం లేకుండా నిందితులుగా చేర్చుతున్నారని,నిందితుల్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ట్రయల్ కోర్టులదేనని వ్యాఖ్యానించారు.
గుర్మిత్ సింగ్ వర్సెస్ పంజాబ్ కేసులో..
గుర్మిత్ సింగ్ వర్సెస్ పంజాబ్ కేసులో ట్రయల్ కోర్టులు,హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.ఇది కూడా వరకట్న వేధింపులకు సంబంధించిన కేసే.ఈ కేసులో 304-బి,వరకట్న వేధింపుల వల్ల మరణం,498-ఎ మహిళలపై వేధింపుల కేసును సమర్థించింది.నిందితులు చట్టపరమైన నిబంధనలను దుర్వినియోగం చేయడానికి అనుమతించవద్దని ధర్మాసనం హెచ్చరించింది.సద్‌బిర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హరియాణ కేసు,గుర్మిత్ సింగ్ వర్సెస్ పంజాబ్ కేసుల్లో రెండు విలక్షణమైన తీర్పులు ఇచ్చింది.ఈ రెండు కేసుల్లో,సెక్షన్ 304-బి ఐపిసి కింద విచారణకు సంబంధించిన మార్గదర్శకాలను నిర్దేశించింది.
Must Read ;- సవాళ్లను ఎదుర్కొని, ప్రతిభను చాటుకుని.. సీజేగా ఎన్వీ రమణ










