కాయలున్న చెట్టు మీదనే రాళ్లు పడతాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది? మంచి అభిరుచితో చక్కటి చిత్రాలు తీస్తూ ప్రేక్షకుల మన్ననలను తమిళ హీరో సూర్య అందుకుంటున్న సంగతి తెలిసిందే. అంతకుముందు ఆయన నిర్మించిన ‘ఆకాశం నీ హద్దురా’ గానీ, తాజాగా ‘జైభీమ్’ సినిమా గాని ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టాయి. కానీ ఇప్పుడు ఏకంగా ఆయననే కొట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి కారణం ‘జైభీమ్’ సినిమా. ఓటీటీలో రిలీజైన ఈ సినిమాలోని వివాదాస్పదం అనిపించిన దృశ్యాలను బూతద్దంలోంచి చూస్తూ ఆయనపై దాడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ సినిమాలో ఓ సన్నివేశంలో మతపరమైన గుర్తు ఉండటంతో ఓ వర్గం నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా ద్వారా వన్నియార్ కులస్తులను కించ పర్చారన్నది ప్రధాన అభియోగం. నిర్మాత, దర్శకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ వర్గం వారు కోరుతున్నారు. పీఎంకే పార్టీ దీన్ని భుజాన వేసుకుంది. ఆ పార్టీ మైలాదురై జిల్లా కార్యదర్శి పన్నీర్ సెల్వం అక్కడి పోలీస్ సూపరింటెండెంట్ కూడా వినతి పత్రం అందజేశారు. దీనికి ప్రతిఫలంగా రూ. ఐదు కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండు చేస్తున్నారు.
ఈ విషయంలో వన్నియార్ సంఘం పట్టుదలగా ఉంది. హీరో సూర్యను కొట్టిన వారికి లక్ష రూపాయల బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు హీరో సూర్యకు అదేపనిగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దాంతో పోలీసులు ఆయనకు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. సూర్య ఇంటి వద్ద పోలీసులు హైసెక్యూరిటీ ఏర్పాటు చేశారు. దాంతో సూర్యకు కూడా మద్దతు పెరుగుతోంది. వుయ్ స్టాండ్ విత్ సూర్య అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియా అంతా సూర్యకు మద్దతుగా నిలిచింది. సినిమా ఇండస్ట్రీ కూడా సూర్య వెనకే ఉంది. ఏంజరిగినా తాము అండగా నిలుస్తామని సూర్యకు భరోసా ఇచ్చారు.
Must Read ;- ఐఎండీబీ టాప్ 250లో అగ్రస్థానంలో జైభీమ్











