ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కడ చూసినా.. సుశాంత్ ఆత్మహత్య పై వార్తలే వినపడుతున్నాయి. ఆయన అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. థ్రిల్లర్ మూవీని తలపించేలా ఈ వ్యవహారం సాగుతోంది. ఈ కేసు విచారణలో ఉండగా అనుకోకుండా బాలీవుడ్ డ్రగ్స్ కోణం బయటపడింది. ఈ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తి అరెస్ట్ అయి .. బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక సుశాంత్ ఆత్మహత్య కేసు విషయానికి వస్తే తన సోదరుడి మృతికి సంబంధించిన విచారణపై సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో సుశాంత్ కు అండగా నిలబడినవారందరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. అయితే ఏమైందో ఏమోగానీ హఠాత్తుగా బుధవారం నాడు శ్వేత సింగ్ తన ట్విటర్, ఇన్ స్టాగ్రామ్ ఖాతాలను డిలీట్ చేశారు.
ఇప్పుడు ఈ విషయం బాలీవుడ్ లోను, సుశాంత్ అభిమానుల్లోను చర్చనీయాంశమైంది. అక్టోబర్ 14వ తేది నాటికి సుశాంత్ చనిపోయి సరిగ్గా నాలుగు నెలలు అయ్యింది. ఈ సందర్భంగా శ్వేతా “నిజమైన ప్రేరణ” అంటూ ఓ వీడియోను సోషల్ మీడియలో షేర్ చేసారు. ఈ వీడియో షేర్ చేసిన కొంతసేపటికి తన సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేసారు శ్వేతా. సోషల్ మీడియా వేదిక ద్వారా సుశాంత్ కోసం పోరాడుతున్న శ్వేత హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది.
అయితే ఈమధ్య ఆమెకు బెదిరింపులు ఎక్కువయ్యాయని అందువలనే శ్వేతా సింగ్ వెనక్కి తగ్గారని సుశాంత్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఎవరు వచ్చినా రాకపోయినా మేము మాత్రం మా అభిమాన హీరో కోసం సోషల్ మీడియా ద్వారా పోరాడతామని వారు తెలిపారు. శ్వేతా సింగ్ తన సోషల్ మీడియా ఖాతాలను ఎందుకు తొలిగించారో ఆమె స్వయంగా వెల్లడిస్తే బాగుంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. శ్వేతా సింగ్ ఈ విషయంపై ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.











