స్వామి వివేకానంద. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మందలో కాదు.. వందలో ఉండటానికి ప్రయత్నించు.. అని ఆ స్వామి నూరు సంవత్సరాల కిందట చెప్పినా, అది నేటికీ ప్రతి వ్యక్తినీ నిత్యం నిద్రలేపుతూనే ఉంటుంది.
బెంగాల్ లో 1863లో జన్మించిన వివేకానంద చిన్న వయసులోనే రామకృష్ణ పరమహంసకు ప్రియ శిష్యుడుగా మారారు. వేదాంత, యోగతత్త్వ శాస్త్రాలను ఔపోనపట్టిన నరేంద్రనాథ్ దత్తా సన్యాసం స్వీకరించి స్వామి వివేకానందగా మారారు. 30 సంవత్సరాల వయసులో అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లో హిందూమత ప్రాశస్త్యం గురించి ఉపన్యాసాలు చేసి ఔరా అనిపించారు.
1893లో చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళన (పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్) సభలో వివేకానంద చేసిన ప్రసంగానికి కోట్లాది మంది ముగ్దులయ్యారు. సోదర, సోదరీమణులారా.. అంటూ వివేకానంద చేసిన సంబోధన ఆనాటి పాశ్చాత్య సంస్కృతికి మాత్రమే అలవాటు పడిన ప్రేక్షకలోకంపై సమ్మోహనాస్త్రంలా పనిచేసింది. చికాగో సభ మూడు నిమిషాలపాటు కరతాళధ్వనులతో మారుమోగిపోయింది. అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లో నాలుగేళ్లు నిర్విరామంగా ప్రసంగాలు చేసి స్వామి వివేకానంద 1897లో భారత్ కు తిరిగి వచ్చారు. భారతదేశానికి తిరిగి వచ్చిన వివేకానంద, గురువుగారి పేరుతో రామకృష్ణ మఠాన్ని స్థాపించి యువతకు దిశానిర్దేశం చేశారు. 39 ఏళ్ల వయసులో 1902లో వివేకానంద కన్నుమూశారు. వివేకానంద సేవలకు గుర్తుగా భారతప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది.
హిందూ మతాన్ని చక్కగా తెలుపగల నైపుణ్యం, వికాసవంతమైన వ్యక్తిత్వం గుణాలతో అతను కోట్లాది మంది హృదయాలను గెలవగలిగాడు. నేటికీ ఆయన ప్రవచనాలు వ్యక్తిత్వ వికాసం పేరుతో యువతకు అనుక్షణం సాధించాల్సిన లక్ష్యాలను గుర్తుచేస్తూనే ఉన్నాయి.
ఆయన మాట స్ఫూర్తిమంత్రం
స్వామి వివేకానంద మత ప్రచారకుడు అనుకుంటే పొరపడినట్లే. చిన్న వయసులోనే అనేక దేశాలను చుట్టి స్వదేశానికి వచ్చిన వివేకానంద, దేశంలోని కోట్లాది మందిని జాగృతం చేసే ప్రసంగాలు చేశారు. మనం ఇప్పుడు చెప్పుకుంటోన్న స్కిల్ డెవలప్ మెంట్ అవసరాన్ని స్వామి వివేకానంద నూరు సంవత్సరాల కిందటే గుర్తించారు. ఆయన స్థాపించిన రామకృష్ణ మఠాల్లో మత ప్రచారంకన్నా, యువత జీవితంలో ఎదగడానికి అవసరమైన నైపుణ్యాలు నేర్పడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. నాడు స్వామి వివేకానంద యువతను మేల్కోపేందుకు ఆయన చేసిన రచనలు, ప్రసంగాలు నేటి యువత లక్ష్య సాధన దిశగా పరుగులు పెట్టే శక్తినిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.
మందలో ఉండకు.. వందలో ఉండటానికి ప్రయత్నించు
దేశంలో, ప్రపంచంలో ప్రతి రోజూ ఎంతో మంది పుడుతూ, గిడుతూ ఉంటారు. కానీ నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని స్వామి వివేకానంద ఆనాడే గుర్తుచేశారు. మందలో ఉండకు, వందలో ఒకడిగా గుర్తింపు పొందేలా నీదైన ప్రతిభ చూపాలని యువతకు దిశానిర్దేశం చేశారు. ఆయన స్ఫూర్తితో నేడు లక్షలాది యువత అనుకున్న లక్ష్యం సాధించేందుకు నిరంతరం పరితపిస్తున్నారు. ఏ మాత్రం సత్తువ తగ్గినా, స్వామి వివేనానంద ప్రవచనాలు నాలుగు చదివితే చాలు, లక్ష్యం వైపు నడక సాగుతుంది. అందుకే శతాబ్దం దాటినా మరి కొన్ని శతాబ్దాలు గడచిపోయినా స్వామి వివేకానంద, యువత మదిలో శాశ్వతంగా నిలిచిపోతారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
ప్రయత్నం చేసి ఓడిపో.. కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు..
ప్రతి మనిషి తనకంటూ ఓ లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలి. ఆ లక్ష్య సాధన దిశగా నిరంతరం సాధన చేయాలి. లక్ష్యం భారీగా పెట్టుకుని నిద్రపోతే ఉపయోగం లేదు. అందుకే చనిపోయాక అంతా విశ్రాంతే.. అన్నారు స్వామి వివేకానంద. అనుకున్న లక్ష్య సాధనలో అనేక వైఫల్యాలు వస్తాయి. కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు అని జాతిని మేలుకొలిపే సందేశం ఇచ్చారు స్వామి వివేకానంద. మొదటి ప్రయత్నంలో లక్ష్యాన్ని సాధించేవారు ఉండవచ్చు. కాని నీ లక్ష్యం సాధించే వరకు మాత్ర విశ్రమించకు అని ఆయన చూపిన బాటలు నేటి యువతరానికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్నాయి.
కెరటం నాకు ఆదర్శం ..
మనలో చాలా మంది సముద్ర కెరటాలను చూసే ఉంటాం. కెరటం ఒకసారి ఉవ్వెత్తున లేచి పడిపోతుంది. పడిపోతున్నాం కదా అని కెరటం ఉవ్వెత్తున లేవడం ఆపదు. అదే నీకు ఆదర్శం అంటారు స్వామి వివేకానంద. విజయాన్ని అందుకునే ముందు ఓటములు వెక్కిరిస్తూనే ఉంటాయి. ఆ ఓటముల నుంచే పాఠాలు నేర్చుకోవాలి. అనుకున్నది సాధించే లక్ష్యంలో ప్రతి ఓటమిని గెలుపునకు మెట్లుగా మలుచుకోవాలి. అందుకే ఓటమి కూడా గెలుపే అంటారు స్వామి వివేకానంద. ప్రతి ఓటమి మనిషికి ఓ పాఠం నేర్పుతుంది. ఎలా ఓడిపోకూడదో నేర్పుతుంది. ఎలా ఓడిపోకూడదో తెలిస్తే, ఇక మిగిలింది గెలుపేకదా అంటారు స్వామి. అందుకే కెరటం నాకు ఆదర్శం… లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు.. అని భాష్యం చెప్పారు స్వామి వివేకానంద.
ఎంత చెప్పుకున్నా తక్కువే..
స్వామి వివేకానంద గురించి ఒక పుస్తకం రాసి చెప్పడం కూడా కష్టమే.. అలాంటిది ఆయన గురించి ఓ పేజీలో చెప్పడం అంటే సాహసమే. అందుకే యువతా మేలుకో.. లక్ష్య సాధనలో నిరుత్సాహం వస్తే స్వామి వివేకానంద గురించి చదువుకో.. నూటిని నూరు మార్కులు సాధించిన అనేక మంది ర్యాంకర్లు కూడా జీవితంలో ఓడిపోతున్నారు. అందుకే జీవితాన్ని కూడా చదువుకో.. జీవితాన్ని చదవాలంటే స్వామి వివేనానంద పుస్తకాలు చదవాలి మరి.
Must Read ;- ఆధునిక భారత తొలి ఉపాధ్యాయురాలు.. సావిత్రీ భాయి పూలె











