టీకాంగ్రెస్‌లో కొత్త పంచాయితీ మొదలైంది. ఇంతకాలం నాయకుల మధ్య సఖ్యత కొరవడగా దాన్ని సరిచేసేందుకు వచ్చిన పార్టీ ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాగూర్ తీరుపై సీనియర్లు ఆగ్రహంగా ఉన్నారు. పార్టీ వ్యవహరాల ఇన్‌ఛార్జిగా వచ్చిన ఠాగూర్ వ్యవహార శైలి పట్ల పలువురు సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారు. మాణిక్యం ఠాగూర్ తన సొంత నిర్ణయాలను పార్టీపై రుద్దుతున్నారని నేతలు అరోపిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుని ఎంపిక సందర్భంగా.. మెజారిటీ నిర్ణయం పేరుతో ఆయన ఎవరివి పడితే వారి అభిప్రాయం తీసుకుని కాలయాపన చేశారని ఆరోపిస్తున్నారు. తనకు నచ్చిన వ్యక్తిని టీపీసీసీ చీఫ్ స్థానంలో కూర్చోబెట్టేందుకు ప్రయత్నాలు చేసారనే విమర్శలు పార్టీలో వినిపిస్తున్నాయి. అయితే, ఇతర కారణాల వల్ల టీపీసీసీ నియమాకం ఆలస్యమైనప్పటికీ.. నేతల్లో నెలకొన్న అసంతృప్తి మాత్రం తారా స్థాయికి చేరింది.
ఠాకూర్ వాస్తవాలు అధ్యయనం చేయడం లేదు..
మాణిక్యం ఠాగూర్..రాష్ట్రంలో ప్రజాదరణ లేని నేతలపై ఎక్కువగా ఆధారపడుతున్నారనే విమర్శలున్నాయి. వరుస ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు సైతం దక్కని నేతలకు ఆయన అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని సీనియర్లు మండిపడుతున్నారు. ప్రజాదరణ కోల్పోయిన నేతల అభిప్రాయాలను కేంద్ర పార్టీకి చేరవేస్తున్నారు తప్ప క్షేత్ర స్థాయిలో వాస్తవాలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు నాయకులతో కూర్చుంటున్నారు తప్పితే కేడర్‌లో జోష్ నింపే కార్యక్రమాల రూపకల్పన చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర, రాష్ట ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ప్రజా పోరాటాలకు నేతలను సిద్ధం చేయకపోవడం.. మొక్కుబడిగా కార్యక్రమాలు సాగుతున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారంటున్నారు. పార్టీని గాడిలో పెట్టే ప్రణాళిక సైతం నేటికి సిద్ధం కాలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.
కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ..
వీటిన్నింటితో పాటు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు తప్పితే పార్టీకి సుదీర్ఘకాలంగా సేవ చేస్తున్న వారిని పట్టించుకోవడం లేదని సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అతి ముఖ్యమైన సమచారాలను కూడా సీనియర్లకు చేరవేయడం లేదని… కోట్లు ఖర్చు చేసి పార్టీ బలోపేతానికి భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసిన నేతలను సైతం మాణిక్కం గుర్తించడం లేదని అంటున్నారు. పీసీసీ రేసులో జగ్గారెడ్డి ఉన్నప్పటికీ.. కనీసం ఆయన పేరును ఆశావాహుల జాబితాలో చేర్చకపోవడం.. మాణిక్యం ఠాగూర్ అనుభవ రాహిత్యానికి అద్దం పడుతోందనే విమర్శలున్నాయి. మాణిక్కం ఠాగూర్ మరి కొంత కాలం పార్టీ ఇన్‌ఛార్జిగా ఉంటే తెలంగాణలో పార్టీ మనుగడే ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉందని, ఆయన వైఖరికి నిరసగానే సీనియర్లు ఆయనను కలవడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అధిష్టానానికి ఫిర్యాదు చేసే యోచనలో..
ఆయన ఉన్నంత కాలం పార్టీ కార్యాలయానికి రామనే నేతలు కూడా ఉన్నారు. ఆయన్ను కలిసేందుకు కొందరు సీనియర్లు ఇష్టపడటం లేదు. అయినా మాణిక్కం ఠాగూర్ మాత్రం తన వైఖరిని మార్చుకోవడం లేదంటున్నారు. దీంతో పలువురు సీనియర్లు, ముఖ్య నాయకులు ఏకంగా అధిష్టానం పెద్దలకు ఫిర్యాదు చేయాలని డిసైడ్ అయ్యారని సమాచారం. మరికొందరు ఢిల్లీ పెద్దలకు లేఖాస్త్రం సంధించేందుకు రెడీ అవున్నారు. మాణిక్యం ఠాగూర్ వైఖరి మారాలని లేకపోతే ఆయన్నే మార్చాలి అనే నినాదాన్ని కొందరు బలంగా వినిపస్తున్నారు. దీంతో తెలంగాణ హస్తం పార్టీలో అంతా అయోమయం నెలకొంది. నేతల మధ్య ఐక్యతకు కృషి చేయాల్సిన పార్టీ ఇన్‌ఛార్జిపైనే సీనియర్లు కారాలు, మిరియాలు నూరుతున్నారు. మొత్తానికి ఇన్‌ఛార్జి మారినా… టీకాంగ్రెస్ పార్టీని మాత్రం గాడిలో పెట్టలేకపోతున్నారు.
Also Read ;- దూకుడుగా బీజేపీ.. ఇంకా ఆలోచనలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు