నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ 3 లక్షల మంది రైతులు 50 రోజులుగా ఢిల్లీలో నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి సుప్రీం ఆ చట్టాలపై స్టే ఇచ్చింది. 3 లక్షల మంది రైతులు ఢిల్లీ నడిరోడ్లపై తీవ్ర చలిగాలులకు, వర్షాలకు, ఎండలకు చనిపోతుంటే కేంద్ర ప్రభుత్వం చర్చలతో కాలం గడుపుతోందని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఇక బీజేపీయేతర పక్షాలు కూడా రైతుల పక్షాన నిలిచాయి. ఈ నెల 29 నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాలను కలుపుకుని బీజేపీపై అస్త్రాలు సంధించాలని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ వ్యూహాలు సిద్దం చేస్తున్నారు.
కాంగ్రెస్ దూకుడు
ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసన దీక్షకు మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతూనే ఉంది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి రావాల్సినంత మైలేజీ రాలేదనే చెప్పాలి. ప్రతిపక్షాలు ఎవరికి వారే పోరాటాలు చేస్తూ ఉండటంతో పెద్దగా ప్రభావం చూపలేదు. ఓ వైపు రైతు సంఘాల నాయకులే నేరుగా కేంద్రంలో దఫదఫాలుగా చర్చలు జరుపుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులు కేవలం మీడియా ముందు మాట్లాడటానికి తప్ప రైతుల ఉద్యమంలో వారి పాత్ర లేకుండా పోయింది. దీనిపై ఆలోచన చేసిన సోనియా గాంధీ, ప్రతిపక్షాలను కలుపుకుని పార్లమెంట్లులో అధికార బీజేపీని వ్యవసాయ చట్టాలపై ఎండగట్టాలనే ప్రయత్నాలను ముమ్మరం చేశారని తెలుస్తోంది. ఇప్పటికైనా కాంగ్రెస్ అగ్రనేతలు కళ్లు తెరచి రైతుల పక్షాన పోరాడితే పార్టీ కోలుకునే అవకాశాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వృద్దాప్యంలో కాంగ్రెస్
దేశంలో అతిపురాతన పార్టీగా పేరున్న కాంగ్రెస్ లో వృద్ధ నాయకుల సంఖ్య ఎక్కువై పోయింది. వారు లేవలేరు, కనీసం పోరాటాలు చేయగలిగే సత్తా ఉన్న యవతకు పగ్గాలు అప్పగించరు. ఇలా జాతీయ కాంగ్రెస్ పరిస్థితి, ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయింది. కేంద్రంలో 50 సంవత్సరాలపాటు పాలన సాగించిన కాంగ్రెస్ ను మరలా అధికారంలోకి తీసుకువచ్చే చుక్కాని కనిపించడం లేదనే చెప్పాలి. 2004 నుంచి 2014 వరకు అటు సోనియా, ఇటు మన్మోహన్ ఏదో విధంగా ప్రభుత్వాన్ని నెట్టుకు వచ్చారు. నేడు ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే నాయకుడు కరవయ్యారు. కాంగ్రెస్ లో యువనేతలకు ప్రోత్సాహం లేకపోవడంతో వారు కూడా బీజేపీలోకి వలసలు పోతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పెద్దలు విశ్రాంతి తీసుకుని యువ సైనికులకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీ పుంజుకునే అవకాశాలు లేకపోలేదని తలపండిన రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Must Read ;- రైతన్నల తొలి విజయం : వ్యవసాయ చట్టాలపై సుప్రీం స్టే
సోనియా ఆరోగ్యం సహకరిస్తుందా..
ఏసీ రూముల్లో కూర్చిని ఎన్ని రాజకీయ వ్యూహాలు పన్నినా, వాటిని ప్రజల్లోకి చురుగ్గా తీసుకెళ్లగలిగే శక్తి ఒకటి కావాలి. అలాంటి నేత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కరవయ్యారు. రాహుల్ గాంధీ పార్ట్ టైమ్ పొలిటీషియన్ లా వ్యవహరించడం కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారింది. అధికార బీజేపీ చేస్తున్న తప్పులను ఎండగట్టడంతో రాహుల్ విఫలం అవుతున్నారని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండగా ఢిల్లీలో నిర్భయపై జరిగిన అత్యాచారంపై ప్రజలు, ప్రతిపక్షాలు దాటిగా పోరాటం చేశాయి. నేడు అలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నా, కాంగ్రెస్ పార్టీగానీ, ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీలు గానీ గొంతెత్తి అన్యాయాన్ని ప్రశ్నించలేకపోతున్నారు. ఇక ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతుల నిరసన సాగుతుంటే ప్రతిపక్షాల నాయకులు చోద్యం చూస్తున్నారు. రైతుల పక్షాన పోరాడాల్సిన కాంగ్రెస్ కూడా పెద్దగా మైలేజీ సాధించలేకపోయింది. దీంతో కళ్లు తెరచిన సోనియా గాంధీ, జనవరి 29న పార్లమెంటులో ప్రతిపక్షాలను కలుపుకోని పోరాడాలని ప్రయత్నం చేయడం మంచిదే. అయితే అప్పటి వరకు రైతుల నిరసన ఉంటుందని భావించలేం. ఈ లోగా నూతన వ్యవసాయ చట్టాలను సుప్రీంకోర్టు నిలువరించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. అదే జరిగితే ఇక కాంగ్రెస్ నాయకులు వారిపై వారే పోరాటాలు చేసుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు.
Also Read ;- ఏపీ విభజన నాటి నుంచి క్షీణించిన కాంగ్రెస్.. ప్రణబ్ అంతర్గతం











