తెలంగాణ కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి పీసీసీ సారథ్య బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం ముమ్మరంగా ఉన్న నేపథ్యంలో.. దింపుడు కళ్లెం ఆశలతో దానిని అడ్డుకోవడానికి కూడా అనేక మంది తమ తమ ప్రయత్నాలను ప్రారంభించారు. పార్టీ సీనియర్ నాయకుడు, సోనియా కుటుంబానికి వీర విధేయుడు హనుమంతరావు ఇలాంటి ప్రచారం మీద నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డికి పీసీసీ పీఠం అప్పగిస్తే గనుక.. తాను పార్టీని బయటకు వీడిపోతానని ఆయన ప్రకటించారు. తెలుగుదేశం నుంచి వలస వచ్చిన వారికి పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించడానికి వీల్లేదని ఆయన అన్నారు. పార్టీలోని అనేక మంది బీసీ నాయకులు.. రేవంత్ రెడ్డి కి పీసీసీ పీఠాన్ని వ్యతిరేకిస్తున్నారని కూడా వీహెచ్ సెలవిచ్చారు.
శుక్రవారం నాడు రేవంత్ రెడ్డిని పీసీసీ సారథిగా ప్రకటిస్తారనే వార్తల నేపథ్యంలో కొంత ముందుగా ప్రెస్ మీట్ పెట్టిన వీహెచ్.. ఆ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇంకా అనేక విషయాలను ఆయన మీడియాతో పంచుకున్నారు.
అపాయింట్మెంట్ దొరకడం లేదని అక్కసు
తాను పార్టీలో ఎంతో సీనియర్ అయినప్పటికీ.. తనకు అపాయింట్మెంట్ కూడా దక్కడం లేదని కొందరు నాయకులు అడ్డుకుంటున్నారని వి.హనుమంతరావు నిప్పులు చెరిగారు. ‘నేను సీనియర్ కాంగ్రెస్ నేతను.. ఇందిర కుటుంబానికి ఎంతో దగ్గరగా ఉన్నా.. భూకబ్జా దారుడిని కాదు. రాజకీయాలలో ఏం సంపాదించుకోలేదు.. అయినా సరే.. నాకు అపాయింట్మెంట్ దొరకలేదు అని ఆయన చెప్పారు. 2018 నుంచి ఇప్పటి వరకు ఎన్ని సార్లు అడిగినా అపాయింట్ మెంట్ ఇవ్వలేదని వాపోయారు. ఒక సెక్షన్ కావాలని తాను మేడమ్ సోనియాను కలవకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు. హైకమాండ్ ఈ దిశగా ఆలోచన చేయాలని, తనకు ఎందుకు అపాయింట్ మెంట్ ఇవ్వరో తెలియజెప్పాలని డిమాండ్ చేశారు.
Must Read ;- రేవంత్: ఆశపుట్టిన ప్రతిసారీ.. ఆరోపణలు పుడుతున్నాయ్!
రేవంత్ తెలంగాణ వ్యతిరేకి..
దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఓటమి పై రివ్యూ ఎందుకు చేయకుండా పార్టీకి నష్టం జరుగుతుందని వీహెచ్ చెప్పారు. రేవంత్ మాస్ లీడర్ అయితే.. గ్రేటర్ 48 సీట్లు తీసుకొని గెలిచింది.. 2 మాత్రమే ఎందుకు గెలిచారని తప్పుపట్టారు. ఆయన టీడీపీ లో ఉండగా.. తెలంగాణ కు వ్యతిరేకంగా మాట్లాడాడని, అలాంటి తెలంగాణ వ్యతిరేకికి కాంగ్రెస్ సారథ్యం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఆర్.ఎస్.ఎస్. బ్యాగ్రౌండ్ నుంచి వచ్చాడు.. టీడీపీ ని ఖతం పట్టించి.. కాంగ్రెస్ లో పడ్డాడని.. ఈ పార్టీని కూడా ఖతం చేస్తాడని ఆరోపించారు. పోలీస్ ఉద్యోగం ఇచ్చేటప్పుడే చరిత్ర చూస్తారు.. ఇంత పెద్ద బాధ్యత అప్పగించేప్పుడు రేవంత్ చరిత్ర ఎందుకు చూడడం లేదని వీహెచ్ ప్రశ్నించారు. రేవంత్ తమ్ముడు.. దళితుల భూమి కబ్జా చేస్తే మీడియా ఎందుకు రాయదని అన్నారు..
మేనేజ్ చేస్తున్నాడు..
రేవంత్.. మీడియాను పార్టీ హైకమాండ్‌ను మేనేజ్ చేస్తున్నాడని వీహెచ్ ఆరోపించారు. ఆయనను పీసీసీ సారధిగా చేస్తే.. తాను పార్టీని వీడిపోతానని హెచ్చరించారు. తనతో పాటు అనేక మంది బీసీ నాయకులు రేవంత్ కి పదవి దక్కితే పార్టీని వీడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. రేవంత్ కు పదవి ఇస్తే గనుక.. రేపటి నుంచి.. టీ.ఆర్.ఎస్. వాళ్లు …తెలంగాణ వ్యతిరేకిని పీసీసీ అద్యక్షుడు చేశారని ప్రచారం చేస్తారన్నారు. మేం.. ఆయనను కలవడానికి జైలు కు పోవాలా.. అని ప్రశ్నించారు.
లేఖ రాశా..
తెలంగాణ పార్టీ లో ప్రస్తుతం ఉన్న వాస్తవాలను వివరిస్తూ.. హైకమాండ్‌కు లెటర్ రాశానని వీహెచ్ చెప్పారు. రేవంత్ నిజంగానే మాస్ లీడర్ అయితే.. కొడంగల్ లో ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. మూడు రోజుల నుంచి తన ఫోన్‌ను.. మనిక్కమ్ ఠాగూర్ లిఫ్ట్ చేస్తలేడన్నారు. బీసీగా ఉన్న డీఎస్ రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడుగా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని.. కోమటిరెడ్డి మొదటి నుంచి పార్టీ లో ఉన్నాడని.. తెలంగాణ కోసం పోరాటం చేశాడని.. అలాంటి వ్యక్తి కి ఇవ్వాలని వీహెచ్ చెప్పుకొచ్చారు. షబ్బీర్ ఆలీ.. గతంలో ఎమ్.ఐ.ఎమ్ తో పొత్తు పెట్టించాడు.. ఇప్పుడు ఆర్.ఎస్.ఎస్ బ్యాగ్రౌండ్ ఉన్నోడికి ఇవ్వమంటాడా.. అని వీహెచ్ ఆగ్రహించారు. కొందరు పైసలకు అలవాటు పడి.. భజన చేస్తున్నారన్నారు.
రేవంత్‌పై ఫైర్
వీహెచ్ ప్రెస్ మీట్ ఆద్యంతమూ రేవంత్ మీద ఫైర్ కావడంతోనే సరిపోయింది. రేవంత్ వద్ద పైసలు ఎక్కడి నుంచి వచ్చాయో నిగ్గుతేల్చాలని .. సీబీఐకి లేఖ రాస్తానన్నారు. రేవంత్ ఊరికి పోతానని.. చరిత్ర మొత్తం తవ్వి తీస్తానని అన్నారు. పొద్దున్న లేస్తే మెఘా కృష్ణా రెడ్డి ఇంట్లో ఉంటాడని.. ఆరోపించారు. లాస్ట్ రెక్వెస్ట్ చేస్తున్న.. మేం అంటే లెక్క లేదా.. పీసీసీ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని హెచ్చరించారు. భట్టి విక్రమార్క పదవిని తొలగించే ఆలోచన కూడా తగదని హెచ్చరించారు. ఇవాళ ఉదయం నుంచి.. పొన్నం, భట్టి అందరితో మాట్లాడానని.. ఈ పరిణామాలు చూస్తోంటే బాధగా ఉందని అన్నారు.
రేవంత్ కు వ్యతిరేకంగా సెగలు రేగుతున్నాయ్
పీసీసీ పీఠం రేవంత్ రెడ్డిని వరించబోతున్నదని ఖరారు అవుతున్న నేపథ్యంలో వ్యతిరేకత కూడా అదే స్థాయిలో వెల్లువెత్తుతోంది. జగ్గారెడ్డి కూడా తన పేరును పీసీసీ పీఠం కోసం పరిశీలించకపోవడంపై ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ సభ నిర్వహించడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశానని, మనిక్కమ్ టాగూర్ కనీసం తన పేరును ప్రస్తావించకపోవడం దారుణం అని ఆయన వాపోయారు. కోమటిరెడ్డి ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్నారు.
Also Read ;- కాంగ్రెస్‌ను గట్టెక్కించే మొనగాడెవరో.. టీపీసీసీపై తీవ్ర కసరత్తు











