వంగవీటి రాధాకు పలువురు పరామర్శ..!
వంగవీటి మోహన రంగా వారసుడు రాధాకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు. తన హత్యకు రెక్కీ నిర్వహించి, పొట్టన పెట్టుకోవాలని చూస్తున్నారు.. అని వంగవీటి జయంతి నాడు రాధా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి! ఈ క్రమంలో అలెర్టైన జగన్ రెడ్డి ప్రభుత్వం రాధాకు గన్మెన్లను కేటాయించింది. అయితే గన్‌మెన్స్ అవసరం లేదు.. తనకు రంగా సైన్యం చాలు, వారే తనకు రక్షణ అని చెప్పి సీఎం ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాడు. ఈ నేపధ్యంలో రాధాను టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించాడు. రెక్కీ నిర్వహించిన వ్యవహారంపై చంద్రబాబు ఆరా తీశారు. గన్‌మెన్స్ వద్దంటూ చెప్పడం సరికాదని, వ్యక్తిగత భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని రాధాకు సలహా ఇచ్చారు. ఏ సమస్య వచ్చిన టీడీపీ మద్దతుగా నిలుస్తోందని రాధాకు భరోసా ఇచ్చారు. కుట్రలకు పాల్పడితే అందుకు వ్యతిరేకంగా పార్టీ పోరాడుతోందని రాధాకు చంద్రబాబు హామి ఇచ్చారు. అలానే జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా రాధాకు ఫోన్ చేసి పరామర్శించారు.
డీజీపీ గౌతమ్ సవాంగ్ కు చంద్రబాబు లేఖ..!
రాధా హత్యకు కుట్రలు పన్నుతున్నవారిని గుర్తించి, కఠినంగా శిక్షించాలని టీడీపీ అధినేత చంద్రబాబు.. డీజీపీ సవాంగ్ కు లేఖ రాశారు. రెక్కీ నిర్వహించిన వ్యక్తులపై సమగ్ర విచారణ జరిపి, నిందితులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఒకవేళ రాధాకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాల్సి వస్తోందని చెప్పారు. ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి బాగోలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆటవీక పాలన ఏపీలో రాజ్యమేలుతోందని, హింసాత్మక ఘటనలపై చర్యలు తీసుకోకపోవడంతోనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు.
Must Read ;- వంగవీటి రంగాలాగే.. రాధాను చంపేందుకు స్కేచ్చా?











