టీడీపీ యువనేత, బెజవాడ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వంగవీటి రాధాకృష్ణ తనం సొంత సామాజిక వర్గం కాపులను ఏకం చేసే దిశగా సంచలన వ్యాఖ్యలను చేశారు. కాపులంతా ఏకతాటిపై నిలిస్తే.. ఈ ప్రభుత్వాలను పడగొట్టడం ఎంత పని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యాలు కాపు యువతను ఉర్రూతలించాయనే చెప్పాలి. ఆవేశంతో ఊగిపోయే విషయంలో ఏ ఒక్కరికీ తీసిపోరన్న ముద్ర వేయించుకున్న రాధా.. ఇప్పుడు కాపులకు సంయమనం పాఠాలు చెబుతుంటే నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. అంతేకాకుండా తనదైన శైలి దూకుడుతో రాజకీయాల్లో ఇప్పటికే చాలా తప్పటడుగులు వేసిన రాధా.. ఇప్పుడు ఈ ప్రసంగంతో ఇకపై తాను ఆలోచన చేశాకే అడుగులు వేస్తానని, రాజకీయంగా ఇకపై తప్పులు చేయబోనని, రాజకీయంగా తనతో పాటు తన సామాజిక వర్గానికి చెందిన వారిని రాజకీయంగా ఎదిగేలా వ్యూహాలు రచిస్తానని కూడా చెప్పినట్టైందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
రాధా ఏమన్నారంటే..?
తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రుబాలెం మండలం కొత్తపాలెం గ్రామంలో తన తండ్రి మోహనరంగా విగ్రహాన్ని ఆదివారం నాడు రాధా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ఓ రేంజిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాధా ఏమన్నారంటే.. ‘‘నా తండ్రి రంగాను అన్ని వర్గాల ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. తరాలు మారినా, యుగాలు మారినా ధరిత్రి ఉన్నంత వరకు రంగా గారు ఉంటారు. రంగా కాపులకు ఆరాధ్యదైవమైతే.. అన్ని వర్గాల పేదల గుండె చప్పుడు. మన నాయకుడు రంగాను మనం కాపాడుకోలేక పోయాం. ఇప్పుడు అయినా ఆవేశం తగ్గించి ఆలోచనతో ఉన్న నాయకులను అయినా కాపాడుకోమని కోరుతున్నా. నేడు పుట్టిన కులాన్ని తిట్టడం ప్రతి అడ్డమైనోడికి ఫ్యాషన్ అయిపోయింది. వాళ్లేదో గొప్పగా భావిస్తూ.. పుట్టిన కులాన్ని వెటకారం చేస్తున్నారు. ఈ కులం వారంతా ఐక్యంగా ఉంటే ప్రభుత్వాలనే పడగొట్టే సత్తా ఉంది. ఐకమత్యమే బలం.. ఉన్నవారిని అయినా కాపాడుకోండి’’ అంటూ రాధా తన వర్గానికి హితబోధ చేసేలా సంచలన వ్యాఖ్యలే చేశారు.
పేర్ని నాని టార్గెట్ గా..
సినిమా టికెట్ల ఆన్‌లైన్ విక్రయాలను తన పరిధిలోకి తీసుకునేందుకు జగన్ సర్కారు యత్నించడం, దానికి సినిమా రంగానికి చెందిన కొందరు పెద్దలు మద్దతు పలకడం, దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనదైన శైలిలో విమర్శలు సంధించడం, ఆ విమర్శలను తిప్పి కొడుతూ ఏపీ మంత్రి, కాపు సామాజిక వర్గానికి చెందిన పేర్ని నాని ఎంటర్ అయిపోవడం, పవన్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, వాటిపై కాపు వర్గంతో పాటు బలిజ వర్గం కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వంగవీటి రాధా.. కాపులంతా ఐక్యంగా ఉంటే ప్రభుత్వాలను కూల్చేయడం పెద్ద పనేమీ కాదని వ్యాఖ్యానించడం చూస్తుంటే.. జగన్ సర్కారు కంటే కూడా పేర్ని నానిని టార్గెట్ చేసే రాధా ఈ వ్యాఖ్యలు చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- పేర్ని, పోసాని ఎపిసోడ్లతో జగన్‌కు డ్యామేజ్