TDP National General Secretary Nara Lokesh Fires At Police :
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిజంగానే ఏపీ పోలీసులకు చుక్కలు చూపారు. అకారణంగా తనను అరెస్ట్ చేసి ఎక్కడికి తరలిస్తున్నారో కూడా చెప్పకుండా.. నిరంకుశంగా వ్యవహరిస్తున్న పోలీసుల తీరు ప్రశ్నిస్తూ లోకేశ్ సంధించిన ప్రశ్నలకు పోలీసు బాసులకు నోట మాట రాలేదు. అసలు తానేం తప్పు చేశానని ఇంత హంగామా చేస్తున్నారని లోకేశ్ సంధించిన ప్రశ్నకు పోలీసుల నుంచి మౌనమే సమాధానమైంది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో కొంతకాలం క్రితం విష్ణువర్థన్ రెడ్డి అనే ప్రేమోన్మాది దాడిలో అనూష అనే విద్యార్థిని చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినా.. అతడు ఇటీవలే విడుదలయ్యాడు. నిందితుడు విడుదలైన విషయాన్ని తెలుసుకున్న నారా లోకేశ్ అనూష కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు వారికి భరోసా ఇచ్చేందుకు గురువారం నరసరావుపేట పర్యటనకు సిద్ధమయ్యారు.
ఎయిర్ పోర్టులోనే అదుపులోకి..
ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న లోకేశ్ ను ఎయిర్ పోర్టులోనే పోలీసులు అడ్డుకున్నారు. అప్పటికే గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన టీడీపీ నేతలను బుధవారం రాత్రి నుంచే హౌజ్ అరెస్ట్ చేశారు. ఇక తనకు మద్దతుగా గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చిన పార్టీ శ్రేణులను కూడా అరెస్ట్ చేశారు. ఈ విషయాన్నింటినీ గమనిస్తూనే వచ్చిన లోకేశ్.. గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆ తర్వాత పార్టీ నేతలతో కలిసి నరసరావుపేట వెళ్లేందుకు ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చేందుకు కదిలారు. అప్పటికే ఎయిర్ పోర్టు బయట ఏకంగా 3 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసు అధికారులు.. ఎయిర్ పోర్టులోనే నారా లోకేశ్ ను అడ్డుకున్నారు. నరసరావుపేట పర్యటనకు వెళ్లేందుకు అనుమతి లేదని ఆయనకు చెప్పారు. అయితే తాను నరసరావుపేటకు వెళ్లి తీరాల్సిందేనని, బాధితుల పరామర్శకు వెళుతుంటే కూడా అడ్డుకోవడమేమిటని లోకేశ్ పోలీసులను నిలదీశారు.
నాపై కేసులేమీ లేవండీ?
ఈ క్రమంలో లోకేశ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గట్టి బందోబస్తు మధ్య ఎయిర్ పోర్టు బయటకు తీసుకువచ్చి.. ఆయన వాహనం ఎక్కించారు. అనంతరం లోకేశ్ కాన్వాయ్ ను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్ పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు. అసలు ఎక్కడికి తీసుకెళుతున్నారు. బాధితుల పరామర్శకు వెళ్లడం కూడా తప్పేనా? ఇది నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఈ హక్కును మీరు హరిస్తున్నారు. ఎక్కడా లేని ఆంక్షలు ఒక్క గుంటూరులోనే ఎందుకు ఉన్నాయి. మొన్న కర్నూలు జిల్లాకు వెళ్లినప్పుడు అక్కడి ఎస్పీ నన్నేమీ అడ్డుకోలేదు. అక్కడ లేని ఇబ్బంది ఇక్కడెందుకు? నన్ను అడ్డుకోవడం చట్టవిరుద్ధం. నరసరావుపేట వెళ్లేందుకు అనుమతి కూడా కోరలేదు. అలాంటప్పుడు తిరస్కరణ అన్నమాట ఎలా వస్తుంది? చేయని దరఖాస్తును ఎలా తిరస్కరిస్తారు? ధర్నాలు చేయడానికి నేను వెళ్లడం లేదు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకే వెళుతున్నా. ఆ తర్వాత మీడియాతో మాట్లాడతా. వచ్చేస్తా. ఇందులో ఇబ్బందేముంది? నాపై కేసులేమీ లేవండి. ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు. ఏ కేసూ లేదు. ఒక్క ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ కేసు తప్పిస్తే.. నాపై కేసులేమీ లేవు. అయినా నన్ను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమే. అసలు నేను నరసరావుపేటకు వెళితే.. మీకొచ్చిన ఇబ్బందేమిటి? ఎందుకు భయపడుతున్నారు? గుంటూరులో ఎలాంటి ఆంక్షలు అమలు అవుతున్నాయో, వాటి వెనుక కారణాలేమిటో నాకు తెలుసు’’ అంటూ లోకేశ్ పోలీసులపైకి విరుచుకుపడ్డారు. లోకేశ్ ప్రశ్నలకు ‘అనుమతి లేదు’ అన్న ఒక్క మాట తప్పించి పోలీసుల నుంచి అసలు వేరే సమాధానమే వినిపించలేదు.
Also Read ;- భయపడలేదు!.. భయపెట్టారు!
ఈ ఫొటో చెప్పే నీతి ఏమిటంటే..?
ఇదిలా ఉంటే.. లోకేశ్ ను అదుపులోకి తీసుకుని ముందుగా హనుమాన్ జంక్షన్ వైపు, ఆ తర్వాత విజయవాడ వైపు తరలిస్తున్న సందర్భంగా పోలీసులు ఎంతగా హైరానా పడిపోయారో మీడియా ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారం ద్వారా కళ్లకు కట్టాయి. దారి వెంట అటూఇటూ పోలీసులు మధ్యలో లోకేశ్ కాన్వాయ్. దానికి ముందు పోలీసు అధికారులు.. మధ్య మధ్యలో ఫొటోలు, వీడియోలు తీసేందుకు పోటీలు పడిన మీడియా ప్రతినిధులు.. ఇలా సాగిపోతుండగా.. గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోనే ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మీడియా ప్రతినిధులను పక్కకు తప్పించి.. లోకేశ్ వాహనం దిశగా ఎవరూ రాకుండా భద్రత కల్పిస్తున్న పోలీసుల్లో ఓ పోలీసు కారు ముందు కింద పడిపోతాడా అన్నట్టుగా ముందుకు ఒరిగిపోయారు. ఈ సమయంలో ఆయన తలపై ఉన్న పోలీసు టోపీ కింద పడిపోయింది. గాబరా పడిపోయిన ఆయన తన పోలీసు టోపీని కూడా తీసుకోకుండానే పైకి లేచి వెనక్కెళ్లారు. దీనిని గమనించిన మరో పోలీసు అధికారి ఆ టోపీ లోకేశ్ కారు కింద పడకుండా దానిని తన చేతిలోకి తీసుకున్నారు. ఈ దృశ్యాలు వైరల్ గా మారిపోయాయి. లోకేశ్ ను అరెస్ట్ చేసే సందర్భంగా పోలీసులు ఏ మేర హైరానా పడిపోయారన్న విషయాన్ని ఈ దృశ్యం తెపలడంతో పాటు చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే.. ఇలాగే జరుగుంతన్న మాటను గుర్తు చేసింది.
Must Read ;- అత్యాచారాంధ్రగా ఏపీ.. గుంటూరులో మరో దారుణం