Nara Lokesh’s Narasaraopeta Visit Shakes Jagan Government :
నారా లోకేశ్.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానే కాకుండా ఆ పార్టీ ఎమ్మెల్సీగా కూడా కొనసాగుతున్నారు. నారా లోకేశ్ ఓ ఎమ్మెల్సీనే.. కనీసం శాసనమండలిలో విపక్ష నేత కూడా కాదు. అసెంబ్లీలో ఆయన అడుగే పెట్టలేదు. మరి ఎందుకు ఆయన బయటకు వస్తున్నారంటే.. ఏపీలోని జగన్ సర్కారు ఇంతగా హైరానా పడిపోతోంది? లోకేశ్ పర్యటనకు బయలుదేరుతున్నారంటేనే.. జగన్ సర్కారులో వణుకు చాలా స్పష్టంగానే కనిపిస్తోంది. లోకేశ్‌ను అడ్డుకునేందుకు వందలాది మంది పోలీసులను, వారి కో-ఆర్డినేషన్ కోసం డీఎస్పీలు, ఎస్పీలు.. తాజాగా ఏకంగా డీఐజీ స్థాయి అధికారులు కూడా రంగంలోకి దిగుతున్నారంటే.. లోకేశ్ టూర్లతో జగన్ సర్కారు ఎంతగా భయపడుతుందో ఇట్టే తెలిసిపోతుంది కదా. తాజాగా గురువారం నాడు లోకేశ్ గుంటూరు జిల్లా నరసరావుపేటలో కొన్నిళ్ల క్రితం ఓ ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేశ్ వస్తున్నారనగానే.. బుధవారం నాడు డీఐజీ సహా గుంటూరు రూరల్, అర్బన్ ఎస్పీలు మీడియా ముందుకు వచ్చి మరీ లోకేశ్ పర్యటనలకు అనుమతి లేదంటూ ప్రకటించారు.
పరామర్శకూ అనుమతించరట
ఎక్కడైనా ఏదేనీ ఘటనలో అన్యాయం జరిగిన కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకునే దిశగా ప్రతిపక్షాలు పోరాటం చేయడం సర్వ సాధారణం. బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వాలకు గుర్తు చేయడమే కదా విపక్షాల పని. ఒకవేళ ప్రతిపక్షాలు స్పందించకముందే.. బాధితులకు న్యాయం జరిగిపోతే ఇక ఇబ్బందే లేదు. అయితే ఎక్కడికక్కడ అన్యాయానికి గురవుతున్న బాధితులకు ఏపీలో న్యాయం జరగడం లేదు. దిశ చట్టం ఉందని జగన్ సర్కారు చెబుతున్నా.. మహిళలు, యువతులు, విద్యార్థినీలపై ప్రేమోన్మాదులు బరి తెగిస్తున్నారు. ఇటీవల గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసే ఇందుకు నిదర్శనం. రమ్య మృతి తర్వాత బాధిత కుటుంబానికి పరిహారం ఇచ్చేసి చేతులు దులుపుకుంటే.. సరిపోదు కదా. ఇదేదో ప్రకృతి వైపరీత్యం కాదు కదా. నేరస్తులను కఠినంగా శిక్షించాలి.. ఈ శిక్షలను చూసి భవిష్యత్తులో మహిళలు, బాలికలను వేధించాలంటేనే మృగాళ్లు భయకంపితులు కావాలి. ఈ దిశగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నారా లోకేశ్ గత కొన్నాళ్లుగా పోరాడుతున్నారు. రాష్ట్రంలో రమ్య మాదిరిగా ఎందరికి అన్యాయం జరిగిందో వివరాలు తీసి మరీ ఆయా కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతున్నారు. అయితే రమ్య ఘటన సమయంలో లోకేశ్ కు పోటెత్తిన మద్దతును చూసిన జగన్ సర్కారు.. ఇకపై లోకేశ్ ను ఎలాంటి పరామర్శలకు అనుమతించేది లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది.
అనూష ఫ్యామిలీ వద్దకు వెళ్లనిస్తారా?
ఈ క్రమంలో కొన్నాళ్ల క్రింతగుంటూరు జిల్లా నరసరావుపేటలో అనూష అనే విద్యార్థినిని విష్ణువకర్ధన్ రెడ్డి అనే ప్రేమోన్మాది కిరాతకంగా చంపేశాడు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినా..అతడు ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు. విషయం తెలుసుకున్న నారా లోకేశ్..గురువారం నాడు అనూష ఫ్యామిలీని పరామర్శించేందుకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. నిందితుడు జైలు నుంచి విడుదలైన తర్వాత ఆ కుటుంబానికి ఎలాంటి అపాయం పొంచి ఉందో తెలుసుకోవడంతో పాటుగా ఆ కుటుంబానికి తగిన భద్రత కల్పించే దిశగా ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడమే లోకేశ్ పర్యటన ఉద్దేశ్యంగా తెలుస్తోంది. అయితే గతంలో లోకేశ్ పర్యటనలకు పోటెత్తిన మద్దతును చూసిన జగన్ సర్కారు.. ఎలాగైనా లోకేశ్ ను నరసరావుపేటలో అడుగుపెట్టనిచ్చేది లేదన్న కోణంలో పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా గుంటూరు రేంజి డీఐజీతో పాటు గుంటూరు అర్బన్, రూరల్ ఎస్పీలు మీడియా సమావేశం పెట్టి మరీ హెచ్చరికలు జారీ చేశారు. అంతటితో ఆగకుండా నరసరావుపేటలో దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాంను బుధవారం రాత్రే గృహ నిర్బంధం చేశారు. తాజాగా గురువారం ఉదయం గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు సహా పలువురు టీడీపీ నేతలను కూడా పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఇక లోకేశ్ కు స్వాగతం పలికేందుకు గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న తెలుగు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వెరసి లోకేశ్ ఏపీలో అడుగుపెట్టకముందే.. హైదరాబాద్ నుంచి ఇంకా బయలుదేరక ముందు నుంచే జగన్ సర్కారులో ఆందోళన మొదలైపోయింది.
Must Read ;- అత్యాచారాంధ్రగా ఏపీ.. గుంటూరులో మరో దారుణం











