తీన్మార్ మల్లన్న.. నిజంగానే తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు కంటిలో నలుసుగానే పరిణమించారు. కేసీఆర్ సర్కారు తీసుకునే ప్రతి నిర్ణయంపైనా తనదైన శైలి విశ్లేషణ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌ను టీఆర్ఎస్ నేతలు చాలాకాలంగానే టార్గెట్ చేశారన్న వాదనలు లేకపోలేదు. పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డికి ముచ్చెమటలు పట్టించిన మల్లన్న ఏకంగా గెలిచినంత పనిచేశారు. అప్పటినుంచే మల్లన్న అధికార పార్టీ నేతలకు టార్గెట్ అయ్యారన్న వాదనలు వినిపించాయి. మొన్నామధ్య మల్లన్న ఆధ్వర్యంలోని క్యూన్యూస్ ఛానెల్ కార్యాలయంపై పోలీసులు దాడులు కూడా చేశారు. అయితే నాడు మల్లన్నను అరెస్ట్ చేసేందుకు పోలీసులకు తగినంత మేర ఆధారాలు దొరికినట్టు లేదు. అయితే ఇప్పుడు మల్లన్నను అరెస్ట అయిపోయారు. శనివారం కోర్టులో హాజరుపరచిన ఆయనను.. ఆ తర్వాత చంచల్ గూడ జైలుకు తరలించారు.
అరెస్టైన కారణమేంటంటే..?
డబ్బుల కోసం తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్‌శర్మ ఏప్రిల్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.30 లక్షలు కావాలని మల్లన్న తనను బెదిరిస్తున్నాడని, ఇవ్వకుంటే తన చానల్‌లో తప్పుడు కథనాలు ప్రచారం చేసి పేరు చెడగొడతానని బెదిరించాడని లక్ష్మీకాంత్‌శర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై గతంలోనే కేసు నమోదు చేసుకున్న చిలకలగూడ పోలీసులు ఇప్పటికే మల్లన్నకు రెండుసార్లు నోటీసులు ఇచ్చి విచారణ కూడా చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా మల్లన్నను అరెస్ట్ చేశారు. మల్లన్నను శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు.
ఎలా టార్గెట్ అయ్యారంటే..?
దళిత సామాజిక వర్గానికి చెందిన మల్లన్న.. చిన్న జర్నలిస్టుగానే తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. రాజకీయాలంటే ఆసక్తి ఉన్న మల్లన్న ఎప్పుడు అవకాశం చిక్కినా నామినేషన్ వేస్తూ వస్తున్నారు. గతేడాది కంటే ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మల్లన్న పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అయినా కూడా తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కంటే కూడా ఎక్కువ ఓట్లను సాధించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పై తనదైన శైలి ఆరోపణలు గుప్పించిన మల్లన్న.. టీఆర్ఎస్ కు టార్గెట్ అయిపోయారు. ఈ క్రమంలోనే ఆయన పనిచేస్తున్న మీడియా సంస్థలు మల్లన్నను ఉద్యోగంలో నుంచి తీసివేయడం, ఆయన మరో సంస్థను ఎంచుకోవడం జరిగిపోతూనే ఉంది. ఈ నేపథ్యంలో మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే పల్లా రాజేశ్వరరెడ్డితో పాటు కేసీఆర్ సర్కారుపై సంచలనాలకే సంచలనాలుగా నిలిచిన ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లాను మల్లన్న ఓడించేస్తారేమోనన్న వాదనలూ వినిపించాయి. అయితే మల్లన్న గెలవలేదు గానీ.. తన సత్తా ఏమిటో టీఆర్ఎస్ కు రుచి చూపించారు. ఈ క్రమంలోనే మల్లన్న అరెస్ట్ తప్పదన్న వాదనలు వినిపించాయి. ఆ వాదనలు నిజమేనన్నట్లుగా ఇప్పుడు మల్లన్న అరెస్ట్ అయిపోయారు. జైలుకూ వెళ్లిపోయారు.
Must Read ;- రేవంత్ దెబ్బకు కేసీఆర్ బయటకొచ్చారా?