అటు కేంద్ర ప్రభుత్వమైనా, ఇటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలైనా.. చిన్నదో, పెద్దదో.. ఏ నిర్ణయం కొత్తగా తీసుకున్నా.. అప్పటికే తీసుకున్న నిర్ణయాలకు కాలం చెల్లిపోతుంటే.. వాటికి పొడిగింపు ఇవ్వాలన్నా.. ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయాల్సిందే. వీటినే ప్రభుత్వ ఉత్వర్వులు (గవర్నమెంట్ ఆర్డర్స్)గా పరిగణిస్తున్నాం. సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చాక.. సర్కారీ జీవోలన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. తెలుగు నేలలో ఈ సంప్రదాయాన్ని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభిస్తే.. ఇప్పుడు ఏపీకి సీఎంగా ఉన్న ఆయన కుమారుడు వైఎస్ జగన్ ఆ సత్సంప్రదాయానికి తూట్లు పొడిచేశారు. జీవోలను ఆన్ లైన్ లో పెట్టే జీవోఐఆర్ పద్దతికి తిలోదకాలిస్తూ రెండు రోజుల క్రితమే జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై ఓ వైపు పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ ఏపీ తరహా పరిస్థితులే నెలకొన్నాయి. ఏపీ సీఎం జగన్ మాదిరే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా చీకటి రాజ్యానికే ఓటు వేస్తున్నట్లుగా ఆసక్తికర విశ్లేషణలు మొదలయ్యాయి.
ఎలా బయటపడిందంటే..?
కేసీఆర్ సర్కారు కొత్తగా దళిత బంధును ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా దళిత బంధును అమలు చేయాలని నిర్ణయించిన కేసీఆర్ సర్కారు.. అంతకంటే ముందుగానే కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ప్రారంభించేశారు. అయినా ఏదేనీ కొత్త నిర్ణయం తీసుకుంటే.. కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభించాలంటే.. దానికి విధి విధానాలు అంటూ నిర్ణయించాలి కదా. విధి విధానాలను వెల్లడించేదే సర్కారీ జీవో. అటు వాసాలమర్రితో పాటు ఇటు మొన్న హుజూరాబాద్ లోనూ కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించిన దళిత బంధుకు సంబంధించిన విధి విధానాలతో కూడిన జీవో ఇప్పటిదాకా ఆన్ లైన్‌లోకే రాలేదట. ఈ విషయాన్ని కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులు చెప్పడం లేదు. కేసీఆర్ సర్కారు ఏరికోరి నియమించుకున్న అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ప్రసాద్ స్వయంగా తెలంగాణ హైకోర్టుకు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు నిర్ణయించామని, జీవో కూడా విడుదల చేశామని చెప్పిన ఏజీ.. దానిని ఆన్ లైన్ లో పెట్టలేదని చెప్పారు.
జీవోలన్నీ ఆన్ లైన్ లో ఉంచాల్సిందే
ఈ సందర్భంగా తెలంగాణ సర్కారు తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. వాసాలమర్రిలో ఇటీవల దళిత బంధు పథకాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఆ సందర్భంగా గ్రామంలోని 76 కుటుంబాలకు పథకం వర్తిస్తుందని ప్రకటించి.. తర్వాతి రోజు నిధులు విడుదల చేశారు. అయితే పథకం విధి విధానాలు ఖరారు చేయకుండానే ప్రజాధనం చెల్లిస్తున్నారని వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ అనే సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై బుధవారం జరిగిన విచారణలో.. పథకానికి సంబంధించిన నిబంధనలు ఖరారు చేయలేదని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే నిబంధనలు ఖరారు చేశామని.. రాష్ట్రంలో ఉన్న దళిత కుటుంబాలన్నింటికీ అమలు చేస్తామని ప్రభుత్వం ఏజీ కోర్టులో వాదించారు. ఆ విషయం ఎందుకు పిటిషన్‌లో పేర్కొనలేదని హైకోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది. కానీ నిబంధనలు ఖరారు చేసినట్లుగా ఎలాంటి ఆదేశాలు అధికారికంగా ఇవ్వలేదని.. జీవోలను కూడా వెబ్‌సైట్‌లో పెట్టలేదని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఇబ్బంది ఏమిటని .. వాటిని ఇరవై నాలుగు గంటల్లో అందుబాటులో ఉంచారని ఆదేశించింది.
Must Read ;- బైపోల్‌పై కేసీఆర్‌లో భయం మొదలైందా?