Telangana Minister KTR Inaugurated Balanagar Flyover With Female Labour :
తాజ్ మహల్ అనగానే.. మనకు ఓ గొప్ప కట్టడం కళ్ల ముందు కదలాడుతుంటుంది. ఓ మధుర స్వప్నం గుర్తుకొస్తుంది. కానీ.. కొన్ని వందల మంది కూలీలు రాత్రింబవళ్ళు కష్టపడి నిర్మించారు. తాజ్ మహల్ కట్టడానికి పూనుకుంది షాజహాన్ అయినా ఎంతోమంది కార్మికులు రాళ్లెత్తారనే విషయం ఎంతమందికి తెలుసు.. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా..? మంగళవారం హైదరాబాద్ బాలానగర్ లో సిగ్నల్ లేని మరో ఫ్లై ఓవర్ ప్రారంభమైంది. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ సర్కార్ ఆలోచించి, ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని అందుబాటులో తెచ్చింది. ఫ్లై ఓవర్ ప్రారంభంలో గొప్ప దృశ్యం అందరి మనసులను దోచింది.
కార్మికురాలి చేతుల మీదుగా
హైదరాబాద్ లాంటి మహానగరంలో ఫ్లై ఓవర్ ప్రారంభం అంటే ఎలా ఉంటుంది. అధికారుల హాడావుడి చేస్తూ.. మంత్రులు ఫొటోలకు ఫోజులిస్తూ కనిపిస్తారు. కానీ బాలానగర్ ఫ్లై ఓవర్ ప్రారంభం కార్యక్రమంలో ఇవేమీ లేవు. ఫ్లై ఓవర్ నిర్మాణంలో భాగం పంచుకున్న మహిళలే ఫ్లై ఓవర్ ను ప్రారంభించడం విశేషం. వాస్తవానికి మంత్రులు తలసాని, మల్లారెడ్డిలతో కలిసి కేటీఆర్ ప్రారంభించాల్సి ఉంది. అందరూ అదే అనుకున్నారు. కానీ మంత్రి కేటీఆర్ మహిళ కార్మికులతో కలిసి ప్రారంభించి గొప్ప మనసు ను చాటుకున్నారు. కేటీఆర్ సో గ్రేట్ అంటూ అభినందనల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.
ట్రాఫిక్ కష్టాలకు చెక్
సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు బాలానగర్ ప్లై ఓవర్ ప్రారంభమైంది. 2017 ఆగస్టు 21న బాలానగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. మంగళవారం హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి వచ్చింది. బ్రిడ్జి పొడవు 1.13 కిలోమీటర్లు, 24 మీటర్లు వెడల్పు 26 పిల్లర్లతో నిర్మించారు. హైదరాబాద్ నగరంలోని అతి ప్రధాన రహదారుల్లో ఇది ఒకటి కావడం విశేషం. 6 లేన్లతో సిటీలోనే నిర్మించిన మొట్టమొదటి బ్రిడ్జి ఇది. 2050 సంవత్సరం వరకు ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని నిర్మాణం చేశారు. దీనికి బాబూ జగ్జీవన్ రాం బ్రిడ్జిగా నామకరణం చేశారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో సిటీలో కొంతవరకు ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి.
Must Read;- పీజేఆర్ చావుకు వైఎస్సారే కారణం!