అదో వి‘చిత్రపురి’ కాలనీ.. రాజుల సొమ్ము రాళ్లపాలు అంటూ ఉంటారు. ఒకవిధంగా ఇది అలాంటిదే.. ఒకప్పుడు అక్కడ రాళ్లూ రప్పలే.. ఇవుడవి రత్నాల్లా మారాయి. రత్నాలు ఉంటే వాటిని కాజేయడానికి కాచుకు కూర్చునే వారు కూడా ఉంటారు.. ఉండటమే కాదు అందులో మెజారిటీ భగం వాళ్లే. దానికి వాళ్లనీ తప్పుబట్టలేం. సొసైటీలకు సర్కారు భూములివ్వడం, అవి చివరికి ఆ సొసైటీ పాలకవర్గాల చేతుల్లోకి వెళ్లడం సర్వసాధారణంగా జరుగుతుంది. ఆ చిత్రపురి కాలనీలో అసలు సభ్యులు ఎంతమంది ఉన్నరన్నది కూడా లెక్క తీయడం కష్టమే.
వారిని వెలికి తీసి అసలు సభ్యులకు న్యాయం చేసేందుకు చిత్రపురి సాధన కమిటీ కూడా ఏర్పడి పోరాటం సాగిస్తోంది. అసలు చిత్రపురి కథ కూడా విచిత్రంగానే ఉంటుంది. ఇది ఇప్పటిది కాదు.. దీనికి కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది, ఓ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంది.. దీనికి శుభం కార్డు పడుతుందో లేదో చూడాలి. అప్పటిదాకా ఈ వి‘చిత్రపురి’లో అసలు సభ్యులకు మాత్రం మొండిచేయి మిగిలేలా ఉంది.
మొదట ఫ్లాష్ బ్యాక్ లోకి వెళదాం..
సినిమా కార్మికులకు సొంతింటి కల సాకారం కావడానికి కొందరు సినీ పెద్దల కృష్టి ఫలితమే ఈ చిత్రపురి కాలనీ. ఇది అక్రమార్కుల పాలిట కల్పవృక్షమవుతుందని ఆ పెద్దలెవరూ ఊహించి ఉండరు. తెలుగు సినిమా రంగం ఒకప్పుడు మద్రాసులో కేంద్రీకృతమై ఉండేది. దాన్ని హైదరాబాద్ కు తరలించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. అలా తరలిరావాలంటే సినీ కార్మికులకు ఇళ్లు ఉండాలన్న ఆలోచన నటుడు, రచయిత ప్రభాకర్ రెడ్డికి వచ్చింది. దాంతో కొంత మంది సినీ పెద్దలతో కలిసి అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి లాంటి సినీ పెద్దల ముందు సినిమా వారి కోసం కొంత స్థలం కావాలన్న ప్రతిపాదన పెట్టారు.
దీనికోసం దాదాపు 12 యూనియన్లు ఫెడరేషన్ గా ఏర్పడ్డాయి. గజం స్థలం నలభై రూపాయల చొప్పున మొత్తం 67 ఎకరాల 16 గుంటలను ప్రభుత్వం కేటాయించింది. ఎన్నా బాలారిష్టాలను ఈ ప్రాజెక్టు దాటింది. ఇది కొండ ప్రాంతం కావడంతో సంబంధిత డిపార్ట్ మెంట్ కోర్టుకు వెళ్లడం కూడా జరిగింది. 2005లో హైకోర్టు తీర్పు వచ్చాక అలాంటి ఆటంకాలన్నీ తొలగిపోయాయి. 11 మంది సభ్యులతో కమిటీ ఏర్పడి ఈ స్థలాన్ని ఏంచేయాలని చర్చించి ఓ రూపానికి తెచ్చాయి.
ఫ్లాట్లు రావడానికి కూడా ఎన్నో పాట్లు
ఈ స్థలంలో ఫ్లాట్లు కట్టే అంశం కూడా నత్తనడకన సాగింది. ఫ్లాట్లు రావడానికి సభ్యులు ఎన్నో పాట్లు పడాల్సి వచ్చింది. మొదట స్థలం వస్తుందనుకుంటే చివరికి ఫ్లాట్లు అన్నారు. స్థలం అందరికీ సరిపోదు కాబట్టి సరేలే అనుకుని అందరూ సరిపెట్టుకున్నారు. ఇందులో ఆపార్ట్ మెంటులు నిర్మించడానికి ఓ ప్రైవేటు కంపెనీతో ఒప్పందాలు కుదిరాయి. ఈ విషయంలో కూడా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. మొత్తం 5 కేటగిరీలుగా విభజించి 4213 ఫ్లాట్లు నిర్మించారు. మొదట్లో సినిమావాళ్లే ఇందులో ఉన్నా ఆ తర్వాత ఇవి చేతులు మారుతూ వచ్చాయి. రూ. 5 లక్షలు ఖరీదు చేసే ఫ్లాట్ ను రూ. 20 లక్షలకు కూడా అమ్ముకున్నారు. అసలు సభ్యుల స్థానంలో నకిలీలు రంగప్రవేశం చేశారు.
2015 నుంచి అక్రమాలు పరాకాష్టకు చేరాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడంతా అక్కడ నకిలీల హవా నడుస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని అడ్డంపెట్టుకుని కమిటీలో కొందరు కోట్లు సంపాదించేశారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అసలు సభ్యులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసేదాకా వెళ్లారు. మొత్తం 14 యూనియన్లకు చెందిన సభ్యులు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అసలు బోగస్ సభ్యులు ఎంతమంది ఉన్నారని వీరు ఆరాతీయగా 700 మంది బోగస్ ధ్రువపత్రాలతో ఇళ్లు పొందినట్లు తేల్చారు. వీరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి.
యూనియన్ల లో ఉన్నవారు తమ బంధుమిత్రుకు ఆయా యూనియన్లలో సభ్యత్వాలు ఇచ్చి వీరికి ఫ్లాట్లు కట్టబెట్టినట్లు తెలిసింది. దీని మీద కూడా పోలీసు విచారణ జరుగుతోంది. అక్రమార్కుల ఆగడాలను సాక్ష్యాధారాలతో సహా డీసీఓకు ఇచ్చినా ఇప్పటివరకూ ఆయన స్పందించలేదని చిత్రపురి సాధన సమితి అధ్యక్షుడు కస్తూరి శ్రీనివాస్ అంటున్నారు. కమిటీ సభ్యులు తమ సొంత అకౌంట్లలోకి, కుటుంబ సభ్యలు అకౌంట్లలోకి సొసైటీ డబ్బులను తరలించిన ఆధారాలను ఇచ్చిన ఎలాంటి స్పందనా లేదని ఆయన ఆరోపిస్తున్నారు.
ఇలాంటి ఆరోపణలతో ఒక్కసారిగా అందరి దృష్టీ చిత్రపురిపై పడింది. సాధారణంగా సొసైటీలలో ఇలాంటి అక్రమాలు ఎక్కువగానే జరుగుతుంటాయి. చర్యలు తీసుకోవడంలో అధికారులు కూడా మీనమేషాలు లెక్కిస్తుంటారు. రాజకీయ పలుకుబడి ఉంటుందన్న భయం కూడా కొంత కారణం. ఆధారాలు ఉన్నపుడు చర్యలు తీసుకోడానికి అధికారులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారన్నది మాత్రం అంతుబట్టడం లేదు. దాదాపు పాతికేళ్లుగా ఈ చిత్రపురిని అంటిపెట్టుకుని ఉన్న పరాన్నజీవుల్ని బయటికి లాగితే అసలు డొంక అంతా కదులుతుంది.











