Jagan Bail Petition Adjourned To 30th July :
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అవుతుందా? అన్న విషయం సోమవారం కూడా తేలలేదు. ఈ కేసు విచారణను నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది. ఫలితంగా తన బెయిల్ రద్దు అవుతుందా? లేదంటే తాను జైలుకు వెళ్లాలా అనే విషయంపై మరికొంతకాలం పాటు జగన్ కు టెన్షన్ తప్పదు. ఈ మేరకు సోమవారం ఉదయం ఈ పిటిషన్ విచారణకు రాగానే.. ఈ వ్యవహారంపై తన లిఖితపూర్వక స్పందనను తెలియజేయని సీబీఐ.. అందుకు మరికొంత సమయం కావాలని కోర్టుకు విన్నవించింది. దీంతో చేసేది లేక కోర్టు ఈ పిటిషన్ విచారణను ఈ నెల 30కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోక తప్పలేదు. మొత్తంగా ఈ దఫా కూడా జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై నిర్ణయం రాకపోవడానికి సీబీఐ అధికారులే కారణంగా నిలిచిన వైనం ఆసక్తికరంగా మారింది.
రఘురామ సంచలన పిటిషన్
జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ జగన్ పార్టీకి చెందిన రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి కలకలం రేపారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన కేసులో 16 నెలల జైలు జీవితం అనంతరం బెయిల్ పై బయటకు వచ్చిన జగన్.. పదేళ్లుగా బయటే ఉన్నారని.. కొంతకాలం పాటు విపక్ష నేతగా ఉన్న జగన్ రెండేళ్ల క్రితం ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారని, ఈ క్రమంలో ఈ కేసులో కీలక సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశాలున్నాయని, దీంతో ఆయన బెయిల్ ను రద్దు చేయాలని రఘురామరాజు కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు.. జగన్, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది.
సీబీఐది ఉద్దేశ్యపూర్వక జాప్యమా?
రఘురామ పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేసే విషయంలో చాలా సమయం తీసుకున్న జగన్.. కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు తన స్పందనను తెలిపారు. తానెవరినీ ప్రభావితం చేయడం లేదని, బెయిల్ నిబంధనల,ను తూచా తప్పకుండా పాటిస్తున్నానని చెప్పుకొచ్చిన జగన్.. అసలు తన బెయిల్ ను రద్దు చేయాలంటూ కోర్టుకెక్కే అర్హత రఘురామకు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై రఘురామ ప్రతి కౌంటర్ దాఖలు చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తు సంస్థగా ఉన్న సీబీఐ మాత్రం తన కౌంటర్ ను దాఖలు చేసే విషయంలో ఎప్పటికప్పుడు వాయిదాలు కోరుతూ వస్తోంది. గత విచారణ సందర్భంగానూ సీబీఐ తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 26నాటి విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయాలని, లేదంటే..తమ తుది నిర్ణయాన్ని వెల్లడిస్తానని కూడా కోర్టు తేల్చి చెప్పింది. అయితే జగన్ ను రక్షించే దిశగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న సీబీఐ సోమవారం నాటి విచారణకు కూడా తన కౌంటర్ ను దాఖలు చేయలేదు. అంతేకాకుండా తన కౌంటర్ ను దాఖలు చేసేందుకు మరింత సమయం కావాలని కోరింది. దీంతో చేసేది లేక కోర్టు ఈ పిటిషన్ విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.
Must Read ;- 26 గండం!.. ఒకరు సేఫ్, మరొకరు అవుట్