టాలీవుడ్ యంగ్ హీరో అల్లు అర్జున్ నటించిన అదేదో సినిమాలో.. ప్రభుత్వంలో కీలక శాఖ అధికారిగా ఉన్న హీరో తండ్రిని హీరోయిన్ తండ్రి ‘‘మీ పలుకుబడి ఉపయోగించి ఓ అవార్డు ఇప్పించరాదూ’’అంటూ బతిమాలే సీన్ గుర్తుంది కదా. దానికి సమాధానంగా ప్రతిభతోనే అవార్డులు వస్తాయంటూ హీరో తల్లి కూడా ఓ కామెంట్ చేస్తుంది. మొత్తంగా ప్రతిభ ఉంటే అవార్డులు వాటికవే వస్తాయనేది ఈ సీన్ భావన. అదే సమయంలో పైరవీలతోనూ అవార్డులు ఇస్తున్నారన్న వైనం బోధపడేలా ఆ సీన్ బాగానే పండింది. ఇప్పుడు ఇందుకు విరుద్ధమైన తరహాలో ప్రభుత్వం అవార్డులు ఇస్తున్నా.. వాటిని తీసుకునేందుకు ప్రముఖులు ముందుకు రావడం లేదు. ముందుకు రావడం లేదు అనేదానికంటే.. ప్రభుత్వ అవార్డులను వద్దంటూ ప్రముఖులు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అవార్డులు ఇస్తామంటూ సర్కారు ఆహ్వానాలు పంపుతుంటే.. మాకు మీ అవార్డులు వద్దంటూ ఆయా రంగాల ప్రముఖులు ఆ సర్కారు పెద్దల ముఖం మీదే చెప్పేస్తున్నారు. ఈ తరహాలో ఏపీలో ఇప్పుడు జగన్ సర్కారుకు ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.
రెండో తిరస్కరణ
జగన్ సీఎం కాగానే.. తన తండ్రి వైఎస్సార్ పేరిట వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డులను ఆయా రంగాల ప్రముఖులకు ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. అనుకున్నట్లుగానే వివిధ రంగాల్లో తమదైన శైలి ప్రతిభ కనబరచిన పలువురు ప్రముఖులను వైఎస్సార్ లైఫ్ టైవ అచీవ్ మెంట్ అవార్డులకు ఎంపిక చేశారు. ఇంతదాకా బాగానే ఉన్నా.. అవార్డులకు ఎంపికైన వారిలో ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్.. మీ అవార్డు నాకు వద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అవార్డులు ప్రకటించిన రోజే సాయినాథ్ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. ఇక సాయినాథ్ బాటలోనే మరో ప్రముఖ జర్నలిస్టు.. జగన్ సొంత ప్రాంతం రాయలసీమకు చెందిన తెలకపల్లి రవి కూడా పయనించారు. జగన్ సర్కారు ప్రకటించిన వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డును తాను స్వీకరించేనంటూ తన సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు.
కారణమేంటంటే..?
ప్రస్తుతం ఉన్న వివాదాస్పద రాజకీయ, మీడియా, సోషల్ మీడియా మాధ్యమాల వాతావరణంలో ఈ అవార్డును తాను స్వీకరిండం లేదని తెలకపల్లి రవి కుండబద్దలు కొట్టారు. అయితే, ఈ పురస్కారం తనకు ఇస్తానని ప్రకటించి తన పట్ల గౌరవాదరణ కనబర్చిన ఏపీ ప్రభుత్వం, అవార్డుకు తనను ఎంపిక చేసిన కమిటీ, అవార్డు వచ్చిన తర్వాత తనకు శుభాకాంక్షలు తెలిపిన మిత్రులకు తెలకపల్లి ధన్యవాదాలు తెలిపారు. అవార్డును తిరస్కరించేందుకు గల కారణాలను సాయినాథ్ వెల్లడించకపోయినా.. తెలకపల్లి రవి మాత్రం తనదైన శైలి వివరణతో అవార్డు తిరస్కరణకు కారణమిదంటూ పేర్కొరడం గమనార్హం. అంటే.. జగన్ జమానాలో రాజకీయాలతో పాటు మీడియా, సోషల్ మీడియా కూడా వివాదాస్పదంగా మారిపోయినట్టుగా తెలకపల్లి రవి రూలింగ్ ఇచ్చేసినట్టే కదా. మరి తెలకపల్లి కామెంట్ పై జగన్ సర్కారు స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
Must Read ;- జగన్, కేసీఆర్ ఆశలపై మోదీ నీళ్లు చల్లేశారే











