High Court Grants Bail To Devineni Uma Maheswara Rao :
టీడీపీకి చెందిన నేతలపై జగన్ సర్కారు కేసులు పెడుతుంది. ఆ కేసుల్లో కోర్టులు టీడీపీ నేతలకు బెయిళ్లు మంజూరు చేస్తాయి. ఇక అప్పటి నుంచి ఆయా కేసుల్లో జగన్ సర్కారు కోర్టుల చుట్టూ తిరుగుతూ టీడీపీ నేతల కేసుల్లో తాము చట్టప్రకారంగానే వ్యవహరించామని నిరూపించుకునే యత్నాలు చేయక తప్పని పరిస్థితి. మొత్తంగా టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం ద్వారా.. తమపై విమర్శలు గుప్పించే గళాలను అణచివేశామని జగన్ సర్కారు కొన్ని రోజుల పాటు సంబరపడటమే తప్పించి.. ఆ తర్వాత ఈ కేసుల ద్వారా తాను పడే ఇబ్బందిని మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి కేసుల తరహాలోనే ఇప్పుడు జగన్ సర్కారు జాబితాలో మరో కేసు చేరిపోయింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును అరెస్ట్ చేసిన వ్యవహారంలో బుధవారం ఉదయం జగన్ సర్కారుకు హైకోర్టులో షాక్ తగిలిందనే చెప్పాలి. తనకు బెయిల్ ఇవ్వాలన్న దేవినేని వినతికి అంగీకరించిన హైకోర్టు ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. వెరసి టీడీపీ నేతలు, మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కేసుల మాదిరే జగన్ సర్కారు ఇప్పుడు దేవినేని కేసును కూడా కోర్టుల్లో ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఆ రోజు ఏం జరిగింది?
కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన దేవినేని ఉమామహేశ్వరరావు 2019 ఎన్నికల్లోనూ అక్కడి నుంచే పోటీ చేశారు. అయితే ఎన్నికల్లో ఆయన ఓటమి పాలు కాగా.. ఆయన ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ విజయం సాధించారు. ఇక రాష్ట్ర స్థాయిలోనూ వైసీపీ అధికారంలోకి రావడంతో.. టీడీపీ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా కొనసాగిన వారితో పాటు వైసీపీ అక్రమాలపై విరుచుకుపడే వారిపై జగన్ సర్కారు ఓ రేంజిలో టార్గెట్ చేసిందన్న వాదనలు వినిపించాయి. ఈ క్రమంలో టీడీపీకి చెందిన కీలక నేతలను అరెస్ట్ చేస్తూ వచ్చిన జగన్ సర్కారు.. వసంత విజ్ఞప్తి మేరకు దేవినేనిని కూడా టార్గెట్ లిస్టులోనే పెట్టింది. ఈ క్రమంలో దేవినేని ఎక్కడ చిక్కుతారా? అని ఎదురు చూసింది. తన నియోజకవర్గ పరిధిలోని కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో దేవినేని రంగంలోకి దిగిపోయారు. అక్రమ మైనింగ్ ను పరిశీలించే నిమిత్తం మొన్నామధ్య కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ కు దేవినేని వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న వసంత కృష్ణప్రసాద్.. తన అనుచరులను బరిలోకి దింపారు. ఈ క్రమంలో దేవినేని తిరిగి వెళుతున్న సమయంలో ఆయనను అడ్డగించిన వైసీపీ మూకలు.. ఆయనపై ఏకంగా హత్యాయత్నానికి యత్నించాయి. దేవినేని కారుపై రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడికి దిగాయి. ఈ దాడిలో దేవినేని కారు చాలా వరకు ధ్వంసమైంది. అయితే కారులో నుంచి దేవినేని దిగకుండా అలాగే కూర్చున్న నేపథ్యంలో ఆయనకు గాయాలేమీ కాలేదు. ఈలోగానే విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు అక్కడికి హుటాహుటీన చేరుకోవడంతో దేవినేని ప్రాణాలతో బయటపడ్దారు.
దేవినేనిపై కేసు ఎలాగంటే..?
తనపై జరిగిన దాడిపై తీవ్రంగా స్పందించిన దేవినేని.. జీ.కొండూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తనపై దాడి జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న పోలీసులు చోద్యం చూస్తూ పట్టించుకోకపోవడంపైనా దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వానికి కొమ్ము కాసేలా వ్యవహరించిన పోలీసులు దేవినేని ఫిర్యాదును అసలు స్వీకరించనట్టుగానే వ్యవహరించారు. అయితే ఆ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే దేవినేనిపైనే ఉల్టా కేసు నమోదైంది. వైసీపీకి చెందిన ఎస్సీలపై దేవినేని హత్యాయత్నానికి పాల్పడ్డారని, వారిని కులం పేరుతో దూషించారన్న కారణాలను చూపుతూ దేవినేనిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద అదే జీ.కొండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వెంటనే దేవినేనిని అరెస్ట్ చేశారు. వెనువెంటనే ఆయనను కోర్టులో హాజరుపరచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే తనకు బెయిల్ ఇవ్వాలంటూ దేవినేని దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు బుధవారం పొద్దున్నే ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.
Must Read ;- అటు ఎన్జీటీ, ఇటు మావోయిస్టులు.. వైసీపీకి బ్యాండ్ బాజానే