కరోనా విరుచుకుపడుతున్న వేళ.. ఎన్నో వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ లాంటి టీకాలు కరోనా నివారణను అరికట్టాయి. కోవిషీల్డ్, కోవాగ్జిన్ అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా టీకా పంపిణీ జరిగింది. వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభంలో చాలామంది కోవాగ్జిన్ కే ఓటు వేశారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడమే ఇందుకు కారణం. కొవిడ్ పోరులో కోవాగ్జిన్ సమర్థవంతంగా పనిచేసినప్పటికీ.. దానిపై ఎన్నో సందేహాలు వచ్చాయి. క్లినికల్ ట్రయల్స్ ఫలితాలకు ముందే.. భారత్ బయోటెక్ వారి కోవాగ్జిన్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు లభించకపోవడం, ఇతర దేశాలు ఇష్టత చూపకపోవడం కోవాగ్జిన్ సమర్థతపై సందేహాలు వ్యక్తమయ్యాయి. కొత్తగా వచ్చే వైరస్ లను ఎదుర్కోవడంలో విఫలమైందనే ఆరోపణలు సైతం వినిపించాయి.
‘డెల్టా’ను చంపిన కోవాగ్జిన్
కోవాగ్జిన్ టీకా పై ఎన్నో సందేహాలు, వివాదాలు తలెత్తున్న నేపథ్యంలో అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్ఐహెచ్) అనూహ్యమైన ప్రకటన చేసింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’ టీకా సమర్థవంతంగా పనిచేస్తుందని, ప్రమాదకర వైరస్ లు (ఆల్ఫా, డెల్టా వేరియంట్లు)ను సైతం కోవాగ్జిన్ అడ్డుకుందని స్పష్టం చేసింది. ఈ మేరకు అధ్యయనానికి సంబంధించిన డేటాను సైతం ఎన్ఐహెచ్ విడుదల చేసింది. కరోనాతో పాటు ఇతర వ్యాధులు ఉన్నవాళ్లపై.. కోవాగ్జిన్ 70 శాతం సమర్థవంతంగా పనిచేసినట్టు, తమ పరిశోధనలో సైతం తేలిందని ఎన్ఐహెచ్ డైరెక్టర్ ఆంథోనీ ఫౌచీ స్పష్టం చేశారు. భారత ప్రజలకు అందుబాటులో ఉన్న సమర్థవంతమైన వ్యాక్సిన్లలో కోవాగ్జిన్ ఒకటి అని, దీనిపై మరిన్ని పరిశోధనలు చేస్తామని ఆయన వెల్లడించారు.
భారత్ బయోటెక్ కు భారీ భద్రత
దేశంలోనే ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థల్లో భారత్ బయోటెక్ కు మంచి పేరుంది. ఉగ్రదాడుల బెదిరింపుల కారణంగా దేశీయంగా కొవిడ్ వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్న సంస్థలకు కేంద్రం భారీ భద్రత కల్పించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ దగ్గర భారీ భద్రత కొనసాగుతోంది. అన్ని రకాల ఉగ్రదాడులను ఎదుర్కొనేందుకు క్యూఆర్‌టీ దళాలు కార్యాలయంలో 24 గంటలు అందుబాటులో ఉంటాయి. ఇక సంస్థ సీఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లాకు సైతం ‘వై కేటగిరి’ భద్రత కల్పించింది. తాజాగా అమెరికా సంస్థ కోవాగ్జిన్ పనితీరును గుర్తించడంతో.. ఈ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు లభించే అవకాశం ఉంది.
బ్రెజిల్ కు నో సప్లయ్
బ్రెజిల్‌లో కోవాగ్జిన్ స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ సంస్థ కీలక ప్రకటన చేసింది. బ్రెజిల్ నుంచి కోవాగ్జిన్ టీకాల కోసం ఎటువంటి అడ్వాన్స్ పేమెంట్ తీసుకోలేదని, ఆదేశానికి కోవిడ్ టీకాలను కూడా సరఫరా చేయలేదని భారత్ బయోటెక్ సంస్థ స్పష్టం చేసింది. ఇప్పటివరకు తమకు ఎలాంటి పేమెంట్ అందలేదని తెలిపింది. అయితే విదేశాలకు అందించే కోవాగ్జిన్ ధర.. డోసుకు 15 నుంచి 20 డాలర్లు నిర్ణయించినట్టు, బ్రెజిల్‌కు కూడా ఇదే ఒప్పందం వర్తిస్తుందని తెలిపింది.
Must Read ;- వ్యాక్సిన్ ప్లీజ్ : ఇండియా సాయం కోరిన డబ్ల్యూహెచ్ ఓ