‘కందిరీగ’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు సంతోష్ శ్రీనివాస్. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘కందిరీగ’ ఎనర్జిటిక్ హీరో రామ్ కి మంచి విజయాన్ని అందించడతో పాటు పేరును కూడా తీసుకువచ్చింది. ఈ సినిమాతో సంతోష్ శ్రీనివాస్ ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. అదే.. ‘రభస’. ఈ సినిమా టైమ్ లో సంతోష్ శ్రీనివాస్ కి ఆరోగ్య సమస్యలు రావడంతో ‘రభస’ చాన్నాళ్లు ఆగింది. ఆతర్వాత సంతోష్ శ్రీనివాస్ కోలుకుని ‘రభస’ కంప్లీట్ చేశారు కానీ.. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.
దీంతో కెరీర్లో వెనకబడిన సంతోష్ శ్రీనివాస్.. ‘కందిరీగ 2’ తీయాలి అనుకున్నాడు. అయితే.. ఫ్లాప్ లో ఉన్నప్పుడు ఎవరూ నమ్మరు కదా.. అందుకే సంతోష్ శ్రీనివాస్ పై నమ్మకం లేకపోవడంతో తను అనుకున్న ‘కందిరీగ 2’ సెట్స్ పైకి వెళ్లకుండా స్క్రిప్ట్ దశలోనే ఆగింది. అయితే.. రామ్ తో సంతోష్ శ్రీనివాస్ ‘హైపర్’ అనే సినిమా తీశాడు. ఈ సినిమా ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోకపోయినా.. ఫరవాలేదు అనిపించింది.
ఇప్పుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే.. ‘కందిరీగ 2’ మాత్రం ఖచ్చితంగా తీస్తాననంటున్నారు సంతోష్ శ్రీనివాస్. ‘అల్లుడు అదుర్స్’ సక్సస్ అయితే.. రామ్ నుంచి పిలుపు రావచ్చు. ఒకవేళ రామ్ తో సెట్ కాకపోతే వేరే హీరోతో అయినా ‘కందిరీగ 2’ తీస్తానంటున్నాడు. మరి.. రామ్ తో సెట్ అవుతుందో..? వేరే హీరోతో సెట్ అవుతుందో..? క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.