కరానా లాంటి కర్కోటక వైరస్ ల బారిన పడకుండా ఉండాలంటే మనిషి దూరంగా వెళ్లి బతకడమే మంచి దంటున్నారు దర్శకుడు పూరీ జగన్నాథ్. దీన్ని ఆయన ‘ఆఫ్ ది గ్రిడ్ లివింగ్ ’అంటున్నారు.
పూరి మ్యూజింగ్స్ లో ఆయన ఈ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి వైరస్ లతో మన భవిష్యత్తు దారుణంగా ఉండబోతోందని ఆయన హెచ్చరించారు. ఈ జనారణ్యంలోనే వైరస్ లుగానీ అడవుల్లో వైరస్ లు ఉండవన్నట్లుగా ఆయన బోధన ఉంది. ఈ నాగరిక ప్రపంచానికీ, నగర జీవనానికీ దూరంగా ఆయన బతకమని సూచిస్తున్నారు. మంచినీళ్లు, కరెంటు, గ్యాస్, ఇంటర్నెట్.. లాంటి మౌలిక వసతులు లేకుండా మనం జీవించగలగాలట.
నిజంగా ఇవేవీ లేకుండా మనం బతకగలమా? అలా జీవించడం ఎక్కడ కుదురుతుంది? లాంటి ప్రశ్నలు తప్పక వస్తాయి. సాధారణంగా ఫామ్ హౌస్ లు నిర్మించుకుని అందులో బతికితే హాయిగానే ఉంటుంది. కానీ ఆ ఫామ్ హౌస్ ల్లోనూ అన్ని సౌకర్యాలూ ఉంటున్నాయి కదా. పూరి చెప్పినట్లు చేయాలంటే పట్టణాలకు దూరంగా వెళ్లిపోవాలి. ఎక్కడో ఒక చోట చిన్న ఇల్లు కట్టుకోవాలి. సోలార్ పవర్ లాంటివి ఏర్పాటుచేసుకోవాలి. కుదిరితే వర్షపు నీటిని వాడుకోవచ్చట. ఇలాంటి జీవన విధానానికి అలవాటు పడిన వాళ్లు శాటిలైట్ ఫోన్ వాడుతుంటారట.
వాళ్ల ఆహారాన్ని వాళ్లే పండించుకోవాలి. పశువులు, కోళ్లు పెంచుకోవాలి. గోఆధారిత వ్యవసాయం చేసుకుంటే మరీ మేలు. గోబర్ గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటుచేసుకోవచ్చు. మన కూరగాయల్ని మనమే పండించుకోవచ్చు. మన వంట.. మన పంట నినాదంతో ముందుకు వెళ్లవచ్చు. డబ్బూ దస్కం లాంటి వాటి అవసరమే ఉండదు. ఎవ్వరికీ ఎలాంటి బిల్లులు కట్టాల్సిన పని ఉండదు. అప్పుల వాళ్ల బాధలు అసలే ఉండవు. ఎలాంటి కోర్టు నోటీసులూ మీ ఇంటికి రావు. పూరి చెప్పే ఈ సూచనలు వినడానికి చాలా బాగున్నాయి కదూ.
పైగా ప్రపంచంలో 35 మిలియన్ల మంది ఇలాంటి జీవన విధానాన్ని అనుసరిస్తున్నారట. ఒకవిధంగా వీరు పర్యావరణాన్ని కాపాడుతున్నట్టే.ఆఫ్ ది గ్రిడ్ లివింగ్ వల్ల భూమి పచ్చదనంతో అలరారుతుంటుందట. మనం అనాగరికుల్లా బతకడమే మేలంటున్నారాయన. మనకు ప్రకృతిలో బతకడం చేతకాదట. ఇలాంటి జీవన విధానం ప్రకృతికి చాలా అవసరమని ఆయన అంటున్నారు.
మన పిల్లలకు ఏదైనా మంచి చేయాలనకుంటే మాత్రం ఇదేనట. మనకు అనారోగ్యం కలిగితే భయపడాల్సిన పనేలేదట. మనం కాయకష్టం చేస్తూ ఉంటే మన దగ్గరికి రోగాలు కూడా రావంటున్నారు. మనం పోవాలంటే మనకు వయసు వచ్చి పోవడమే తప్ప రోగాలతో కాదట. ‘నీటిలో చేపల్లాగా.. గాలిలో పక్షుల్లాగా.. అడవిలో జంతువుల్లాగా.. ప్రపంచంతో సంబంధం లేకుండా ఫ్రీగా బతికే మార్గం ఆఫ్ ది గ్రిడ్. వెనక్కెళ్లి బతుకుదాం.. ముందుకెళ్లి పీకేదేమీ లేదు’ అంటూ పూరీ మార్కు గీతను ఆయన తన మ్యూజింగ్స్ లో బోధించారు.
ఆయన చెప్పినంతలా కాకపోయినా కొంతయినా ఇలా చేస్తే బాగానే ఉంటుంది. ప్రతి ఒక్కరికీ నగరంలో ఇల్లు ఉన్నట్లుగానే పంట పొలాల్లోనూ, మరో చోటో మరో ఇల్లు కట్టుకుని ఇలాంటి వైరస్ లు దాడి చేసినప్పుడల్లా అక్కడికి వెళ్లిపోయి బతకడం చాలమంచిదిలానే ఉంది. ఈ కాన్సెప్ట్ బాగానే ఉందిగానీ దీని మీద ఆయన ఓ సినిమా తీస్తే ఇంకా బాగుంటుంది.
– హేమసుందర్
Must Read ;- పబ్లిసిటీ స్టంట్ లేకుండా రాశిఖన్నా సేవలు