మరో అంశానికి వస్తే వైఎస్ వివేకానంద హత్యకేసుకు సంబంధించి ఆయన కుమార్తె డా.వైఎస్ సునీత పలు వ్యాఖ్యలు చేయడం, ధిల్లీలో సీబీఐ అధికారులను కలవడం కూడా జరిగింది. దీంతో వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాయాల్సి వచ్చింది. కుటుంబంలో విభేదాల్లేవని, షర్మిలకు తమ కుటుంబ ఆశీస్సులున్నాయాని, వివేకా హత్యకేసులో నిజాలు తేల్చాలనే తమ కుటుంబం కోరుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. కొన్ని ఛానెళ్లను, పవన్ కల్యాణ్ ని, చంద్రబాబును విమర్శించారు. వైఎస్ హెలీకాప్టర్ కూలిన ఘటనపై అనుమానాలున్నాయని కూడా వ్యాఖ్యానించారు. ఏబీఎన్ రాధాకృష్ణపైనా విమర్శలు చేశారు. దీంతో ఏబీఎన్ రాధాకృష్ణ మరుసటిరోజే కౌంటర్ ఇచ్చారు. తాజాగా వీకెండ్ కామెంట్ పై ఆర్కేలో పలు వ్యాఖ్యలు చేశారు. తాను లేవనెత్తిన అంశాల్లో ఏది తప్పో.. బైబిల్ పై ప్రమాణం చేస్తారా అని సవాలు విసిరారు. వాటిల్లో కొన్నింటిని పరిశీలిస్తే..
వైఎస్ మరణంపై అనుమానాలున్నాయన్నారు. గతంలో నూ రిలయన్స్ అంబానీపై అనుమానాలు వ్యక్తం చేశారు. జగన్ సీఎం అయ్యాక ఆ అంబానీ అనుచరుడికి రాజ్యసభకు మద్దతు ఇచ్చారు. ఈ అంశాన్ని ఎలా చూడాలి?
మీడియాపై విమర్శలు చేయడం అటుంచితే.. రోత పత్రికలో రాసిన కథనాలు ఇప్పుడు ఏమయ్యాయి?
షర్మిల పార్టీ కార్యకలాపాల్లో భాగంగా ఎక్కడా జగన్ పేరుకాని, జగన్ ఫొటోలను కాని వాడలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజన్నరాజ్యం ఏపీలో ఏర్పాటు చేస్తామని చెప్పిన జగన్ పేరును తెలంగాణలో రాజన్న రాజ్యం ఏర్పాటుచేస్తామని చెబుతున్న షర్మిల కనీసం ప్రస్తావించలేదు. విభేదాలున్నట్లే అర్థం చేసుకోవాలి కదా?
వైఎస్ కుటుంబ అంతర్గత విషయాలని విజయమ్మ చెబుతున్న అంశాలు..కుటుంబ విషయాలు కావు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీ సీఎం. ఆయన కుమారుడు ఏపీ సీఎం. ప్రజాజీవితంలో ఉన్నవారి విషయంలో పూర్తిగా అంతర్గత విషయాలు కొన్నే ఉంటాయి. ప్రతీదీ అంతర్గత విషయం కాదు?
వైస్ తమ్ముడు వివేకా. వివేకా హత్య ఘటన కచ్చితంగా నిగ్గుతేల్చాలి. ఈ అంశమే ఆంధ్రజ్యోతికూడా చెబుతోంది. కాని సీఎం హోదాలో జగన్ ఈ కేసులో త్వరగా విచారణ పూర్తి చేసి నిజాలు నిగ్గుతేల్చాలని కేంద్రాన్ని ఎందుకు అడగలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణకు డిమాండ్ చేసి తరువాత సైలెంట్ ఎందుకయ్యారు?
గతంలో వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ఆంధ్రజ్యోతితోపాటు ఏ మీడియాకూడా ఆ కుటుంబంలో విభేదాలున్నాయని ప్రచురించలేదు. అప్పుడు రాని అలాంటి వార్తలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి. అందుకు కారణం ఏంటి?
YSRCP గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ విజయమ్మ ఏపీ సీఎం జగన్ కు ఇష్టంలేకున్నా షర్మిల ఏర్పాటుచేసిన రాజకీయ సభలో పాల్గొనడానికి కారణం ఏంటి?
వివేకా హత్యకేసును దర్యాప్తు చేస్తున్న చంద్రబాబు హయాంలో నియమితులైన కమిటీలోని అధికారులను ఎందుకు బదిలీ చేశారు.. జిల్లా ఎస్పీతోపాటు పలువురు అధికారులకు స్థాన చలనం కలిగించారు. ఈ కేసులో అనుమానితుడైన శ్రీనివాస్ రెడ్డిది అసహజ మరణమైనా..ఆత్మహత్యగా ఎందుకు చిత్రీకరించారు..కేసు డైరీని సీబీఐకి అప్పగించకపోవడానికి కారణం ఏంటి?
మీ కుటుంబంగా చెబుతున్న, వైఎస్ వివేకా ఏకైక కుమార్తె సునీత ప్రశ్నలకైనా కుటుంబ పెద్దగా మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? జగన్ ప్రభుత్వంపై సునీత అనుమానాలు వ్యక్తం చేసిన మాట వాస్తవం కాదా?
సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో జగన్ ని బెంగళూరుకి పరిమితం చేయాలని ప్రయత్నించిన మాట వాస్తవం కాదా.. ఉన్నట్లుండి జగన్ ఇంట్లో ప్రత్యక్షమైతే వైఎస్ అసహనం వ్యక్తం చేసిన మాట వాస్తవం కాదా..కొడుకు మీద ప్రేమతో మీరు జగన్ బాబు అని పిలుస్తారు సరే.. కాని కన్న తండ్రికూడా భరించలేని వ్యక్తిత్వం జగన్ ది అని ఎందుకు భావించకూడదు?
వివేకా హత్యకేసులో అనుమానాలు వ్యక్తం అవుతున్నా..అవినాశ్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని పోలీసులు ప్రశ్నించకపోవడానికి కారణం చెబుతారా?
అవినాష్ రెడ్డిపై చర్య తీసుకుంటే ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని సీఎం జగన్ చెప్పడం నిజం కాదా?
జగన్ స్వభావం గురించి ప్రజలు చూశారంటున్నారు విజయమ్మ. ప్రజలు అమాయకులు కాబట్టి జగన్ ని నమ్ముతుండవచ్చు. కాని వైఎస్ ఎందుకు చిరాకుపడేవారో చెప్పగలరా?
కుటుంబ వ్యవహారాల్లో మీ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిందన్నది నిజం కాదా?
కేంద్రంతో జగన్ కు సత్సంబంధాలు ఉంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై విచారణ జరిపించవచ్చు కదా..ఎందుకు జరిపించడం లేదు..? ఈ మేరకు కుమారుడిపై ఒత్తిడి తేలేరా..?మీకు ఈ కుట్రలు, కుతంత్రాల గురించి తెలుసో తెలియదో..కాని వివేకా హత్య విషయంలో ఆయన కుమార్తె సునీత ఆవేధనను అర్థం చేసుకుని హంతకులను శిక్షించేలా చర్యలు తీసుకునేలా చొరవ చూపలేరా?
సీఎం జగన్ రెడ్డిపై ఆయన పార్టీకి చెందినవారు ఏ అభిప్రాయంతో ఉన్నారో తెలుసుకోవాలని విజయలక్ష్మికి విజ్ఞప్తి.
నిజానికి విజయలక్ష్మి మానవత్వం ఉన్న మంచి మనిషి అని చాలా మంది చెబుతారు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇలాంటివార్తలు రాలేదు..ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి?
అప్పట్లో ఏపీ పౌరుల డేటాను చంద్రబాబు, లోకేష్ కంపెనీలు కాజేశారని ఆరోపిస్తూ రోత పత్రికలో పలు కథనాలు రాశారు. తెలంగాణ సీఎం సహకారంతో మీకు నమ్మకస్తుడైన స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటుచేయించుకున్నారు. కాని ఆ కేసు ఏమైంది. చెప్పగలుగుతారా? ఇలా పలు అంశాలపై వైఎస్ విజయలక్ష్మి బైబిల్ పై ప్రమాణం చేసి చెప్పగలుతారా అని ఏబీఎన్ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ లో సవాలు చేశారు.
వీటితోపాటు టీటీటీ ప్రధాన పూజారిగా బాధ్యతలు తీసుకున్న రమణ ధీక్షితులు చేసిన వ్యాఖ్యలపైనా ప్రశ్నలు సంధించారు. చంద్రబాబును రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే పింక్ డైమండ్ మాయమైందని చెప్పారు..అసలు పింక్ డైమండ్ ఉండదన్న విషయం మైనింగ్ నిపుణులే చెబుతున్నారు. మరి రమణ ధీక్షితులు ఎందుకలా చేశారో అర్థం చేసుకోవడం పెద్ద విషయం కాదని ఆర్కే కామెంట్ చేశారు. కోట్లాది మంది భక్తులు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా నమ్మి ఆరాధించే శ్రీ వెంకటేశ్వర స్వామిని మాత్రమే పూజిస్తూ స్తుతించాల్సిన ప్రధాన అర్చకుడి హోదాలో ఉన్న రమణదీక్షితులు, క్రైస్తవాన్ని ఆచరిస్తున్న జగన్ రెడ్డిని విష్ణుమూర్తి ప్రతిరూపమని అభివర్ణించడం పెద్ద అపచారమని వ్యాఖ్యానించారు. ఇక జగన్ రెడ్డిలో విష్ణుమూర్తిని చూస్తున్న రమణ దీక్షితులు..ఆయన అభిమానించే సీఎం ఒక్కసారైనా సతీసమేతంగా తిరుమలకు ఎందుకు రాలేదో చెబుతారా అని ప్రశ్నించారు. పతనానికి దిగజారిన రమణ దీక్షితులు హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసినట్టే నని వ్యాఖ్యానించారు. చివరగా జానెడు కడుపు నింపుకోవడానికి జీవనాధారమైన దేవుడ్ని కూడా చిన్నబుచ్చడం దుర్మార్గంమని, ఇలాంటివారిని అందలం ఎక్కిస్తున్న జగన్ హిందూధర్మాన్ని కాపాడుతున్నారా? నాశనం చేయబోతున్నారా? అన్నది భక్త కోటి ఆలోచించుకోవాలి అని వ్యాఖ్యానించారు.
Must Read ;- విజయమ్మ లేఖ.. పవన్‌కి సమాధానం











