Tribal Schools Started By Santosh Esram At Telangana Rural Areas :
ఈ టెక్నాలజీ యుగంలో పట్టణాలు.. పల్లెలు అనే తేడా లేకుండా పరుగులు పెడుతున్నాయి. సాంకేతికతను అందిపుచ్చుకొని అన్నిరంగాల్లో దూసుకుపోతున్నాయి. కానీ పల్లెల మాటున కొన్ని గూడెంలు, స్లమ్ ఏరియాలు.. నేటికి బ్యాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటూనే ఉన్నాయి. తెలంగాణలోని ములుగు జిల్లాలో ఎన్నో ఆదివాసీ, గుత్తికోయల తెగలవారు ఉంటున్నారు. నేటికీ విద్య, వైద్యం నోచుకోని అమాయక ప్రజలు ఎంతోమంది. అలాంటివాళ్ల కష్టాలు చూసి చలించిపోయాడు ఓ యువకుడు. ఆదివాసీ గూడేల్లోని ఓ గుడిసెను వేసి బడిగా మార్చాడు. ఎంతోమంది పిల్లలచేత అక్షరాలు దిద్దిస్తున్నాడు.
ఫొటోలు బంధించి.. జీవితాలు చూపించి
సంతోష్ ఇస్ర్తం.. ములుగు జిల్లాలోని మారుమూల గ్రామం. చదువుకోవడానికి ఎంతో ఇబ్బందులు పడ్డాడు. తల్లిదండ్రులు కూలీ పనిచేసినా.. సరైన విద్య అందని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ కు వచ్చి చదువుకున్నాడు. సోషల్ అవేర్ నెస్ పై ఓయూ లో పీజీ చేశాడు. సంతోష్ కు చదువుతో ఫాటు ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ప్రపంచం పరుగులు పెడుతున్నా.. నేటికీ వెలుగులోని రాని పల్లెల్లు, గ్రామాలు, గూడెలు ఎన్నో ఉన్నాయి. వాళ్లందరి జీవితాలను వెలుగులోకి తీసుకురావాలనుకున్నాడు. కెమెరా చేతపట్టి ఆదివాసీలు, గుత్తికోయలు పడుతున్న ఇబ్బందులను, బాధలను ఆవిష్కరించాడు. అంతేకాదు.. హైదరాబాద్ రవీంద్రభారతి లో ఫొటో ఎగ్జిబిషన్ పెట్టి ఆదివాసీ జీవితాలను కళ్లకు కట్టాడు.

అడవిలో అక్షర సేద్యం
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ఓ ఐదు గ్రామాల్లో పూర్తిగా ఆదివాసీలే ఉంటారు. ఆదివాసీల చేత అక్షరాలు దిద్దిస్తేనే.. వాళ్ల జీవితాలు బాగుపడతాయని తెలుసుకున్నాడు సంతోష్. తన పాకెట్ మనీతో చిన్న గుడిసెలో బడిని ఏర్పాటుచేశాడు. ‘భీమ్ చిల్డ్రన్స్ హ్యాపినెస్ సెంటర్’గా (బీసీహెచ్‌సీ) అని పేరు పెట్టాడు. దాదాపు 50 నుంచి 60 పిల్లలకు పాఠాలు చెబుతూ.. చదువు విలువ తెలియజేస్తున్నాడు. ఎదుగుదల లేకుండా, పౌష్ఠికాహార లోపంతో, అనారోగ్యంపాలైన పిల్లలే కనిపించారు. అలాంటి పిల్లలకు ప్రత్యేక ఆహారం అందించాడు. సంతోష్ ప్రయత్నం ఎంతోమందికి నచ్చడంతో దాతలు ముందుకు వచ్చారు. వాళ్ల సాయంతో పిల్లలకు బట్టలు, పుస్తకాలు, స్టడీ మెటిరీయల్ అందిస్తూ గొప్ప పౌరులుగా తీర్చిదిద్దుతున్నాడు. కరోనా సమయంలోనూ పిల్లలకు పాఠాలు చెప్పాడు సంతోష్. ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా సంతోష్ అభినందించి తనవంతు సాయం చేశారు.

బడులు విస్తరిస్తాం
‘‘ములుగు జిల్లాలో ఎంతోమంది పిల్లలకు చదువు అందడం లేదు. ఇలాంటి పాఠశాలలు నెలకొల్పి నావంతు సాయం చేస్తా. దాతలు కూడా ముందుకొస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మా ప్రయత్నం బాగా నచ్చింది. అందరి సాయంతో ఆదివాసీలను చైతన్యపరుస్తానని’’ సంతోష్ ఇస్రం అన్నాడు.
Must Read ;- కరోనాను జయించి.. ఎవరెస్ట్ ను అధిరోహించి!










