ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మల్టీ స్టారర్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ విడుదల వాయిదా పడితీరుతుందన్న మాట గత కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు అది నిజం కాబోతోంది. ఈ సినిమాని జక్కన్న చెక్కడం ఇంకా పూర్తికాలేదట. అందుకే ముందుగా ప్రకటించిన విధంగా అక్టోబరు 13న ఈ సినిమా రిలీజ్ కావడం లేదు. జనవరి 7న విడుదల చేయాలని యోచిస్తున్నారు. అంటే దాదాపు సంక్రాంతి బరిలోకి వెళ్లిపోయిందన్న మాట. ఈసారి పెద్ద సినిమాలన్నీ సంక్రాంతినే టార్గెట్ చేశాయి.
ఈ సినిమా విడుదల వాయిదా పడిందన్న విషయం తెలియడంతోనే కొన్ని సినిమాలు దసరాకి విడుదలవుతున్నాయి. ఈ సినిమా విడుదల వాయిదా పడితే అక్టోబరు 13న ‘ఆచార్య’ విడుదల కావచ్చని వార్తలు వచ్చాయి. అయితే ‘ఆచార్య’ కూడా అక్టోబరులో విడుదల కావడం లేదని తెలుస్తోంది. ట్రిపుల్ ఆర్ చిత్రం జనవరి 7 విడుదల అని అధికారికంగా ప్రకటించికపోయినా ఆ తేదీ మాత్రం బయటకు వచ్చింది. అదే జరిగితే సంక్రాంతికి విడుదలయ్యే కొన్ని సినిమాలు వాయిదా పడాలి. లేదా ట్రిపుల్ ఆర్ మరో తేదీకి మారిపోవాలి.
ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితీరుతుంది. ఎందుకంటే సంక్రాంతికి పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్, వెంకీ ఎఫ్ 3, మహేష్ బాబు ‘సర్కారువారి పాట’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’ లాంటివి ఉన్నాయి. ఇవి కాక తమిళ్ డబ్బింగ్ చిత్రాలు కూడా బరిలోకి వస్తాయి. అలాంటప్పుడు వారం రోజులు ముందుగా ట్రిపుల్ ఆర్ ను ఎందుకు విడుదల చేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. మళ్లీ వాయిదా పడితే మాత్రం విడుదల ఉగాదికి మారిపోతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మీద అంచనాలు కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి.
Must Read ;- ఆర్ఆర్ఆర్ లో.. మగధీరను మించిన ఫైట్











