తిరుమల శ్రీవేంకటేశ్వరుడి సేవలో మరింత కాలం తరిస్తానంటూ బాబాయి అడిగితే.. అబ్బాయి ససేమిరా అన్నారు. ఇంకేముంది.. కనీసం ముఖం కూడా చూపకుండా బాబాయి బెంగళూరు ఫ్లైటెక్కేసి అలక పాన్పు ఎక్కారు. బాబాయి అలక బూనితే అబ్బాయి తీర్చాల్సిందేగా. ఇదేమీ వాళ్లకు కొత్త కూడా కాదు. తాను అడిగిన మేరకు ఏది ఇవ్వకున్నా బాబాయి అలక బూనడం.. వెంటనే రంగంలోకి దిగి అబ్బాయి నానా పాట్లు పడి బాబాయి అలకను తీర్చడం మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడూ అదే జరిగింది. బాబాయి అలకబూనారు. అబ్బాయి ఆలకను తీర్చారు. బాబాయి రెండేళ్ల పదవీకాలాన్ని కోరితే.. ఎందుకొచ్చిన గొడవ రెండున్నరేళ్లు తీసుకోపో అంటూ అబ్బాయి తనదైన శైలి ఉదారతను చూపారు.
అలకబూనితేనే పదవి..
ఈ అబ్బాయి, బాబాయి గోల ఏమిటి? అనుకుంటున్నారా? ఏపీ సీఎం వైఎస్ జగన్ అబ్బాయి అయితే.. బాబాయి మరెవరో కాదు ఆయన గారి పిన్నమ్మ భర్త వైవీ సుబ్బారెడ్డి. 2019 ఎఏన్నికల్లో కొన్ని ఈక్వేషన్ల వల్ల తన ఒంగోలు సీటును వైవీ వదులుకుంటే.. ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ పదవిని జగన్ కట్టబెట్టారు. అయితే సీఎంగా జగన్ రెండేళ్లే పూర్తి చేసుకున్న మాదిరే వైవీ పదవీ కాలం కూడా రెండేళ్లు పూర్తి అయ్యింది. సీఎం పదవీ కాలం ఐదేళ్లు అయితే.. టీటీడీ చైర్మన్ పదవీ కాలం రెండేళ్లే కదా. తన పదవీ కాలం ముగిసిపోతోంది.. మరింత కాలం స్వామి వారి సేవలో తరిస్తాను.. తిరిగి తననే చైర్మన్ గా నియమించాలంటూ స్వయంగా జగన్ ను వైవీ అడిగారట. అయితే అందుకు జగన్ ససేమిరా అనడంతో అలిగిన వైవీ.. బెంగళూరు వెళ్లి అలకపాన్పు ఎక్కారు.
ఈ సారి రెండున్నరేళ్లు..
సరే.. ఇదంతా వారిద్దరికీ అలవాటైనదే కదా. అందుకే కాబోలు కాస్తంత తీరిక చూసుకుని జగన్ తన బాబాయి వైవీకి ఫోన్ చేశారట. అలక వీడి వచ్చేయండి.. మీరు అడిగిందేదో ఇచ్చేస్తాం రండి.. అంటూ బుజ్జగించారట. అంతేకాకుండా ఈ దఫా రెండేళ్లు కాదు. రెండున్నరేళ్ల పాటు పదవి ఇస్తాను వచ్చేయండి అంటూ జగన్ మరింత ఉదారత చాటారట. దీంతో వైవీ రెక్కలు కట్టుకుని మరీ బెంగళూరు నుంచి అమరావతి వచ్చేశారట. ఇదీ కథ. అసలు విషయానికి వస్తే.. టీటీడీ ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి నియమితుయ్యారు. టీటీడీ ఛైర్మన్ గా రెండోసారి ఆయనకు జగన్ బాధ్యతలను అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వం శనివారం నామినేటెడ్ పదవులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నామినేటెడ్ పదవుల జాబితాలో సుబ్బారెడ్డి పేరు ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది.
నామినేటెడ్ జాతర
ఇదిలా ఉంటే.. ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్ పోస్టులను జగన్ ప్రభుత్వం శనివారం భర్తీ చేసింది. ఈ వివరాలను శనివారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హోం మంత్రి సుచరితతో కలిసి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్డించారు. మొత్తం 135 కార్పొరేషన్లు, సంస్థలకు చైర్మన్లను, డైరెక్టర్లను నియమించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 56 శాతం పదవులను కేటాయించారు. 68 మంది మహిళలకు అవకాశం ఇచ్చారు. ఈ జాబితాలో వీఎంఆర్డీఏ చైర్ పర్సన్ గా అక్కరమాని విజయనిర్మల, ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ చైర్ పర్సన్ గా గాదల బంగారమ్మ, మేరిటైం బోర్డు చైర్మన్ గా కాయల వెంకట్ రెడ్డి, టిడ్కో చైర్మన్ గా జమ్మాన ప్రసన్న కుమార్, పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ గా ద్వారంపూడి భాస్కర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గా నెక్కల నాయుడు బాబు, ఏపీ గ్రీనింగ్ బ్యూటీ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్. రామారావు, తిరుపతి స్మార్ట్ సిటీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ గా నరమల్లి పద్మజ, కాపు కార్పొరేషన్ చైర్మన్ గా అడపా శేషగిరి, విమెన్స్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా హేమ మాలిని రెడ్డి తదితరులు ఉన్నారు.
Must Read ;- జగన్ ‘డిప్యూటీ’లంతా డమ్మీలే!











