5 రోజులు పూర్తికావొస్తుంది. కానీ, పట్టిన పట్టు వదలనంటున్నారు రైతులు. కేంద్రం వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకుని, మా డిమాండ్లను పరిశీలించేంత వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదంటున్నారు. చివరికి కేంద్రంతో చర్చలను కూడా తిరస్కరించారు. ఢిల్లీ దిగ్భంధం చేస్తామంటూ హెచ్చిరకలు జారీ చేశారు. కేంద్రం అత్యవసర భేటీ ఏర్పాటు చేసి చర్చించినా ఎటువంటి నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నట్లు కనిపిస్తుంది. ఆఖరికి రంగంలోకి కేంద్ర మంత్రులు దిగి వారికి అవగాహాన కల్పించే చేస్తున్నట్లు కనిపిస్తుంది. తాజాగా కేంద్ర మంత్రలు ప్రకాష్ జవదేకర్, రవి శంకర్ ప్రసాద్ తమ ట్విట్టర్ వేదికగా రైతులను సమాధానపరచడానికి ప్రయత్నించారు.
అపార్ధం చేసుకోకండి
రైతులు వ్యవసాయ బిల్లలను అపార్ధం చేసుకున్నారని ప్రకాష్ జవదేకర్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ బిల్లులలోని విషయాలను అర్థం చేసుకోలేక రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులకు నష్టం కలిగించే పని ఏనాటికి తమ ప్రభుత్వం చేయదని చెప్పుకొచ్చారు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. ‘దయచేసి రైతులు బిల్లులను అపార్థం చేసుకోకండి. కనీస మద్దతు ధరలకు ఎటువంటి సమస్య ఉండదు. గతేడాది కంటే ఎక్కువ మొత్తంలో మీరు వరిని అమ్ముకోవచ్చు. కనీస మద్దతు ధర అలాగే ఉంటుంది… మార్కెట్లు యధావిధిగా పని చేస్తాయి… ప్రభుత్వ పంట సేకరణ కూడా యథాతధంగా జరుగుతుంది.’ అంటూ ట్విట్టర్ వేదికగా రైతులకు అవగాహాన కల్పించే ప్రయత్నం చేశారు జవదేకర్.
మార్కట్ కమిటీ మూతపడదు
రైతులతో కమిటీ నిర్వహకులు చాలా ఆందోళన చెందుతున్న మాట వాస్తవం. కొత్త చట్టాల వల్ల ఇన్నాళ్లు కమిటీల ద్వారా విక్రయాలు కొనసాగేవి. ఇప్పుడు కొత్త బిల్లుల ప్రకారం వాటిపై ప్రభావం పడే అవకాశం ఉండడంతో వారు కూడా రైతులకు మద్దతుగా ఆందోళన బాటపట్టారు. వారికి స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు మంత్రి రవి శంకర్ ప్రసాద్. కొత్త చట్టాలు అములులోకి వచ్చినంత మాత్రానా మార్కెట్ కమిటీలు రద్దుకావు. వాటిని యథాతధంగా నడుపుకోవచ్చు. కాకపోతే, ఈ వ్యవసాయ చట్టాల ద్వారా రైతుకు పంటను ఎక్కడైనా అమ్ముకునే స్వతంత్రం మాత్రం ఉంటుంది. ఏ మార్కెట్ లో ఎక్కువ ధర లభిస్తే అక్కడ అమ్ముకోవచ్చు.
మద్దతు ధరపైన చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ బిల్లుల వల్ల మద్దతు ధర లభించదు అనుకుంటున్నారు. కానీ కొత్త చట్టాలు కనీస మద్దతు ధరపై ఎటువంటి ప్రభావం చూపవు. అవి ముందు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. మీకు ఎప్పటిలాగే ధర లభిస్తుంది. నిజానికి, ఈ బిల్లు వల్ల రైతు కార్పొరేట్ కంపెనీల కాంట్రాక్ట్ కు కట్టుబడి నష్టపోవాల్సిన అవసరం లేదు. కచ్చితమైన ధరలు లభించినపుడే రైతులు కాంట్రాక్టును పాటించవచ్చు లేదా ఎప్పుడైనా ఎటువంటి రుసుము చెల్లించకుండా కాంట్రాక్ట్ నుంచి బయటపడవచ్చు. ఇలా అన్ని విషయాలను వివరించారు మంత్రి రవి శంకర్.
రంగంలోకి దిగిన మోడీ
మంత్రులతోపాటు మోడీ కూడా వ్యవసాయ బిల్లుల గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లుంది. ప్రస్తుతం ప్రతి వస్తువు ప్రపంచీకరణ లో భాగం అవుతుంది. మరి వ్యవసాయం అందుకు మినహాయింపు ఎందుకు కావాలి? మన దేశంలోని వ్యవసాయ ఉత్పత్తులకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. మరి దానికి రైతులను చేరువ చేసే ప్రయత్నమే ఈ కొత్త చట్టాలు. మునుపు మీ పంట మార్కెట్ దాటి అమ్ముకోవడం చట్టవిరుద్ధం. కానీ కొత్త వ్యవసాయ బిల్లుల ప్రకారం, రైతు పంటను దేశీయంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా అమ్ముకునే అవకాశం కలుగుతుంది. మద్దతు ధరపై ప్రభావం పడుతుందనే వార్తలు కేవలం అపోహలు మాత్రమే. అలాంటి వాటిని నమ్మి మీకొస్తున్న కొత్త అవకాశాలను లాభాలను కోల్పోకండి అంటూ ట్టిట్టర్ వేదికగా చట్టాలలోని పలు విషయాలను విశిదీకరించాడు మోడీ.
అవగాహాన లేని మాట నిజం
రైతులకు కొత్త చట్టాలపై అవగాహాన లేనిమాట నిజం. వాటి ఫలితాలు ఎలా ఉంటాయో అనే ఆందోళన చెందుతున్నమాట కూడా వస్తవమే. కొత్త చట్టాల ద్వారా వ్యవసాయ మార్కెట్లు కుదేలవుతాయని కూడా ఆందోళన ఉంది. రైతులకు పంట అమ్ముకునే స్వతంత్రం కల్పిస్తున్న మాట వాస్తవమే, కానీ పంట అమ్ముకునే విషయంలో రైతులకు అది ఎంతవరకు ఉపయోగపడుతుందనేది అతి పెద్ద ప్రశ్న? ఎక్కువ శాతం రైతులు దగ్గరలోని మార్కెట్లకు అలవాటుపడినవారే. వారికి ఈ ప్రపంచీకరణ ఉపయోగపడుతుందా? రైతులను లాభాల బాట పట్టిస్తుందా అంటే అవకాశాలు తక్కువనే చెప్పాలి.