కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా మరో నెల రోజుల పాటు థియేటర్లు ప్రారంభం కావనే అనుకోవాలి. సినిమా చూడాలనుకునే వారికి ఓటీటీ తప్ప మరో మార్గం కనిపించడం లేదు. అందువల్ల రాబోయే రోజుల్లో మరికొన్ని తెలుగు సినిమాలు ఓటీటీలో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గుతున్నాయి. బహుశా జులై నుంచి సినిమా షూటింగులు ప్రారంభం కావడానికి కూడా అవకాశం ఉంది. థియేటర్లు ప్రారంభం కాగానే విడుదల కావడానికి పెద్ద సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో చిన్న సినిమాల విడుదలకు థియేటర్లు లభించే అవకాశం కూడా లేదు. అందువల్ల ఓటీటీ తప్ప వీటికి మరో గత్యంతరం లేదు. థియేటర్లలో కాకుండా ఓటీటీలోనే తమ సినిమాలను విడుదల చేయడానికి కొందరు నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. విశ్వక్సేన్ ‘పాగల్’, నితిన్ ‘మాస్ట్రో’ చిత్రాలను ఓటీటీలో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. బాలీవుడ్ చిత్రం అందాధున్ ఆధారంగా నితిన్ మాస్ట్రో రూపొందుతున్న సంగతి తెలిసిందే.
ఇంతకుముందు విడుదలైన నితిన్ రంగ్ దే, చెక్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన ‘సూపర్ మచ్చి’ చిత్రాన్ని కూడా ఓటీటీలోనే విడుదల చేయటానికి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక కీర్తిసురేష్ ‘గుడ్ లక్ సఖి’ ఓటీటీ బరిలోనే ఉంది. దీన్ని జీ5లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఒప్పందం కుదరనట్టు తెలుస్తోంది. ఇది తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదలవుతుంది.
ఇక ప్రాంతీయ ఓటీటీ ఆహా కూడా మంచి చిత్రాలపై కన్నేసింది. వాటిని నిశ్శబ్దంగా ఓటీటీలో విడుదల చేసేస్తోంది. ‘అర్ధశతాబ్దం’ చిత్రం ఈ నెల 11న ఆహాలోనే విడుదలవుతుంది. ముఖ్యంగా డబ్బింగ్ చిత్రాల విడుదలకు ఆహా ఒక వేదికగా మారింది. ఇతర ప్రాంతీయ భాషల్లో రూపొందిన చిత్రాలను తెలుగులోకి అనువదించి విడుదల చేసే విషయంలో ఆహా ముందంజలో ఉంది. ముఖ్యంగా మలయాళ చిత్రాలను ఈ సంస్థ ఎక్కువగా విడుదల చేస్తోంది. వీటికి మంచి ఆదరణ కూడా లభిస్తోంది.
Must Read ;- మూడు వెర్షన్లలో సినిమాలు రాబోతున్నాయా?