పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’కూ, జగన్ సర్కార్ కూ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రీమియర్ షోలకు అనుమతి విషయంలోనే ఈ వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. ప్రీమియర్ షోలు వేసుకోవడ తప్పులేదు కానీ ఈ షోల పేరుతో దండిగా డబ్బులు వసూలు చేయడం మాత్రం తప్పే. అసలు స్టార్ హీరో సినిమా అంటేనే వందల కోట్లు కలెక్ట్ చేయగలిగే స్టామినా ఉంటుంది. ఇంత వెసులుబాటు ఉన్నప్పుడు బెనిఫిట్ షోల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేయడం ఎంతమాత్రమూ సమంజసమూ కాదు. ఈ విషయంలో జగన్ సర్కార్ మొండిగా వ్యవహరించడాన్ని కక్షసాధింపు చర్యగా రాజకీయ రంగు పులుముతున్నారు.
ఒకవేళ దీని వెనక రాజకీయమే ఉన్నా ప్రజల దగ్గర నుంచి ఇలా భారీ వసూళ్లు ఎందుకు చేయాలి? అసలు సినిమా ఫుల్ రన్ తో వారం రోజులు ఆడితేనే వందల కోట్లు వచ్చేస్తున్నాయి. అన్ని థియేటర్లలో ఆ సినిమా తప్ప మరో సినిమా ఆడే పరిస్థితి లేదు. ఈ బెనిఫిట్ షో ధరను రూ. 1500గా నిర్ణయించాలని అనుకున్నారు. ఆమేరకు ఏర్పాట్లు కూడా చేశారు. సాధారణ టికెట్ ధరను కూడా రూ. 300 నుంచి రూ. 500 వరకూ పెంచుకోవాలనుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు ప్రీ బిజినెస్ కూడా బాగా జరిగింది.
రాత్రి ఒంటి గంటలకు షోలు వేయాలన్న ప్రతిపాదన జరిగింది. కొన్ని చోట్ల షోలు వేశారన్న సమాచారం కూడా ఉంది. టిక్కెట్లు కూడా అమ్మేశారు. ఈ సమాచారం ప్రభుత్వాలకు తెలిసి రాత్రికి రాత్రి జీవోలు జారీ చేశాయి. ఈ ప్రీమియర్ టిక్కెట్ల ధరను పెంచే వెసులు బాటు లేకపోవడంతో పంపిణీదారులు భారీగానే నష్టపోయారు. దీన్ని నష్టపోయారని చెప్పడం కూడా సమంజసం కాదు. అదనంగా రావాల్సిన మొత్తం రాలేదు అంతే.
ఇదో తరహా బ్లాక్ మార్కెట్ దందా
ఒకప్పుడు టిక్కెట్లను బ్లాక్ లో అమ్మేవారు. థియేటర్ల మేనేజర్లు ఇన్వాల్వ్ అయి ఆ టిక్కెట్లను బ్లాక్ లో అమ్మేవారు. ఇప్పుడు దాదాపు ఆ సంస్కృతి పోయింది. ఒకవిధంగా చెప్పాలంటే ఈ బెనిఫిట్ షోల వ్యవహారం బ్లాక్ మార్కెట్ లాంటిదే. బుక్ మై షో వచ్చాక అందరూ ఆన్ లైన్ లోనే టిక్కెట్లను బుక్ చేసుకుంటున్నారు. వకీల్ సాబ్ టిక్కెట్ల కోసం అలాగే బుక్ మై షో సైట్ చూస్తే అందులో టిక్కెట్లు బుక్ చేసుకునే వెసులు బాటే కనిపించలేదు. దాంతో చాలా మంది నిరాశచెందారు. ఇక్కడ కూడా టిక్కెట్లు బ్లాక్ చేసుకునే వెసులు బాటు ఉంది కాబట్టి అనధికారికంగా అమ్ముకునే ఏర్పాటుచేశారు. వీటికి పెట్టిన పేరే బెనిఫిట్ షో లేదా ప్రీమియర్ షో. దీనికి సర్కారు అడ్డు తగిలింది.
భారీగా నష్టపోవడంతో పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ఎక్కువ ధరకు టికెట్లు అమ్మిన చోట అధికారులు చర్యలు చేపట్టారు. థియేటర్ల యాజమాన్యాలు అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని వెనక్కి ఇప్పించారు. పవర్ స్టార్ అభిమానులకూ, సర్కారుకూ మధ్య సామాజిక మాధ్యమాల వేదికగా వార్ సాగుతోంది. మధ్యలో భాజపా కూడా రంగ ప్రవేశం చేసింది. పర్యవసానంగా ఇది రాజకీయ వార్ గా పూర్తిగా రంగు పులుముకుంది.
బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో మొదలైన వివాదం భాజపా, వైఎస్ఆర్సీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. భాజపా ఆరోపణలకు వైసీపీ ధీటుగా సమాధానం చెప్పింది. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ‘వకీల్ సాబ్’ సినిమాను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ప్రజల్ని దోచుకోవడానికి బెనిఫిష్ షోలు వేస్తే తాము అనుమతులివ్వాలా? అని పేర్ని నాని ప్రశ్నించారు. నిబంధనలు మార్చేదిలేదని ఆయన స్పష్టం చేశారు.
కోర్టుకు చేరిన వకీల్ సాబ్ బాల్
వకీల్ సాబ్ బాల్ ఇప్పుడు కోర్టులో ఉంది. మూడు రోజుల పాటు టికెట్ ధర పెంచుకోవచ్చంటూ ఏపీ హైకోర్టు ఏపీలోని 13 జిల్లాల జాయింట్ కలెక్టర్లకు, ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా టిక్కెట్ల ధర పెంచుకోవచ్చంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయడానికి ఏపీ ప్రభుత్వం కూడా సిద్ధమైంది. కాసేపట్లో హౌస్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఈరోజు ఏం జరగబోతుందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. హైకోర్టు తీర్పుతో ఆనందంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం.
– హేమసుందర్ పామర్తి
Must Read ;- పవన్ కళ్యాణ్‌కు ఆవేశం ఎక్కువ.. ఆలోచన తక్కువ : సజ్జల