జనసేన సర్పంచులు గెలిచినా గ్రామాల్లో వైసీపీ గూండాలు బెదిరిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు ఇలాంటి పిచ్చివేషాలు వేస్తే సమాజం వారిని రోడ్డుకు ఈడుస్తుందని ఆయన హెచ్చరించారు. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. 151 వైసీపీ ఎమ్మెల్యేలు గూండాల మాదిరి వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ప్రతి ఒక్క వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపులకు దిగుతున్నారని, అయితే పవన్ కళ్యాణ్ కాని, జనసైనికులు కాని భయపడే ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
సీమలో వైసీపీ ఫ్యాక్షన్ గూండాలు చెలరేగిపోతున్నాయి…
ఒక్క ఎమ్మెల్యే భయపడితే భయపడాలా…. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తలతెగిపడ్డా భయపడడని హెచ్చరించారు. మీలాగా దోచుకుని సిమెంటు ఫ్యాక్టరీలు పెట్టలేదు, నాకు పేకాట క్లబ్లులు లేవు… అందుకే సినిమాలు చేసుకుంటున్నానని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఓటుకు రూ.2000 ఇవ్వడానికి వీరికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయని పవన్ ఆవేశంగా ప్రశ్నించారు. రాగి సంకటి తిని అయినా బతుకుతాం కాని, అడ్డగోలు సంపాదన తనకు అక్కరలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది కాలంలో ఏపీ దశాదిశా మారాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. నోట్లతో ఓట్లు కొనే రోజులు పోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
రత్నప్రభను గెలిపించండి…
బీజేపీ బలపరిచిన అభ్యర్థి రత్నప్రభను గెలిపిస్తే తిరుపతి అభివృద్ధి చెందుతుందని, ఓటు వేసి గెలిపించాలని పవన్ కళ్యాణ్ విజ్ఙప్తి చేశారు. 22 మంది ఎంపీలను గెలిపిస్తే వైసీపీ నేతలు రాష్ట్రానికి ఏం తెచ్చారని ఆయన ప్రశ్నించారు. 151 మంది ఎమ్మెల్యేలు స్థానిక ఎన్నికల్లో జనాలను బెదిరించి వైసీపీ సర్పంచులను గెలిపించారని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. మీకు దమ్ముంటే నాతో గొడవ పెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో అధికార బదలాయింపు జరగాలన్నారు. నేను ఎప్పుడూ అధికారం కోసం అర్రులు చాచలేదని ఆయన అన్నారు. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఉన్నాను అంతకన్నా పెద్ద పదవి ఏముంటుందని పవన్ అభిప్రాయపడ్డారు.
వివేకానందరెడ్డిని ఎవరు చంపారు…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయి 2 సంవత్సరాలు అయినా నిందితులను నేటికీ పట్టుకోకపోవడం దారుణమని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో 100 మంది ఐపీఎస్ లు ఏం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా కోతికత్తి కేసు నిందితులను ఎందుకు పట్టుకోలేదని పవన్ ప్రశ్నించారు. తప్పు జరుగుతున్నప్పుడు వెనకేసుకువస్తే ఆ పాపంలో మనం కూడా పాలుపంచుకున్నట్టే, వైసీపీ అధినేత చేస్తున్న పాపాలను వెనకేసుకు వస్తున్న నాయకులకు పాపం తగులుతుందన్నారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికివేసి వేలకోట్లు దోచుకుంటున్నారని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో ఎర్రచందనం అమ్మకం ద్వారా రూ.1600 కోట్లు వస్తే, వైసీపీ వచ్చినాక ఆ డబ్బంతా ఎటుపోయిందన్నారు. శేషాచలం అడవుల నుంచి చైనాకు నేరుగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. శేషాచలం అడవుల్లో నేల కూలిన ప్రతి ఎర్రచందనం చెట్టు వైసీపీ పతనానికి మెట్టని పవన్ విమర్శించారు.
కవాతుకు అంతరాయం..
రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి తిరుపతి ఎమ్మార్ పల్లి సర్కిల్ వద్దకు చేరుకున్న పవన్ కళ్యాణ్ సాయంత్రం 7 గంటలకు ముందు కవాతు ప్రారంభించారు. వేలాది మంది అభిమానులు తరలిరావడంతో పాదయాత్రకు అంతరాయం ఏర్పడింది. దీంతో పవన్ కళ్యాణ్ మరలా కారు ఎక్కి అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. తిరుపతి బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనసేన, బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. తిరుపతి సభకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, తిరుపతి బీజేపీ, జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి రత్నప్రభ, ఏపీ బీజేపీ ఇంఛార్జి సునీల్ థియోదర్, జనసేన నేత నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు.
Also Read : ఎస్‌ఈసీ సమావేశాన్ని బహిష్కరించిన టీడీపీ, బీజేపీ, జనసేన