కోర్టు తీర్పుతో రామ్ గోపాల్ వర్మలో చలనం వచ్చింది. కాకపోతే వర్మ ఒక మెట్టు కిందకు దిగాల్సి వచ్చింది. నేనిలా ఉంటా.. నేనిలా తీస్తా అంటే సరిపోదని కూడా అర్థమైంది. అందుకే మర్డర్ సినిమా ఏ ఒక్కరి కథ కాదు.. అది కల్పిత గాథ అంటూ కొత్త కథ చెప్పాల్సి వస్తోంది. అమృత, ప్రణయ్ ల వాస్తవ గాధను సినిమాగా తీస్తున్నానంటూ ఆయన ‘మర్డర్’ సినిమాని తీశారు. ఈ సినిమా విడుదలను ఆపాలని అమృత నల్గొండ కోర్టులో కేసు వేయడంతో కోర్టు సినిమా విడుదల నిలిపివేసింది.
ఈ స్టేను సవాలు చేస్తూ నిర్మాతలు తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు. అయితే హైకోర్టు కొన్ని షరతులతో సినిమా విడుదల చేసుకోవచ్చని చెప్పింది. ఆ షరతులు ఏమిటంటే అమృత, ప్రణయ్, మారుతీరావుల పేర్లను ఎక్కడా వాడకూడదు. దాంతో వర్మ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇది కల్పిత కథ అని చెప్పాల్సి వచ్చింది. నిజానికి ఇలా చెప్పటానికి కూడా అంగీకరించని మనస్తత్వం ఆయనది. చెప్పకపోతే సినిమా విడుదల కష్టం. అందుకే వర్మ రాజీ పడాల్సి వచ్చింది. అసలు అమృత, ప్రణయ్ ల కథతో తాను సినిమా తీయలేదని, ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయని, వాటి ఆధారంగా మాత్రమే ఈ కథను తయారు చేసుకున్నామని, ఇందులో ఉన్నవన్నీ కల్పిత పాత్రలేనని వర్మ చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
మరి గతంలో అమృత ఫొటో పెట్టి ట్వీట్ చేశారు? ఆ ఘటనను ఎందుకు ప్రస్తావించారు? అని అడిగితే తనదైన శైలిలోనే ఆయన సమాధానాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సినిమాల వల్ల అమృత కుటుంబంపై ప్రభావం పడుతుంది కదా అని అడిగినప్పుడు ‘ఇది ఇప్పటికే పబ్లిక్ డొమైన్‌లో వచ్చిన అంశం. మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి. రోజుకి బోలెడన్ని సార్లు వేశారు. ఆ కథ ఆధారంగా నేను సినిమా చేస్తే కొత్తగా జరగేదేముంటుంది? ఇలాంటి సంఘటలను ఎందుకు జరుగుతాయన్న దానిమీదే నేను సినిమా తీశాను’ అని వివరణ ఇచ్చారు.
అది ఆమె కథ కాదు కాబట్టి దీన్ని సినిమాగా చేయడానికి ఎవరి అనుమతీ అవసరం లేదని కూడా ఆయన అన్నారు. అన్ని ప్రేమ కథలూ ఇలానే ఉంటాయి అని చెప్పడమే తన ఉద్ధేశమన్నారు. తను తీసింది అమృత కథే అంటూనే కోర్టు నిర్ణయానికి అనుగుణంగా తన వెర్షన్ ను మార్చుకుని చెప్పారు. మొత్తానికి ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువైన వర్మకు ఈ ‘మర్డర్’ఒక విధంగా చుక్కలు చూపించిందనే అనుకోవాలి.











