జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో కూడా వైఎస్ఆర్ సీపీకి అత్యంత గడ్డు పరిస్థితులు ఎదురు అవుతున్నాయి. గతంలో వైసీపీకి అక్కడ ఉన్న వైభవం పూర్తిగా కనుమరుగు అయిపోతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి కడప జిల్లాల్లో సత్తా చాటడంతో.. జిల్లాలోని కింది స్థాయి నేతలు కూడా పార్టీ మారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ లేదా జనసేన కండువాలు కప్పుకుంటున్నారు. ఎక్కువ మంది టీడీపీలోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఇప్పుడు కూటమి.. కడప జడ్పీ పీఠంపై కన్నేసింది. దీంతో జగన్ రెడ్డి జడ్పీటీసీలతో సమావేశం అవుతూ వారిని కాపాడుకునే పనిలో పడ్డారు. కానీ, వారిని ఎంత బుజ్జగిస్తున్నా వినని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఓ కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా జగన్ తన మేనమామను రంగంలోకి దింపారు. ఈయన స్వయాన తన తల్లి విజయమ్మకు సోదరుడు. ఇదివరకు కడప వ్యవహారాలన్నీ ఎంపీ అవినాష్ రెడ్డి చూసుకునేవారు కాగా.. ఇప్పుడు అధికారం కోల్పోయాక వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఆందోళనతో అవినాష్ రెడ్డి బయటికి రావట్లేదు.
జిల్లాలో పార్టీ కష్టకాలంలో ఉన్న వేళ జగన్ తో సహా అవినాష్ రెడ్డి కూడా పట్టించుకోవడం మానేశారు. అటు జగన్ బెంగళూరు – తాడేపల్లి మధ్య చక్కర్లు కొడుతుంటే.. అవినాష్ రెడ్డి ఇంటికే పరిమితం అయిపోయారు. దీంతో స్థానిక వైసీపీ ప్రజా ప్రతినిథులు గుర్రుగా ఉన్నారు. దీంతో కడప జిల్లా పార్టీ పగ్గాలను తన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి జగన్ అప్పగించారు. ఆయనే ఇక మీకు అందుబాటులో ఉంటారని జగన్ కార్యకర్తలకు చెప్పారు.
అయితే, రవీంద్రనాథ్ రెడ్డి నియామకం వెనక వ్యూహం కూడా ఉందని అంటున్నారు. ఇప్పటికే షర్మిలకు విజయమ్మ సపోర్ట్ చేస్తున్నారు. త్వరలోనే వైఎస్ కుటుంబీకుల్లో చాలామంది షర్మిలకు జై కొడుతారనే ప్రచారం ఉంది. అందుకే తన మేనమామకు కడప జిల్లాలో రంగంలోకి దింపినట్లుగా భావిస్తున్నారు. అటు షర్మిలను ఎదుర్కొనే విషయంతో పాటు, కడపలో వైసీపీ బాధ్యతలను మేనమామ చూసుకుంటాడని జగన్ నమ్ముతున్నారు.










