విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆంధ్రులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. న్యాయం చేయాలని కోరుతూ కూర్మన్నపాలెం జంక్షన్ నుంచి స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ర్యాలీ తీస్తున్నారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు మాట్లాడుతూ… స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ జరిగితే తమ భూములు తమకు తిరిగి ఇవ్వాలని పట్టుబట్టారు.
అన్ని విధాలుగా ఏపీకి అన్యాయం..
32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రయివేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కుకు గనులు కేటాయించకుండా దెబ్బతీస్తోందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్సిటీ, విభజన హామీల అమలులో కేంద్రం పూర్తిగా రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. ప్లాంట్ ప్రయివేటీకరణపై రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Must Read ;- విశాఖ స్టీల్‌లో రాష్ట్రానికి వాటానే లేదట.. వైసీపీ ఆడేదంతా నాటకమేనా