ఉద్యమాలు, బలిదానాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ త్వరలో ప్రైవేటు వ్యక్తల చేతుల్లోని వెళ్లిపోనుంది. నష్టాల బూచి చూపి విశాఖ ఉక్క పరిశ్రమను హోల్ సేల్ గా అమ్మేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. ఏపీలో బీజేపీ అనుకూల వైసీపీ ప్రభుత్వం ఉండటంతో ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ, అనుబంధ పరిశ్రమలకు ఉన్న అత్యంత విలువైన 22 వేల ఎకరాల భూములపై ప్రైవేటు కంపెనీల కన్నుపడిందని తెలుస్తోంది. ఎలాగైనా విశాఖ ఉక్కు పరిశ్రమను దక్కించుకునేందుకు భారీ పారిశ్రామిక దిగ్గజాలు రంగంలోకి దిగాయనే వార్తలు వస్తున్నాయి. కుక్కను చంపే ముందు పిచ్చి కుక్క అని ముద్ర వేసి చంపేసినట్టు, విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాల్లో నడుస్తోందని, సొంత గనులు కూడా లేవనే నెపంతో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది.
నష్టాల బూచి చూపి…
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రారంభం నుంచి అనేక అవాంతరాలను ఎదుర్కొంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం ఉద్యమంగా మారి 30 మంది ప్రాణాలు బలిగొన్నాక ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అంగీకరించారు. ఎట్టకేలకు 1989లో పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభించింది. తరవాత రెండేళ్లకే తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. ఇక విశాఖ ఉక్కు పరిశ్రమను మూసివేయడం తప్ప వేరే గత్యంతరం లేదని ప్రచారం చేశారు. ఆ తరవాత వచ్చిన ఆర్థిక సంస్కరణలు విశాఖ ఉక్కు పరిశ్రమకు కలసి వచ్చాయి. అప్పటి నుంచి అంటే మూడు దశాబ్దాలుగా మేలైన ఉక్కును దేశానికి అందిస్తూ లాభాల బాటలో పయనించింది. గత ఏడాది కరోనా కారణంగా ఉక్కు అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. దీంతో విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.3 వేల కోట్ల నష్టాలు వచ్చాయి. దీన్ని బూచిగా చూపి విశాఖ ఉక్కుపై ఎప్పటి నుంచో కన్నేసిన ప్రైవేటు వ్యక్తులు కేంద్ర స్థాయిలో పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. కేంద్రం కూడా విశాఖ ఉక్కు పరిశ్రమను వదిలించుకోవడం ద్వారా రూ.60 వేల కోట్లు ఖజానాలో వేసుకోవాలని భావిస్తోంది. అంటే పోలవరం జాతీయ ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు ఇచ్చినందుకు ప్రతిఫలంగా విశాఖ ఉక్కును అమ్మి రూ.60 వేల కోట్లు కేంద్రం ఖాతాలో వేసుకోవాలని చూస్తోందని కార్మిక సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.
Also Read: నాలుగు నెలల్లో రాజధాని విశాఖకు తరలింపు: సజ్జల
ఏపీలో ఏకైన అతి భారీ పరిశ్రమ
ఏపీలో కేంద్ర ప్రభుత్వరంగంలో నడుస్తోన్న ఏకైన అతి భారీ పరిశ్రమ విశాఖ ఉక్కు. ప్రత్యక్షంగా 17 వేల మందికి ఉద్యోగాలు, మరో 15 వేల మందికి పరోక్షంగా ఉపాది కల్పిస్తోన్న కల్పవృక్షంలాంటి విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయాలని గత వారం కేంద్ర క్యాబినెట్ భేటీలో నిర్ణయించినట్టు స్పష్టమైన సమాచారం ఉంది. ఎప్పటి నుంచో విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మివేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నా తీవ్ర వ్యతిరేకత వస్తుందేమోనన్న అనుమానంతో వెనకడుగు వేస్తూ వచ్చారు. ఇక ఏపీలో నోరుమెదపని వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి, ఇదే సరైన సమయంగా కేంద్రం భావిస్తోంది. అందుకే ఏటా 6.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయడం ద్వారా రూ.20 వేల కోట్ల అమ్మకాలు సాగిస్తున్న పరిశ్రమను నష్టాల నెపంతో ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టాలనే కుట్రకు తెరలేపారని మేధావులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఉక్కు నష్టాల్లో ఉందని అమ్మాలని చూస్తున్నారు? మరి లాభాల్లో ఉన్న ఎల్ ఐ సీ లో వాటాలు ఎందుకు విక్రయిస్తున్నారని కార్మిక సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. కేవలం విశాఖ ఉక్కు పరిశ్రమ భూముల ధరలకు రెక్కలు రావడం వల్లే ఈ పరిశ్రమపై అనేకమంది కన్నేశారని తెలుస్తోంది.
గనులు లేవట…
విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు లేవు. కేటాయించాల్సింది కేంద్ర ప్రభుత్వమే కదా? విశాఖ ఉక్కును కాపాడుకోవాలనే తలంపు ఉంటే పరిశ్రమకు గనులు కేటాయించలేరా? అంత పెద్ద పరిశ్రమకు గనులు లేకుండా చేసిన పాపం కూడా కేంద్ర ప్రభుత్వానిదే. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కేంద్రంపై ఎంత ఒత్తిడి తెచ్చినా ఎప్పటికప్పుడు గనులు కేటాయించకుండా వాయిదా వేస్తూనే వచ్చారు. తీరా విశాఖ ఉక్కు నష్టాల్లో ఉందని, సొంత గనులు కూడా లేవనే నెపంతో నూరు శాతం ప్రైవేటు పరం చేయాలని కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు కుట్ర పన్నుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ఈ ఏడాది లాభాల్లోకి వస్తుంది…
కరోనా కారణంగా నష్టపోయిన విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మకాలు తాజాగా ఊపందుకున్నాయి. ఒక్క డిసెంబరు మాసంలోనే రూ.2200 కోట్లు ఉక్కు అమ్మకాలు సాగించి విశాఖ ఉక్కు పరిశ్రమ రూ.200 కోట్ల లాభాలు ఆర్జించింది. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఉక్కు ధరలు ఆకాశాన్నంటాయి. టన్ను ఉక్కు రూ.60 వేలు దాటిపోయింది. ఇదే ఒరవడి కొనసాగితే 2021-22 ఆర్థిక సంవత్సరాంతానికి కనీసం రూ.4000 కోట్ల లాభాలు ఆర్జించే అవకావం ఉందని కార్మిక సంఘాల నాయకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ లోగానే విశాఖ ఉక్కును అమ్మివేయాలని కేంద్రం చురుగ్గా పావులు కదుపుతోందని, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేయడాన్ని అడ్డుకుని తీరతామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
టీడీపీ ఎంపి రామ్మోహన్ నాయుడు ఎప్పటికప్పుడు రాష్ట్ర సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూనే ఉంటారు. తాజాగా విశాఖ ఉక్కు అంశంపై తన గళాన్ని వినిపించారు రామ్మోహన్ నాయుడు.
Also Read: మంత్రి vs ఎంపీ.. పలాసలో రగులుతోన్న రాజకీయ రగడ
‘1966 తరవాత దశాబ్దకాలం పాటు “విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు” నినాదంతో తెలుగు ప్రజలు సుదీర్ఘ పోరాటం చేసి, 32 మంది తమ ప్రాణాలు అర్పించి, 64 గ్రామాల ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి, 22,000 ఎకరాల భూమిని తాగ్యం చేసి, సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడుకోడానికి ఎటువంటి పోరాటానికైనా సిధ్ధమే.’
1966 తరవాత దశాబ్దకాలం పాటు "విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు" నినాదంతో తెలుగు ప్రజలు సుదీర్ఘ పోరాటం చేసి, 32 మంది తమ ప్రాణాలు అర్పించి, 64 గ్రామాల ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి, 22,000 ఎకరాల భూమిని తాగ్యం చేసి, సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడుకోడానికి ఎటువంటి పోరాటానికైనా సిధ్ధమే. pic.twitter.com/nbli7iyKxD
— Ram Mohan Naidu K (@RamMNK) February 4, 2021