(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరం వన్ టౌన్ పోలీసు స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ అనిల్ కుమార్‌కు స్థానిక తిరుమల హాస్పిటల్ వద్ద ఓ బ్లాక్ బ్యాగ్ కనిపించింది. అందులో రూ.4.5 లక్షల నగదు ఉంది. దాంతో పాటు ఒక బ్యాంకు పాస్ బుక్, రసీదు ఉంది. ఆ కానిస్టేబుల్ వెంటనే ఇతరత్రా ఆలోచించకుండా ఆ రశీదుపై ఉన్న సెల్ నెంబర్‌కు ఫోన్ చేశారు. ఆ డబ్బులను పోగొట్టుకున్న వ్యక్తి బ్యాగ్‌లో ఉన్న నగదుకు సంబంధించిన డినామినేషన్ కచ్చితంగా చెప్పారు. దాంతో ఆ డబ్బులు ఉన్న బ్యాగ్ అతనిదేనని నిర్ధారించుకున్నారు ఆ కానిస్టేబుల్. వెంటనే వన్ టౌన్ సీఐ మురళికి సమాచారం అందించారు. ఆయన వెంటనే డీఎస్పీ అనిల్ కుమార్‌కు విషయం చెప్పారు. డీఎస్పీ ఆ సంఘటనపై మరింత విచారణ చేపట్టి డబ్బులు పోగొట్టుకున్నది విజయనగరానికి చెందిన ఒక వ్యాపారిగా గుర్తించారు. ఆయనను తన కార్యాలయానికి పిలిపించి, మీడియా సమక్షంలో కానిస్టేబుల్ అనిల్ కుమార్ చేతుల మీదుగా ఆ డబ్బులు అందించారు. కానిస్టేబుల్ అనిల్ కుమార్ సత్ప్రవర్తన, నిజాయితీని డీఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. పోయిన నగదు తన చేతికి అందివ్వడంతో ఆ వ్యాపారి పోలీసుల సేవా నిరతిని, నిజాయితీని కొనియాడారు.
గతంలోనూ..
ఈ సంఘటనతో రాష్ట్రంలో మరోసారి విజయనగరం జిల్లా పోలీసులు కీర్తి పొందారు. జిల్లా ఎస్పీ బి. రాజకుమారి స్ఫూర్తితో కరోనా కాలంలో పోలీసులు తమ కుటుంబాలనే కాదని సేవానిరతిని చాటుకున్నారు. అందువల్ల జాతీయ స్థాయిలో మూడు అవార్డులు సొంతం చేసుకున్నారు. కొద్ది నెలల క్రితం కరోనా సోకిన ఓ ఎనభైఏళ్ల వృధ్ధురాలికి లేడీ కానిస్టేబుల్ చేసిన సేవ, అందరూ దూరంగా ఉంటూ ఒంటరైన బొబ్బిలికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌కు ధైర్యం చెప్పిన సీఐ, ఇటీవల పాడైపోయిన రోడ్డును తన సొంత డబ్బులు ఖర్చుపెట్టి మరమ్మతులు చేసిన కొత్తవలస కానిస్టేబుల్, తాజాగా వన్ టౌన్ కానిస్టేబుల్ అనిల్ కుమార్ చూపిన సేవానిరతిని జిల్లా ప్రజలు వేనోళ్ళతో కొనియాడుతున్నారు. సెల్యూట్ విజయనగరం పోలీస్ అంటూ అభినందిస్తున్నారు.
Must Read ;- అశోక్ ప్రాభవానికి గండికొట్టేలా.. ఏదో జరుగుతోందక్కడ!











