జగనన్న తోడు పథకానికి రుణాలు ఇవ్వడం లేదంటూ విజయవాడ, ఉయ్యూరు, మచిలీపట్నంలో ప్రభుత్వ బ్యాంకుల ముందు చెత్త డంప్ చేసిన వ్యవహారం తెలిసిందే. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చెత్త వ్యవహారంలో ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ ఎన్. ప్రకాశరావును బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేశారు.
బ్యాంకుల ముందు పారిశుద్ధ్య కార్మికులు చెత్తవేయడం వెనుక ఎవరున్నారనే దానిపై విచారణ జరిపిన గుంటూరు మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీంతో ప్రభుత్వ బ్యాంకుల ముందు చెత్తవేసిన వ్యవహారంలో ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ ఎన్ ప్రకాశరావును సస్పెండ్ చేశారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోతే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా బ్యాంకుల ముందు చెత్త వేయించినందుకు ప్రకాశరావుపై చర్యలు తీసుకున్నారు.
నన్ను బలిచేశారు
ఉయ్యూరులో బ్యాంకుల ముందు చెత్త వేసిన వ్యవహారంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని నగర పంచాయతీ కమిషనర్ ప్రకాశరావు మీడియాకు వెల్లడించారు. ఈ వ్యవహారంలో తనను బలిచేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల ముందు చెత్త వేయాలని తాను పారిశుద్ధ్య కార్మికులకు చెప్పలేదని ప్రకాశరావు తెలిపారు. అయినా ఈ వ్యవహారంలో తనను బలిచేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తిమింగలాలను వదిలేసి….
ఉయ్యూరులో రెండు బ్యాంకుల ముందు చెత్త వేస్తే కమిషనర్ ను సస్పెండ్ చేశారు. విజయవాడలో 16 ప్రభుత్వ బ్యాంకుల ముందు చెత్త గుమ్మిరించిన విషయంలో విజయవాడ నగర కమిషనర్ కు కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులిపేసుకునేలా ఉన్నారు. ఈ వ్యవహారంలో పెద్దలను వదిలేసి, చిన్నవారిని బలిచేసే ప్రమాదం ఉందని లియో న్యూస్ ప్రచురించినట్టే జరిగింది. ఇక మచిలీపట్నంలో కూడా బ్యాంకుల ముందు చెత్త వేశారు. మరి అక్కడి అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ వ్యవహారంలో ఎవరినో ఒకరిని బలిచేయాలి కాబట్టి ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ పై తప్పును నెట్టి అతన్ని సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో పెద్దలు తప్పించుకుని చిన్నవారిని బలిచేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. అసలు ఘటన తీవ్రత విజయవాడలో ఎక్కువగా ఉంటే ఉయ్యూరు కమిషనర్ పై చర్యలు తీసుకోవడం విడ్డూరంగా ఉందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.
Must Read ;- చెత్త పని పై సీఎంకు బ్యాంకర్ల ఘాటు లేఖ