దేశ సమస్యలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రధాని అనేక విషయాల గురించి మాట్లాడుతారు. త్వరలో నిర్వహించబోయే ‘మన్ కీ బాత్’ కు తెలంగాణ నుంచి ఓ చాయ్ వాలా పాల్గొననున్నాడు. వరంగల్‌కు చెందిన చాయ్‌వాలా మహ్మద్ పాషాకు కు ఆహ్వానం అందింది. ఈ మేరకు పీఎంఓ నుంచి లేఖ కూడా అందింది. వచ్చే నెల మొదటి వారంలో సిద్ధంగా ఉండాలని తెలిపింది.
40 ఏళ్లుగా..
మహ్మద్ పాషాది సామాన్యమైన కుటుంబం. చాయ్ అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి దగ్గర 40 ఏళ్లుగా టీ వ్యాపారం చేస్తున్నాడు. పీఎం ఆత్మనిర్భర్ పథకం కింద గతేడాది 10 వేల లోన్ తీసుకున్నాడు. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించి మొదటి స్థానంలో నిలిచాడు. ఈ నేపథ్యంలో ఆత్మనిర్భర్ ద్వారా రుణం తీసుకున్న అతికొద్దిమందిని ‘మన్ కీ బాత్’ ఎంపిక చేయగా.. ఓరుగల్లుకు చెందిన పాషా ఈ అవకాశం అందుకున్నాడు. ఈ విషయమై పాషా స్పందిస్తూ.. ‘మన్ కీ బాత్’ ఆహ్వానం అందడం.. ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
Must Read ;- చాయ్ వాలాను ఢీకొట్టే నాయకుడి అన్వేషణ.. మోదీ అంటేనే మండిపడుతున్న పీకే