‘కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి’ ఈ మాటలు ఏపీలోని విశాఖ కు చెందిన ఈ కుర్రోడికి అతికినట్టుగా సరిపోతాయి. లక్ష్యం కోసం ఓ కల కన్నాడు. దానిని సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమించాడు. తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని గుర్తించి.. వారే గర్వేపడేలా సక్సెస్ అందుకున్నాడు. వైమానిక దళం (ఐఏఎఫ్)లో ఉన్నత ఉద్యోగం సాధించిన ఈ డ్రైవర్ కొడుకు కథ తెలుసుకుంటే.. ఎవరైనా సలాం కొట్టాల్సిందే..
నిరుపేద కుటుంబం..
ఆంధ్రప్రదేశ్.. విశాఖ పట్టణానికి చెందిన గోపీనాథ్ ది నిరుపేద కుటుంబం. త్రండి సూరిబాబు ఆటో డ్రైవర్. ఆటో ముందుకు నడిస్తేనే.. కుటుంబం గడుస్తుంది. లేదంటే ఇక పస్తులే. తాను పడ్డ కష్టం కుమారుడు కూడా పడొద్దని భావించాడు. రెక్కలుముక్కలు చేసుకొని ఆటో డ్రైవింగ్ చేశాడు. గోపీ చిన్నప్పట్నుంచే ఎయిర్‌ఫోర్స్‌లోకి వెళ్లాలనుకున్నాడు. కొడుకు ఇష్టాన్ని తెలుసుకున్నసూరిబాబు మరింత ప్రోత్సహించాడు. ఈక్రమంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడ్డాడు. కుమారుడి లక్ష్యం కోసం ఇంజినీరింగ్ చదివించేందుకు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవడానికి వెనుకాడలేదు. మొదట డిగ్రీ చేసినప్పటికీ.. ఎయిర్ ఫోర్స్ చేయాలనే కోరికను మాత్రం విడిచి పెట్టలేదు. ఐఏఎఫ్‌లో చేరిన తర్వాత ఆంధ్రా యూనివర్సిటీ ద్వారా డిస్టెన్స్ లో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ను కంప్లీట్ చేశారు.
ఒకే ఒక్కడు…
గతేడాది క్రిప్టోగ్రాఫర్ గా ప్రమోషన్ పొందాడు. ఆ తర్వాత జరిగిన స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పరీక్షల్లో గోపీనాథ్ అర్హత సాధించి, ఐఏఎఫ్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఈ ఏడాది ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయింగ్ ఆఫీసర్‌గా తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఒకే ఒక్కడు గోపీనాథ్. హైదరాబాలోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో జరిగిన గ్రాడుయేషన్ కార్యక్రమంలో గోపీనాథ్ బాధ్యతలు తీసుకున్నాడు.
ఆనందం ఆకాశమంతా..
తమ కుమారుడు ఉన్నత ఉద్యోగం సాధించడంతో ఆటో డ్రైవర్ సూరిబాబుకు ఆనందానికి హద్దే లేకుండాపోయింది. తన కొడుకు ఫ్లయింగ్ ఆఫీసర్ అయ్యాడని కుటుంబ సభ్యులు, చుట్టుపక్కలవాళ్లకు చెబుతూ పరవశించి పోతున్నాడు. పిల్లల ఇష్టాన్ని గమనించి, వెన్ను తట్టి ప్రోత్సహిస్తే ఏరంగంలో రాణించవచ్చు అనడానికి ఇప్పుడు గోపీనాథ్ ఓ ఉదాహరణ.
Must Read ;- కీర్తి శిఖరాల్లో తెలుగు తేజం.. మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా సత్య నాదెళ్ల