( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
అనేక పండుగలకు, ముఖ్య దినాలకు వచ్చిన సందేహమే ఈసారి కార్తీక పౌర్ణమి విషయంలోనూ తలెత్తింది. కార్తీక పౌర్ణమి తిధి 29వ తేదీ మధ్యాహ్నం 12.48 నిమిషాల నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉన్నందున భక్తులు కొంత సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏ రోజున కార్తీక పౌర్ణమి జరుపుకోవాలనేది సందేహం..దీనిని మిగులు.. తగులు అని అంటారు
సహజంగా చంద్రునికి సంబంధించిన పండుగల్లో వేద నిర్ణయం ప్రకారం రాత్రులకు ప్రాధాన్యత ఉంటుంది. అంటే దీపావళిని ఖచ్చితంగా ఆరోజు రాత్రి సమయంలో అమావాస్య తిధి కలిగి ఉన్న రోజున మాత్రమే జరుపుకొని తీరాలి. అదే విధంగా పౌర్ణమి కూడా. రాత్రి పూట స్థిరంగా ఉండే తిధిని ప్రామాణికంగా తీసుకోవడం ఉత్తమం.ఇక్కడ ప్రత్యేకించి గమనించవలసిన విషయం ఏమిటంటే… ఇతర పండుగలు జరుపుకుంటున్నట్లు, సూర్యోదయంలో ఉన్న తిధికి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాన్ని మనం మరచిపోవాలి.
మరో ముఖ్య విషయం ఏమిటంటే. కృత్తిక నక్షత్రం పౌర్ణమి తిధిలో కలిగి ఉన్న మాసాన్ని కార్తీక మాసం అంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నక్షత్ర గమనం ప్రకారం కూడా… ఆదివారం రాత్రి పౌర్ణమి తిధితో కృత్తిక నక్షత్రం కలిసి ఉంటుంది. ఆ విధంగా పౌర్ణమి తిధితో, కృత్తిక నక్షత్రం, సోమవారం ఉదయం 6:03 గంటల వరకు మాత్రమే జత కూడి ఉంటుంది. కనుక కార్తీక పౌర్ణమి ఖచ్చితంగా 29వ తేదీన. ఆదివారం మాత్రమే జరుపుకోవడం అన్ని విధాలా మేలని పండితులు సూచిస్తున్నారు.
మరుసటి రోజు అంటే సోమవారం రాత్రికి జరుపుకుంటే రెండవ చంద్రుడు అవుతాడు. కృష్ణపక్షం వచ్చేస్తుంది. కొంతమేర, సౌలభ్యత కోసం చెప్పుకోవాలంటే.. ఉపవాస నియమం ఉన్న, ఉండాలనుకునే వారు మాత్రం 29వ తేదీ ఉపవాస నియమాలు పాటించి… రాత్రిపూట ఒత్తులు వెలిగించుకొని, చంద్రదర్శనం చేసుకుని భోజనం చేయవచ్చు.
ఉపవాసం చేయలేని వారు..
దీపాలు మాత్రమే వెలిగించాలనుకునేవారు 29వ తేదీ రాత్రి లేదా 30వ తేదీ ఉదయం ఆరు గంటల లోపు అంటే సూర్యోదయం కాకముందే ఒత్తులు వెలిగించు కోవచ్చు. 30వ తేదీ సోమవారం కూడాను….మరో లెక్క ప్రకారం కార్తీక మాసం 15వ రోజు కూడా అవుతుంది… కాబట్టి వత్తులు వెలిగించాలి అనుకునేవారికి మాత్రం 30వ తేదీ మధ్యాహ్నం లోపు నిరాహారంగా ఉండి…ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయవచ్చు . అదేవిధంగా నోములు, తోరాలు ఉన్నవారు కూడా 30వ తేదీ సోమవారం మధ్యాహ్నం లోపు ఆ కార్యక్రమాన్ని చేపట్టవచ్చు… పౌర్ణమి తిధి ఉంటుంది కాబట్టి…29వ తేదీ ఆదివారం సాయంత్రం కూడా నోములు, వ్రతాలు చేసుకోవచ్చు.. ఎలాంటి ఆక్షేపణ లేదు.
Also Read: అప్పన్న సేవ అంటే అధికారుల్లో భయమెందుకు?











