Who Are The 17 Members Of AP Minister Balineni Srinivasareddy’s Team :
ఏపీ గనుల శాఖ మంత్రి, సీఎం జగన్ కు వరసకు మామ అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రైవేట్ జెట్ లో విహారం, రష్యా టూర్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజిలో ట్రోలింగ్ జరుగుతోంది. వ్యక్తిగత పర్యటన అంటే.. ఇటు రాజకీయ నేతలైనా, అటు సెలబ్రిటీలైనా తమ పర్యటన వివరాలేమి బయటకు రాకుండా జాగ్రత్త పడుతుంటారు. అయితే ప్రైవేట్ జెట్ లో దిలాసాగా కూర్చున్న బాలినేని.. ఆ ఫొటోనే తనే స్వయంగా సోషల్ మీడియాలో పెట్టేసి.. తనపై ట్రోలింగ్ కు తానే కారణంగా నిలిచిన వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఏదో చిన్న పిల్లాడి మాదిరిగా బాలినేని పోస్ట్ చేసిన ఈ ఫొటో బాలినేనితో పాటు జగన్ కేబినెట్ లోని మంత్రులు, స్వయంగా జగన్, వైసీపీకి చెందిన కీలక నేతల విలాసవంతమైన పర్యటనలను బయటపెట్టేసిందనే చెప్పాలి.
అనగాని పేరుతో డిఫెండింగ్
బర్త్ డే ఎవరిదో తెలియదు గానీ.. బాలినేని ఏకంగా ఓ ప్రైవేట్ జెట్ ను అద్దెకు తీసుకుని మరీ రష్యా చెక్కేశారు. తనతో పాటు తన మిత్రులు అనుకున్న వారిని కూడా ఆయన వెంటబెట్టుకుని మరీ వెళ్లారు. అక్కడికి వెళ్లేలోగానే.. దిలాసాగా కూర్చున్న తన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బాలినేని.. తన ప్రైవేట్ టూర్ ను కాస్తా పబ్లిక్ చేశారు. ఓ మంత్రి అయి ఉండి.. ఇలా ప్రైవేట్ జెట్లలో విలాసంగా ప్రయాణిస్తారా? అంటూ ఆయనపై ఓ రేంజిలో ట్రోలింగ్ మొదలు కాగా.. టీడీపీ కూడా బాలినేనిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే సోషల్ మీడియా ట్రోలింగ్ పై అంతగా స్పందించని బాలినేని.. టీడీపీ విమర్శలపై మాత్రం చాలా వేగంగా స్పందించారు. నా సొంత ఖర్చులతో ప్రైవేట్ జెట్ లో రష్యాకు వచ్చాను. అందులో తప్పేముంది? నా వెంట మీ పార్టీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. మరి ఆయనను ఏమీ అనరా? అంటూ ఎదురు దాడికి దిగారు. బాలినేని వాదనలో పసలేని వైనం కూడా ట్రోలింగ్ కు గురవుతోంది.
బాలినేని గుట్టును అనగాని రట్టు చేశారు
బాలినేనితో పాటు రష్యా టూర్ కు గుంటూరు జిల్లా రేపల్లె నుంచి మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించిన అనగాని సత్యప్రసాద్ కూడా వెళ్లారు. బాలినేని, అనగాని మధ్య ఏ తరహా సంబంధాలున్నాయనేది పక్కనపెడితే.. బాలినేని రష్యాకు వెళ్లిన వైనాన్ని మాత్రం అనగాని బయటపెట్టేశారు. ఓ బర్త్ డే పార్టీకి తామంతా రష్యా వచ్చామని, మొత్తం 19 మందితో కూడిన బృందం ప్రైవేట్ జెట్ లో రష్యా చేరుకుందని అనగాని చెప్పారు. అంతేకాకుండా వ్యక్తిగత పర్యటనల మీద రాజకీయ దుమారం ఎందుకని కూడా అనగాని ప్రశ్నించారు. అయితే తాను, బాలినేని మినహా మిగిలిన వారి గురించి అనగాని ప్రస్తవించలేదు. అనగాని వైఖరికి విరుద్ధంగా వ్యవహరించిన బాలినేని మాత్రం.. టీడీపీ విమర్శలను తిప్పికొట్టేందుకు అనగాని పేరును వాడుకున్నారు. సరే.. మీ వైఖరి అదే అయితే.. మీ వెంట రష్యా చేరుకున్న మిగతా 17 మంది పేర్లు చెప్పండంటూ ఇప్పుడు బాలినేనిపై మరో కొత్త తరహా ట్రోలింగహ్ మొదలైపోయింది.
Must Read ;- జగన్ ను నమ్మి అమూల్ నిండా మునిగిందే!











