Another Controversy On AP Labor Minister Gummanur Jayaram :
గుమ్మనూరు జయరాం.. జగన్ కేబినెట్ లో వరుస వివాదాలను ఎదుర్కొంటున్న మంత్రిగా నిత్యం వార్తల్లోనే ఉంటున్నారు. మొన్నటికి మొన్న ఓ కాంట్రాక్టరు నుంచి ఖరీదైన కారును బహుమతిగా స్వీకరించారంటూ ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన.. ఆ వెంటనే తన సొంత నియోజకవర్గంలో తన సోదరుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పేకాటతో మరింత వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్టలను పట్టుకు ఎస్సైకి ఫోన్ చేసి వాటిని విడిచిపెట్టాలంటూ హుకుం జారీ చేసి తాజాగా మరింత చిక్కుల్లో పడ్డారు. వరుస వివాదాల నేపథ్యంలో.. అప్పటిదాకా మిస్టర్ క్లీన్ గానే సాగిన జయరాం.. ఇప్పుడు అవినీతి మరకలను అంటించుకుంటూ జగన్ సర్కారును ఎప్పటికప్పుడు ఇబ్బందుల్లోకి నెడుతున్న నేతగా మారిపోయారు. తొలి రెండు వివాదాల్లో ఎలాగోలా బయటపడ్డా.. ఈ వివాదం నుంచి ఆయన ఎలా బయటపడతారోనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
చూసీ చూడనట్టు వదిలేయాలట
కర్నూలు జిల్లా ఆస్పరి ఎస్సైని హెచ్చరిస్తూ మంత్రి గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యల ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్పరి మండల పరిధిలోని యాటకల్లుకు చెందిన దాదాపు 40 ట్రాక్టర్ల యజమానులు, కార్యకర్తలు ఆలూరులో ఇటీవల మంత్రిని కలిశారు. పోలీసులు తమ ట్రాక్టర్లను పట్టుకున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి జయరాం నేరుగా ఆస్పరి ఎస్సైకి ఫోన్ చేసి, స్పీకర్ ఆన్ చేసి, వారి ముందే మాట్లాడారు. నాలుగు ఖాళీ ట్రాక్టర్లను పట్టుకున్నట్టు తెలిసిందని, వెంటనే వదిలేయాలని ఎస్సైతో మంత్రి అన్నారు. వదలకుంటే తాను మంత్రినన్న విషయాన్ని కూడా మర్చిపోయి ధర్నాకు కూర్చుంటానని హెచ్చరించారు. తనకు జనమే కావాలని, తాను ఇక్కడ ఇంకోసారి పోటీ చేయాలని పేర్కొన్న మంత్రి.. ట్రాక్టర్లను వదిలిపెడతారో, ధర్నాకు కూర్చునేలా చేస్తారో తేల్చుకోవాలని హెచ్చరించడం ఆ ఆడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. అంతేకాదు, ఆదోని ట్రాక్టర్లు విచ్చలవిడిగా ఇసుక తోలుకుంటున్నాయని, ఆస్పరి వాళ్లను మాత్రం ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఇసుక ఉంటే విలేకరులెవ్వరూ చూడకపోతే వదిలిపెట్టి ఏదో యవ్వారం చేసుకోవాలని ఎస్సైకి సూచించారు. అక్కడితో ఆగక మన తాలూకాలో ఎక్కడా బతకలేని పరిస్థితి అంటూ ఫోన్ పెట్టేశారు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఎస్సైని దాదాపుగా బెదిరిస్తున్నట్టుగా మాట్లాడిన మంత్రి మాటలన్నీ చాలా స్పష్టంగానే వినిపిస్తున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతానుభవాల నేపథ్యంలో ఈ ఆడియోపై మంత్రి వేగంగానే స్పందించారు. తాను బీసీ వర్గానికి చెందిన వాడిని కావడంతో తనపై కావాలనే రెండు మీడియా చానళ్లు అసత్య ప్రసారాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఖాళీ ట్రాక్టర్లను స్టేషన్ కు తీసుకెళ్లారని గ్రామస్థులు చెప్పడంతో.. తాను ఎస్సైతో మాట్లాడానని మంత్రి చెప్పారు. ఖాళీ ట్రాక్టర్ల విషయంపై మాట్లాడితే ఓకే గానీ.. ట్రాక్టర్లలో ఇసుక ఉన్న మీడియా చూడకుంటే.. చూసీ చూడనట్టు వదిలేయడంతో పాటు మీ యవ్వారమేదో చూసుకోవాలి కదా అంటూ జయరాం మాట్లాడిన మాటలే ఇప్పుడు జయరాంను వివాదంలోకి నెట్టేశాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- అవార్డులు ఓకేనండీ.. మహిళలకు భద్రతేది?











