టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, యువ సమ్రాట్ నాగచైతన్యల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం బంగార్రాజు. ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తే.. నాగచైతన్య సరసన ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి నటించింది. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన బంగార్రాజు చిత్రం పై అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. సంక్రాంతికి బంగార్రాజు వస్తుందా..? వాయిదా పడుతుందా..? అనే సస్పెన్స్ కి తెరదించారు. జనవరి 14న బంగార్రాజు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.
అయితే.. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం నాగార్జునను 50 కోట్ల క్లబ్ లో చేర్చింది. సీనియర్ హీరోల్లో ముందుగా 50 కోట్ల క్లబ్ లో చేరిన హీరోగా నాగార్జునకు రికార్డ్ అందించింది. ఇప్పుడు తనయుడు యువసామ్రాట్ నాగచైతన్యతో కలిసి నాగార్జున నటించిన బంగార్రాజు సినిమా పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అందులోనూ చైతు మజిలీ, వెంకీమామ, లవ్ స్టోరీ.. ఇలా వరుసగా విజయాలు సాధించి హ్యాట్రిక్ హిట్స్ తో మంచి ఫార్మ్ లో ఉన్నారు. తండ్రీకొడుకులు కలిసి నటించిన మల్టీస్టారర్ కావడంతో ఈ సినిమాకు 40 కోట్లకు పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
బంగార్రాజు షూటింగ్ ప్రారంభం అప్పుడే సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటించారు. అయితే.. ఫెస్టివల్ రేసులో ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ చిత్రాలు పోటీలో ఉన్నప్పుడు బంగార్రాజును విడుదల చేయాలని అనుకోవడం సరైన నిర్ణయం కాదని అందరూ భావించారు కానీ.. కరోనా, ఒమిక్రాన్ రూపంలో అదృష్టం కలిసి రావడంతో మిగతా మూడు సినిమాలు వాయిదా పడి బంగార్రాజు ఒక్కడే బరిలో నిలిచాడు.
బంగార్రాజు చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చినా సంక్రాంతి కాబట్టి హౌస్ ఫుల్స్ అవడం గ్యారంటీ. ఒకవేళ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం తండ్రీకొడుకులు కలిసి 100 కోట్ల భారీ గ్రాస్ వసూలు చేసే ఛాన్స్ ఉంది. మరి.. బంగార్రాజు 100 కోట్ల క్లబ్ లో చేరతాడో లేదో చూడాలి. మరి కరోనా పరిస్థితులు ఈ సినిమాకు ఎంతవరకు అనుకూలిస్తాయో చూడాలి. ఓ పక్క కేసులు పెరుగుతున్నట్లు తెగ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనం థియేటర్లకు రాకపోతే అంచనాలు తిరగబడే ప్రమాదం కూడా పొంచి ఉంది.











