దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోదరి తెలంగాణ రాజకీయాల్లో తనదైన దూకుడు ప్రదర్శిస్తున్నారు. సోదరుడి పేరును ఉచ్ఛరించేందుకే ససేమిరా అంటున్న షర్మిల… రాజశేఖరరెడ్డి తనయగానే తెలంగాణలో రాజకీయం చేయాలని తీర్మానించుకున్నట్లుగా ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. ఇక్కడి దాకా అయితే ఓకే గానీ.. ఏకంగా రెండేళ్లలోనే తెలంగాణలో తమ పార్టీ అదికారంలోకి వస్తుందని స్వయంగా షర్మిల చేసిన ప్రకటన నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. త్వరలో తెలంగాణకు సీఎంగా తాను పదవీ బాధ్యతలు చేపడతానన్న మాట ఆమె నోట నుంచి రాలేదు గానీ… రెండేళ్లలోనే అధికారంలోకి వస్తామని చెప్పడం ద్వారా… తన మనసులోని మాటను ఆమె బయటపెట్టారనే చెప్పక తప్పదు. మాట అయితే అనేశారు గానీ… ఈ మాటకు దారి తీసే పరిస్థితులు ఇప్పుడు తెలంగాణలో ఉన్నాయా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా నిలుస్తోంది. అసలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకే ఇంకా మూడేళ్ల సమయం ఉంది. మరి ఎన్నికలు లేకుండా రెండేళ్లలోనే షర్మిల పార్టీ తెలంగాణలో ఏ రీతిన అధికారంలోకి వస్తుందన్నది ఆసక్తికర అంశంగా మారింది.
టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగడం సాధ్యమేనా?
ప్రస్తుతం తెలంగాణలో అయితే కొంతమేర రాజకీయ శూన్యత ఉందన్నది కాదనలేని సత్యమే. అయితే ఆ గ్యాప్‌ను పూరించడం, అధికార పార్టీ టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా షర్మిల పార్టీ ఎదగడం సాధ్యమేనా? అన్న ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కాగానే… ఏళ్ల నాటి తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన పార్టీగా టీఆర్ఎస్‌కు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన పార్టీగా కాంగ్రెస్‌కు మంచి పేరున్నా… దానిని వినియోగించుకుని లబ్ధి పొందడంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ బోల్తా కొట్టింది. ఇక కొత్త రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో సత్తా చాటిన టీడీపీని చూసి టీఆర్ఎస్ అధినేత, ఆ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి తీవ్ర భయాందోళనలకు గురయ్యారనే చెప్పాలి. తనలోని ఆ భయాన్ని తొలగించుకొనేందుకు ఆయన తెలంగాణలో టీడీపీని లేకుండా చేయడమొక్కటే మార్గమని భావించారు. ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించిన కేసీఆర్… ఆపరేషన్ ఆకర్ష్ పేరిట టీడీపీ టికెట్లపై గెలిచిన ఎమ్మెల్యేలందరినీ తన పార్టీలో చేర్చుకుని… అసెంబ్లీలో టీడీఎల్పీ అన్న పదమే వినిపించకుండా చేశారు. ఇక కాంగ్రెస్ పరిస్థితి కూడా అదే మారిదిగా ఉంది. ఇప్పుడిప్పుడే బలపడుతున్నట్లుగా కనిపిస్తున్న బీజేపీ.. రేపు ఏ మేర ప్రభావం చూపుతుందన్నది తెలియడం లేదు. దీంతో తెలంగాణలో ఇప్పుడు టీఆర్ఎస్ మినహా మరే పార్టీ పేరు పెద్దగా వినిపించడం లేదు.
Must Read ;- కేసీఆర్ మెడలు వంచైనా ఉద్యోగాలు భర్తీ చేయిస్తా : దీక్ష విరమణలో షర్మిల ఫైర్

పరిణతి లేకుండా చేసిన ప్రకటనగానే..
ఇలాంటి సమయంలో కొత్త పార్టీ పెడుతున్నట్లుగా ప్రకటించిన షర్మిల.. పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటించకుండానే… తెలంగాణలో తదుపరి అధికారం తమ పార్టీదేనని సంచలన ప్రకటన చేయడం నిజంగానే ఆశ్చర్యం కలిగించే అంశమే. అసలు తన పార్టీ వెనుక నడిచేది ఎవరు? ఎవరెవరు తన పార్టీలో చేరుతున్నారు? అసలు తన పార్టీ లక్ష్యం ఏమిటి? అన్న విషయాలేమీ చెప్పకుండానే… రాబోయే రెండేళ్లలోనే తాను తెలంగాణకు సీఎం అవుతానన్న రీతిలో రెండేళ్లలోనే తెలంగాణలో అధికారం తన పార్టీదేనని ఆమె ప్రకటించడం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. తెలంగాణను కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేసే విషయంలో వైఎస్ ఫ్యామిలీ ఆది నుంచి వ్యతిరేకంగానే వ్యవహరించింది. ఇందుకు వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటుగా, వైఎస్ జగన్ వ్యవహరించిన తీరే నిదర్శనం. ఈ మచ్చను తొలగించుకునే పనిని ఇప్పుడిప్పుడే మొదలెట్టిన షర్మిల… ఆ పని పూర్తి కాకుండానే రెండేళ్లలోనే అధికారంలోకి వస్తానని చేసిన ప్రకటన పరిణతి లేకుండా చేసిన ప్రకటనగానే విశ్లేషకులు చెబుతున్నారు.
ఆమె వెంట నడిచే నాయకులెవరో..?
ఇదిలా ఉంటే… అసలు షర్మిల వెంట నడిచే తెలంగాణ రాజకీయ నాయకులెవ్వరన్న విషయం ఇప్పటిదాకా తేలలేదు. వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయులుగా ముద్ర పడిన కొండా సురేఖ దంపతులు… షర్మిల పార్టీ వైపు చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. అంతేకాకుండా… తన పార్టీలో చేరాలంటూ స్వయంగా షర్మిల చేసిన విన్నపంపై కొండా దంపతులు ఘాటుగా రిప్లై ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మీ కుటుంబాన్ని నమ్ముకుని సర్వం నాశనం అయిపోయాము. ఇక మీ కుటుంబం వెంట నడిచే ప్రసక్తే లేదన్నట్లుగా కొండా దంపతులు షర్మిలకు ఘాటు సమాధానమే ఇచ్చినట్టుగా సమాచారం. వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయులుగా ఉన్న కొండా దంపతుల నుంచే ఇలాంటి సమాధానం వస్తే… ఇక మిగిలిన వారి మాటేమిటన్న విషయం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో షర్మిల వెంట నడిచేందుకు ఓ మోస్తరు గుర్తింపు ఉన్న ఏ ఒక్క నేత కూడా అంతగా సిద్ధపడటం లేదన్న మాట గట్టిగానే వినిపిస్తోంది. ఇక తన సొంత సామాజిక వర్గం రెడ్ల నుంచి కూడా షర్మిలకు పెద్దగా సపోర్ట్ లభించడం లేదన్న మాట కూడా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థతుల్లో రెండేళ్లలోనే తెలంగాణలో అధికారంలోకి వస్తానని షర్మిల చేసిన ప్రకటన… పరిణతి లేకుండా… ఏదో అదాటుగా చేసిన ప్రకనటగానే భావించక తప్పదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Must Read ;- సాక్షి కెమెరామెన్‌ను వెళ్లిపోమన్న షర్మిల.. వారించిన విజయమ్మ










