కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ జరుగుతోంది. కేంద్రం పంపిణీ చేస్తున్న వ్యాక్సిన్ డోసులను ఆయా రాష్ట్రాలు తమ ప్రజలకు వేస్తున్నాయి. ఇందులో కొన్ని రాష్ట్రాలు తామే అందరికంటే ఎక్కువ మందికి వ్యాక్సిన్లు వేశామని చెబుతుంటే.. కాదు ఈ విషయంలో తమ తర్వాతే ఎవరైనా అంటూ మరికొన్ని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. ముందు అయినా, వెనుక అయినా.. తమ ప్రజలకు వ్యాక్సిన్ అందించడంలో అన్ని రాష్ట్రాలు తమదైన శైలిలో దూసుకుపోతున్నాయి. ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. ట్విట్టర్ వేదికగా కనిపించిన ఓ రెండు ట్వీట్లు ఇప్పుడు పెద్ద రచ్చకు తెర తీశాయి. అసలు ఆ రెండు ట్వీట్లు రెండు రాష్ట్రాలకు చెందినవిగా ఆ ట్వీట్లను సంధించిన నేతలు చెబుతుంటే.. ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం అని తేల్చుకోలేక జనం బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఆ కథేంటో మనమూ చూద్దాం పదండి.
22న సాయిరెడ్డి ట్వీట్..
ఏపీలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సినేషన్ ఉద్యమంలా సాగుతోందన్న విషయాన్ని చెప్పాలనుకున్న వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి.. ఓ మూడు ఫొటోలతో ఓ థంబ్ నెయిల్ చేయించి వదిలారు. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు సాయిరెడ్డి వదిలిన ఈ ట్వీట్ లో ఓ ఫొటో విశాఖ జిల్లాకు చెందినదైతే, రెండో ఫొటో విజయనగరం జిల్లాకు చెందినదిగా, మూడో ఫొటో ప్రకాశం జిల్లాకు చెందినదిగా ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్ ఆదేశాల వాగులు వంకలు దాటుతూ పొలాల్లో, ఇతరత్రా వ్యాపకాల్లో నిమగ్నమైన వారి వద్దకే వెళుతున్న ఆరోగ్య శాఖ సిబ్బంది అక్కడే వ్యాక్సిన్లు వేస్తున్నారని తన ట్వీట్ లో సాయిరెడ్డి చెప్పారు.
24న కేటీఆర్ ట్వీట్..
తాజాగా శుక్రవారం(24వ తేదీన ఉదయం 9 గంటలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,, తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఇదే రీతిలో ఓ ట్వీట్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆరోగ్య శాఖ సిబ్బంది అంకిత భావంతో కరోనా వ్యాక్సినేషన్ లో పాలుపంచుకుంటోందని, అదే సమయంలో తెలంగాణలో సాగు సరికొత్త పుంతలు తొక్కుతోందని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. మాటల వరకు ఓకే గానీ.. సాయిరెడ్డి ట్వీట్ లో విజయనగరం జిల్లాకు చెందిన ఫొటోగా ప్రస్తావించిన ఫొటో.. కేటీఆర్ ట్వీట్ లో కనిపించింది. ఈ ఫొటో తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీసిన ఫొటోగా కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఫొటోను చూసిన వెంటనే.. సాయిరెడ్డి ట్వీట్ ను గుర్తుకు తెచ్చుకున్న నెటిజన్లు.. రెండు ట్వీట్లను పక్కపక్కనే పెట్టి.. ఎవరు ఎవరి ఫొటోను తస్కరించారో చెప్పాలంటూ సెటైర్లు సంధించడం మొదలెట్టారు.
బండి సంజయ్ అదిరేటి సెటైర్
సాయిరెడ్డి, కేటీఆర్‌లు తమ ట్వీట్లలో ఒకే ఫొటో వాడిన వైనంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన శైలిలో సెటైర్ సంధించారు. ఈ సెటైర్ ను కూడా ట్విట్టర్ వేదికగానే పోస్ట్ చేసిన సంజయ్.. “ప్రజారోగ్యం మీద తమ చిత్తశుద్ధిని నిరూపించాలని అనుకోవడంలో ఉన్న చిత్తశుద్ధి… అసలైన చిత్తశుద్ధి చూపించడంలో లేదని చెప్పడానికి ఈ చిత్రాలే నిదర్శనం. ఒకే సినిమా బోలెడు థియేటర్లలో ఆడినట్టు… ఈ ఒకట్రెండు ఫొటోలే అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ షికారు చేస్తున్నాయి. ఇదిగో, పొలాల్లోకి వెళ్లి మరీ వ్యాక్సిన్లు వేస్తున్న మా ప్రభుత్వ గొప్ప చూడండి అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్, ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎలా ట్వీట్లు చేసుకుంటున్నారో చూడండి. అసలు కామెడీ ఏంటంటే… మనుషుల్ని పోలిన మనుషులుంటారని తెలుసు కానీ… ఇలా పొలాల్ని పోలిన పొలాలు, రైతులను పోలిన రైతులు, నర్సులను పోలిన నర్సులు ఉంటారని ఇప్పుడు తెలుస్తోంది. వీళ్ల రాజకీయాలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. కొసమెరుపు ఏంటంటే.. కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్లను ఉచితంగా ఇస్తుంటే ప్రచారం కోసం వీళ్లు పోటీ పడుతున్నారు” అంటూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
Must Read ;- సాయిరెడ్డీ.. ఈ దాగుడుమూతలేంటీ?











