వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో అటు సీబీఐతో పాటు ఇటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చార్జిషీట్లపై కోర్టులు విచారణకు సిద్ధంగానే ఉన్నాయి. రెండు దర్యాప్తు సంస్థలు కూడా ఈ విచారణ కోసం సంసిద్ధంగానే ఉన్నాయి. అయితే తామేమీ తప్పు చేయలేదని, విచారణ తర్వాత కడిగిన ముత్యాల్లా బయటకు వస్తామని చెబుతున్న జగన్ గానీ, జగన్ అన్ని కేసుల్లో ఏ2 నిందితుడిగా ఉన్న వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి గానీ సిద్ధంగా లేరనే చెప్పాలి. ఈ కేసుల్లో ఎలాంటి తప్పూ లేదంటూనే.. ముందుగా సీబీఐ చార్జిషీట్ల మీద విచారణ జరిగాక.. ఈడీ కేసుల విచారణ చేపట్టాలని కోరుతున్న వైనమే వారి సత్యసంధతను ప్రశ్నించేలా చేస్తోంది. అంతేకాకుండా సీబీఐ కంటే ముందుగా ఈడీ విచారణ వద్దంటూ సాయిరెడ్డి చేస్తున్న వాదన ఇప్పుడు మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తోందని చెప్పక తప్పదు. తప్పు చేయకుంటే.. విచారణను నిలుపుదల చేసేలా ఎందుకు సాకులు చెబుతున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
సుప్రీంకోర్టుకు వెళతారట
జగన్ కేసుల్లో ఇటు సీబీఐతో పాటు అటు ఈడీ కూడా ఇప్పటికే చార్జిషీట్లను దాఖలు చేశాయి. విచారణ ప్రారంభం కావడమే తరువాయి. ఇలాంటి నేపథ్యంలో సాయిరెడ్డి ఓ కొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. ముందుగా సీబీఐ చార్జిషీట్ల మీద విచారణ జరిగిన తర్వాతే.. ఈడీ చార్జిషీట్ల మీద విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ వాదనను ఇప్పటికే నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టేయగా.. దానిని తెలంగాణ హైకోర్టు కూడా సమర్థించింది. సాయిరెడ్డి అప్పీల్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది కూడా. ఈ క్రమంలో ఈడీ విచారణకు సిద్ధమైపోయింది. అయితే ఇప్పటికే ఈడీ కోర్టులో ఈ విచారణకు సంబంధించి మూడు వాయిదాలు జరిగినా.. విచారణ మాత్రం ప్రారంభం కాలేదు. దీనికి సాయిరెడ్డి వ్యవహారమే కారణంగా నిలుస్తోంది. సీబీఐ ప్రత్యేక కోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులపై తాను సుప్రీంకోర్టుకు వెళతానంటూ సాయిరెడ్డి చెబుతున్నారు. తాను సుప్రీంకోర్టుకు వెళ్లేదాకా ఈ కేసుల విచారణను వాయిదా వేయాలని కూడా కోరుతున్నారు. దీంతోనే ఈడీ కేసుల విచారణ వాయిదా పడుతూ వస్తోంది.
ఈడీ అసంతృప్తి
ఓ కేసులోని నిందితుడు.. పై కోర్టుకు అప్పీల్ కు వెళతానంటే వద్దని చెప్పే హక్కు ఏ ఒక్కరికీ లేదనే చెప్పాలి. అయితే సాయిరెడ్డి మాత్రం సుప్రీంకోర్టుకు వెళతాను అంటున్నారే తప్పించి.. ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ఓ రెండు వాయిదాలు వేచి చూసిన ఈడీ అధికారులు.. గురువారం జరిగిన విచారణ సందర్భంగా సాయిరెడ్డి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా నేరుగా ఈడీ చార్జిషీట్లను విచారించేందుకు సిద్ధమైన న్యాయమూర్తికి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. సుప్రీంకోర్టుకు వెళతానంటున్న సాయిరెడ్డి.. ఆ మాటతోనే విచారణను వాయిదా పడేలా చేస్తున్నారని, సుప్రీంకోర్టుకు వెళ్లదలచుకుంటే వెళ్లొచ్చని.. అయితే ఆ మాట చెప్పి కేసుల విచారణను వాయిదా వేస్తామంటూ కుదరని కూడా ఈడీ అధికారులు తమ వాదనలను వినిపించారు. మొత్తంగా కేసుల విచారణలను వాయిదా పడే దిశగా సాయిరెడ్డి ఆడుతున్న దాగుడుమూతలను ఈడీ అధికారులు కోర్టు ముందుంచారు. వెరసి తదుపరి వాదనలో సాయిరెడ్డి ఇదే మాట చెప్పి విచారణను వాయిదా వేయించలేరన్న మాట.
Must Read ;- సీబీఐ సత్తా ఏంటో తేలిపోయినట్టే











