నిజమే. తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 14 నుంచి కేంద్ర పాలన మొదలు కానుంది. కేంద్ర పాలన అంటే.. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధిస్తారని అనుకోవద్దు. ఇది కేవలం కేంద్ర పాలనే. ఇప్పటిదాకా స్వతంత్ర భారతావనిలో ఇలాంటి పాలన ఇప్పటిదాకా అమలు కాలేదు గానీ.. సరికొత్తగా ఈ తరహా పాలన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అమలు కానుంది. ఈ పాలన వల్ల లాభం ఉంటుందో.. లేదంటే నష్టమే ఉంటుందో తెలియదు గానీ.. తెలుగు రాష్ట్రాలు మాత్రం ఇప్పటిదాకా స్వేచ్ఛాయుతంగా నిర్ణయాలు తీసుకోగా.. ఇప్పుడు మాత్రం ఆ హక్కును కోల్పోయి.. కేంద్రం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడం అనే కంటే..కేంద్రం చెప్పినట్లుగా నడుచుకోవడం అంటే బాగుంటుందేమో. ఈ తరహా కొత్త పాలనపై పాలనలో అనుభవం ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేస్తే.. పాలనలో ఓనమాలు నేర్చుకుంటున్న ఏపీ సీఎం జగన్ కు మాత్రం ఎలా స్పందించాలో కూడా తెలియడం లేదు.
కేంద్ర పాలన ఎలాగంటే..?
తెలుగు రాష్ట్రాలకు ప్రధాన నదులు గోదావరి, కృష్ణా నదులే. ఈ రెండు నదులు, వాటి ఉప నదుల నీటితోనే సాగు, తాగు నీటి ప్రాజెక్టులను రెండు రాష్ట్రాలు నిర్మించుకున్నాయి. తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలోనే రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిర్మితమయ్యాయి. అయితే ఒకటి, అరా ప్రాజెక్టులు మాత్రమే కొత్తవి. ఇప్పటిదాకా ఈ ప్రాజెక్టులపై.. ఎవరి పరిధిలో ఉన్న వాటిపై తెలంగాణ, ఏపీ నియంత్రణ కలిగి ఉన్నాయి. అంటే.. ఏ స్థాయి మేరకు నీరు నిల్వ చేసుకోవాలి? ఏ స్థాయి వచ్చాక విద్యుదుత్పత్తి చేసుకోవాలి? ప్రయారిటీ విద్యుదుత్పత్తికా? నిల్వకా? అన్న దాదాపు అన్ని విషయాలపైనా ఆయా రాష్ట్రాలకే నిర్ణయాధికారం ఉండేది. అయితే తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం నేపథ్యంలో ఇరు రాష్ట్రాల పరస్పర ఫిర్యాదుల ఫలితంగా.. రెండు రాష్ట్రాల పరిధిలోని ప్రాజెక్టులన్ని ఇకపై కేంద్రం నియమించిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ), కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ల పరిధిలోకి వెళ్లిపోతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు గెజిట్ కూడా జారీ చేసి పారేసింది. ఈ గెజిట్ ప్రకారం ఇకపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాజెక్టులు కూడా బోర్డుల పరిధిలోకి వెళ్లిపోతున్నాయి. ఆ తర్వాత ప్రాజెక్టులపై అటు ఏపీకి గానీ, ఇటు తెలంగాణకు గానీ అధికారమేమీ ఉండదు. గెజిట్ లో పేర్కొన్న మేరకు ఆయా ప్రాజెక్టుల వ్యవహారాలన్నీ కూడా బోర్డులే చూసుకుంటాయి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు అసలు ప్రమేయమే ఉండదు.
బోర్డుల ఖర్చంతా రాష్ట్రాలదే
ఇక్కడిదాకా ఎలాగోలా సర్దుకున్నా.. కేంద్రం పరిధిలోని బోర్డుల ఖర్చులన్నీ కూడా రెండు తెలుగు రాష్ట్రాలే భరించాలట. ఈ విషయాన్ని కూడా కేంద్రం తన గెజిట్ లో చాలా స్పష్టంగానే పేర్కొంది. తాజాగా ఇప్పుడు రెండు బోర్డులకు ఇద్దరేసీ చీఫ్ ఇంజినీర్లను నియమిస్తూ కేంద్రం సోమవారం నాడు ఓ ప్రకటన విడుదల చేసింది. కేఆర్ఎంబీకి టీకే శివరాజన్, అనుపమ్ ప్రసాద్ లను చీఫ్ ఇంజినీర్లుగా నియమించిన కేంద్రం.. జీఆర్ఎంబీకి మాత్రం ఎంకే సిన్హా, జీకే అగర్వాల్ లను చీఫ్ ఇంజినీర్లుగా నియమించింది. ఈ నలుగురు చీఫ్ ఇంజినీర్ల వేతనాలు, ఇతరత్రా అలవెన్సులతో పాటుగా బోర్డు సభ్యులు, సపోర్టింగ్ స్టాఫ్, బోర్డు కార్యాలయాల ఖర్చులను కూడా ఇరు రాష్ట్రాలే భరించాలట. ఈ తరహా పాలనను అక్టోబర్ 14 నుంచి మొదలుపెట్టనున్నట్లుగా కేంద్రం ప్రకటించింది.
Must Read ;- జగన్ కంటే కేసీఆరే తోపు











