మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రానికి సంబందించి ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. మెగా అభిమానుల కోసం ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఆగస్ట్ 22న సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రీ లుక్ విడుదల చేసింది. పిడికిలి బిగించి ఎర్ర శాలువాతో చిరంజీవి హ్యాండ్ ను మాత్రమే ఈ లుక్ లో చూపారు. దీనిని బట్టి ఈ సినిమా సందేశాత్మక చిత్రంగా ఉండనుందని అర్ధమవుతోంది. తాను తీసే ప్రతి సినిమాలో సోషల్ మెసేజ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకునే కొరటాల ఈ సినిమాకి కూడా అలాంటి కథను తీసుకున్నాడని అర్ధమవుతోంది. ఇప్పటికే 40 శాతం షూటింగు పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా ఆగిపోయింది. పరిస్థితులు సర్దుకున్న తరువాత తిరిగి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
కెరీర్ లో అపజయమే ఎరుగని కొరటాల శివ ‘సైరా’ సమయంలో చిరంజీవికి ఈ కథ వినిపించాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో బాటు సోషల్ మెసేజ్ సబ్జెక్టు కావడంతో చిరంజీవి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రీ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం కేటాయించిన ఆయన జనవరి నెలలో ఈ సినిమా షూటింగ్ ఆరంభించారు. దేవాలయాల పేరిట దోపిడీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒక పాత్రలో ఎండోమెంట్ ఆఫీసర్ గా మరో పాత్రలో మావోయిస్టు గా చిరు దర్శనమివ్వనున్నారని తెలుస్తోంది. చిరంజీవికి చార్ట్ బస్టర్స్ ఇచ్చిన మణిశర్మ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే మెలోడీ బ్రహ్మ ఈ సినిమాకు అదిరిపోయే పాటలు ఇచ్చారనే వార్తలు వినబడుతున్నాయి. ఈ సినిమాకి ఆచార్య అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ టైటిల్ నే కొనసాగిస్తారా? లేక మారుస్తారా? అనే విషయం ఈ నెల 22న క్లారిటీ రానుంది. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీతో బాటు మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది.










