నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు టీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. తమ పార్టీ అభ్యర్థి నోముల భగత్‌ని గెలిపించుకునేందుకు నేతలంతా రంగంలోకి దిగారు. ఇక సీనియర్ నేత, దిగ్గజ లీడర్ జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్న విషయం తెలిసిందే. బీజేపీ ఈ సారి పూర్తి స్థాయిలో ఇక్కడ పాగా వేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్నా ఇక్కడ జానారెడ్డి VS TRS అన్నట్లుగానే పరిస్థితి మారింది. ఏప్రిల్ 17న ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ప్రచారం కూడా తుది దశకు చేరుకుంది. ఇప్పటి వరకు ప్రధాన పార్టీలు ప్రచారంలో హోరెత్తించాయి.
టీఆర్ఎస్‌కి కొత్త టెన్షన్..
అయితే టీఆర్ఎస్‌కి కొత్త టెన్షన్ కూడా మొదలైంది. రోడ్డు రోలర్, చపాతీ రోలర్ గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించారు. ఆ ఒక్కటే జరిగితే టీఆర్ఎస్‌కు పెద్ద టెన్షన్ ఉండేది కాదేమో..కాని టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ పేరు మొదటి ఈవీఎంలోనే మూడో నెంబరు క్రమసంఖ్యలో ఉంది. అదే ఈవీఎంలో రోడ్డు రోలర్ గుర్తు, చపాతీ రోలర్ గుర్తు ఉండడంతో టెన్షన్ మొదలైంది. ఈ ఎన్నికల్లో మొత్తం నామినేషన్ల ఉప సంహరణ, తిరస్కరణ తరువాత 41 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఒక్కో ఈవీఎంలో గరిష్టంగా 16గుర్తులే ఉండడంతో మూడు ఈవీఎంలు అవసరం అయ్యాయి. ఒకే ఈవీఎంలో రోలర్ గుర్తులు, టీఆర్ఎస్ కారు గుర్తు ఉండడంతో పార్టీలో చర్చ నడుస్తోంది. గతంలో ట్రక్కు కారణంగా నష్టపోయామని భావించిన టీఆర్ఎస్..ఎన్నికల సంఘానికి లేఖలు రాయడంతో అప్పట్లో ట్రక్కును తెలంగాణ ఎన్నికల్లో గుర్తుల జాబితా నుంచి తత్కాలికంగా పక్కన బెట్టారు. అయితే ఆ గుర్తుకు సంబంధించి టెన్షన్ తగ్గినా.. రోడ్డు రోలర్, చపాతి గుర్తులు కూడా పార్టీని టెన్షన్ పెడుతున్నాయి. దీంతో పార్టీ నుంచి వచ్చిన సూచనల మేరకు టీఆర్ఎస్ నాయకులు ప్రచారంలో భాగంగా మూడో నెంబరు గుర్తు అని ప్రచారం చేస్తున్నారు. గుర్తుపై అవగాహన కల్గిస్తున్నాయి. చివరి క్షణంలో మార్పులు జరిగితే తప్ప.. ఒకే ఈవీఎంలో రోడ్డు రోలర్, చపాతీ రోలర్, కారు గుర్తు ఉండనున్నాయి.
Also Read ;- ముగిసిన ప్రచారం.. ఓట్లను రాబట్టే వ్యూహాల్లో పార్టీలు

గతంలో నష్టం ఇలా..
టీఆర్ఎస్‌ను గత ఎన్నికల్లో కొన్ని గుర్తులు దెబ్బతీశాయి. టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారును పోలిన గుర్తులు ఇందుకు కారణంమని టీఆర్ఎస్ చెప్పింది. 2014లో భువనగిరి పార్లమెంటు స్థానంలో స్వతంత్ర అభ్యర్థికి ఆటో గుర్తు కేటాయించారు. అయితే జనాలకు పెద్దగా తెలియని వ్యక్తికి అప్పట్లో దాదాపు 35వేల ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి డా.బూర నర్సయ్య గౌడ్ గెలిచినా..మెజార్టీ 35వేలకు తగ్గిందని టీఆర్ఎస్ అప్పట్లో ప్రకటించింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తు పోలిన గుర్తులు ఉండడంతో నష్టపోయామని టీఆర్ఎస్ చెప్పింది. నకిరేకల్,పాలేరు, హుజూర్‌నగర్,కామారెడ్డి,సంగారెడ్డి,జుక్కల్ తదితర చోట్ల స్వల్ప మెజార్టీతో ఓడామని, అయితే ఇక్కడ ట్రక్కు,రోలర్ల గుర్తులకు వచ్చిన ఓట్లు ఎక్కువని వ్యాఖ్యానించింది.
భువనగిరి పార్లమెంట్ పరిధిలో..
2019 పార్లమెంట్ ఎన్నికల్లో సైతం భువనగిరి పార్లమెంట్ పరిధిలో ట్రక్కు గుర్తు 27,973 వేలకు పైగా ఓట్లు చీల్చింది. టీఆర్ఎస్ అభ్యర్థి డా. బూర నర్సయ్య గౌడ్‌కు 5,27,576 ఓట్లు కాగా కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డికి 5,32,795 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ 5,219 ఓట్లతో గెలిచింది. ఇక దుబ్బాక ఉప ఎన్నికల విషయానికి వస్తే టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దాదాపు 1118ఓట్లతో గెలిచారు. అయితే ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి బండారు నాగరాజుకి రోటీ మేకర్ గుర్తు కేటాయించగా 3,750ఓట్లు వచ్చాయి. ఇలా..ఆ గుర్తులను కారు గుర్తుగా భావించి ఓటర్లు ఓటు వేస్తున్నారని టీఆర్ఎస్ చెబుతోంది. టీఆర్ఎస్ ఓడిన నియోజకవర్గాల్లో ఇతర పార్టీలకు వచ్చిన మెజార్టీ కంటే స్వంతంత్ర అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఎక్కువని, అందులోనూ రోడ్డు రోలర్, చపాతీ రోలర్ (రోటీ మేకర్), ఆటో, ట్రక్కు గుర్తుల అభ్యర్థులకు వచ్చిన ఓట్లు 3వేలకుపైగా ఉండడాన్ని టీఆర్ఎస్ ప్రస్తావిస్తోంది. ఇవి రంగుల్లో ఉంటే అంతగా ఇబ్బంది ఉండేది కాదని, కాని బ్యాలెట్లు బ్లాక్ అండ్ వైట్ లోనే ఉండడంతో ఈ పరిస్థితి తలెత్తిందని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.
Must Read ;- జానారెడ్డి సీనియార్టీ VS కేసీఆర్ ఇమేజ్ VS మోదీ ఇమేజ్.. సాగర్‌లో పేలుతున్న విమర్శల తూటాలు











